మాఘపౌర్ణమి సందర్భంగా తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం గురువారం నాడు ఘనంగా జరిగింది. శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు ఉదయం 6 గంటలకు ఆలయం నుండి బయల్దేరి తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు ఉదయం 9 గంటలకు చేరుకుంది. అక్కడ స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు.
ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఊంజల్‌సేవ చేపట్టారు. సాయంత్రం 5 గంటలకు అక్కడి నుండి బయల్దేరి రాత్రి 9 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఊరేగింపులో టిటిడి హిందూధర్మ ప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భజనలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి.
Source