హనుమద్వాహనంపై శ్రీరాముడి తేజసం

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధవారం ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు ఉత్సవం వైభవంగా జరిగింది. భజనలు, కోలాటాల నడుమ స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు.

hanumanta-vahanam

త్రేతాయుగంలో రామభక్తునిగా,  భగవద్భక్తులలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం ద్వారా తెలుస్తోంది. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు. శ్రీవైష్ణవ సాంప్రదాయంలో హనుమద్వాహన సేవను సిరియ తిరువడిగా కీర్తిస్తారు. కావున దాసభక్తికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతారు.

వాహనసేవ అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, వివిధ రకాల పండ్ల రసాలతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.

సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు వసంతోత్సవం, తిరువీధి ఉత్సవం వైభవంగా జరిగింది. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవ వేడుకగా నిర్వహించారు.

సాంస్కృతిక కార్యక్రమాలు


తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు ఎస్‌.వి.సంగీత, నృత్య కళాశాల వారిచే మంగళధ్వని, ఉదయం 7 నుండి 8 గంటల వరకు ధర్మగిరి వేద పాఠశాల ఆధ్వర్యంలో వేదపారాయణం నిర్వహించారు.

శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన శ్రీమతి బి.లక్ష్మీ బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహిస్తారు.

Source