మార్చి 24 నుండి 28వ తేదీ వరకు శ్రీ వేదనారాయణస్వామివారి సూర్యపూజోత్సవం, తెప్పోత్సవాలు

టిటిడికి అనుబంధంగా ఉన్న నాగలాపురంలోని శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామివారి ఆలయంలో వార్షిక సూర్యపూజ మహోత్సవం, తెప్పోత్సవాలు మార్చి 24 నుండి 28వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.

శ్రీమహావిష్ణువు మత్స్యావతార రూపంలో సంవత్సరాల కొలది యుద్ధం చేసి వచ్చినందున, స్వామి దివ్య శరీరానికి వెచ్చదనం కలిగించేందుకు సూర్య భగవానుడు తన కిరణాలను స్వామివారి మీద ప్రసరింపచేయడమే సూర్యపూజోత్సవం. ఈ ఉత్సవంలో ప్రధాన రాజగోపురం నుండి 630 అడుగుల దూరంలో గల మూలవిరాట్టుపై సూర్యకిరణాలు నేరుగా ప్రసరిస్తాయి. మొదటి రోజు స్వామివారి పాదాలపై, రెండో రోజు నాభిపైన, మూడో రోజు స్వామి శిరస్సుపై సూర్యకిరణాలు ప్రసరించి స్వామి దివ్యరూపాన్ని మరింత తేజోవంతం చేస్తాయి.

మార్చి 24 నుండి 28వ తేదీ వరకు జరుగనున్న వార్షిక సూర్యపూజ మహోత్సవం, తెప్పోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకు భక్తులకు సూర్యపూజ దర్శనం కల్పిస్తారు. రాత్రి 7.30 గంటల నుండి 9 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరుగనుంది.

మార్చి 24 నుండి తెప్పోత్సవాలు :

శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మార్చి 24 నుండి 28వ తేదీ వరకు ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు తెప్పోత్పవాలు నిర్వహిస్తారు.

మొదటి రోజు శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణస్వామివారు, రెండవ రోజు గోదాదేవి సమేత వేదనారాయణ స్వామివారు, మూడవ రోజు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు, చివరి రెండు రోజులు శ్రీభూ సమేత వేదనారాయణస్వామివారు తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.

మార్చి 25న ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం జరుగనుంది.

Source