ప్రధానంగా, హిందూమతంలో మూడు, నాల్గు విశేషమైన లక్షణాలున్నాయి. ప్రధమంగా హిందూమతం ప్రకారం ఈశ్వరుని రెండు పద్ధతుల్లో ఆరాధించగలం. మరొకమతం ఏదీ అలాంటి దానికి అవకాశమివ్వడు. ఇతర మతాల్లో సర్వాంతర్యామి ఒక్కడే సూచింపబడుతాడు. కాని హిందూ మతానుసారం అతడు సర్వాంతర్యామియే గాక విశేష రూపాల్లో కూడ దర్శనమిస్తాడు. మన దేవుడు నిర్గుణుడు, నిరాకారుడు, ఐనా మరొక విధంగా సాకారుడు, సగుణుడు. ఆ విధంగా మనం భగవానుని రెండు రకాలుగా ఆరాధించగలం. దేవుడు నిజానికి రాముడు కృష్ణుని రూపాల్లో అవతరిస్తాడు. మామూలు మానవుల్లోనూ ఉంటాడు. ఆయన మహాపురుషులుగాను, దివ్యరూపులు లేక పరమాత్ములుగాను కూడ అవతరిస్తాడు. భగవానుడు మనకు శుభాలను కలుగచేయడానికి తన కరుణను మనమీద ప్రసరింపచేయడానికి అనేకరూపాల్లో భూలోకానికి వేంచేస్తాడు. మరే ఇతర మతం కూడ ఇలాంటి భావనకు తావివ్వదు.
ఇతర మతాలు సర్వాంతర్యామి యగువాని నొకనిని గురించే మాట్లాడుతాయి. మనం నియమిత రూపాల్లో భగవంతుని ఆరాధించగలం అనే అంశం మన హిందూమతం యొక్క ప్రత్యేక లక్షణం. అలా మనకు విగ్రహారాధన లేక మూర్తిపూజ అనే విధానమున్నది. విగ్రహారాధన లేక మూర్తి పూజ దీని వెనుక ఒక ప్రత్యేక ప్రాముఖ్యాన్ని ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని కలిగి ఉంది. మన మనస్సుల్లో భగవంతునికి ఒక ప్రత్యేకరూపకల్పన చేసుకొని ఆరాధిస్తాం. అదేవిధంగా దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్ఠ చేస్తాం. వాటిలో దైవసాన్నిధ్యాన్ని, దైవశక్తిని సృష్టించుకొని ఆరాధించి ఆ దేవతల యొక్క ఆశీస్సులను పొందుతాం.
గృహస్తులకు భగవంతుని సర్వాంతర్యామి రూపంలో ఆరాధించడం కష్టసాధ్యమైన విషయం. సర్వాంతర్యామిని ధ్యానించుట కొరకు కళ్ళు మూసుకోవటం ఆరంభించగానే వారి చక్షువులు, శ్రోత్య్రేంద్రియాలు, మనస్సు పరిపరివిషయాలపై సంచరించటం ప్రారంభిస్తాయి. కావున మామూలు గృహస్థులు సాకార సగుణ రూపంలో ఒక ప్రత్యేక దేవతామూర్తిగా భగవంతుని భావించాలి. ప్రపంచంలో ఎంతమంది మానవులున్నారో అన్ని రూపాలు ఈశ్వరునకున్నాయి. భగవంతుడు ఒక రూపాన్ని, ఆకారాన్ని స్వీకరించి మనకు శుభాల్ని ఇచ్చుటకు మన వద్దకు దిగుతాడు. మనం ఆశిస్తున్న ఫలితాల దృష్ట్యా మనం ఆయన యొక్క ఏ రూపాన్ని ఇష్టపడతామో దాన్నే ఆరాధిస్తాం.
గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు
''ఆర్తో జిజ్ఞాసురద్ధార్థీ జ్ఞానీ చ భరతర్షభ||''
ప్రపంచంలోభక్తులు నాలుగు రకాలు
- ఏదో విషయంలో వ్యధ చెందుతున్నవారు, రోగగ్రస్తులైనవారు
- ధనాశాపరులు
- కొన్ని పనులను నిర్వర్తింపజేయ దలచిన వారు
- ఆఖరుగా పరమాత్ముని గురించి ఎరుకకై తాపత్రయపడువారు
అందరూ వారివారి కోర్కెలు సఫలీకృతం చేసుకోవడానికి అనుకూలమైన రూపాన్ని ఎన్నుకొని ఆ రూపంలో భగవంతుని ఆరాధిస్తారు. ఉదాహరణకు విఘ్నాలు రాకుండా ఉండడానికి వినాయకుని ప్రార్థిస్తారు. సంపద కోసం అగ్నిని, ఆరోగ్యం కోసం సూర్యుని, జ్ఞానసిద్ధికోసం శివుని లేక దక్షిణామూర్తిని, మోక్షప్రాప్తి కోసం విష్ణువును ఆరాధిస్తారు.
వినాయకుడు విఘ్నాల్ని నివృత్తిచేస్తాడు. విద్యార్థులు తమ పరీక్షల కాలంలో పరీక్షల్లో ఉత్తీర్ణులు కాగోరి ఆయన్ని ఆరాధించడం గమనిస్తాం. ఫలితాలు లభిస్తాయనే కోరిక ప్రేరణతో వారు వినాయకుని ఆరాధింప మొదలుపెడతారు. ఈ ప్రేరణే ఒక ప్రత్యేకమైన దేవత యందు భక్తిని పెంచుతుంది. అదేవిధంగా సంపద మిక్కుటంగా కోరుకునేవారు సత్యనారాయణ స్వామిని లేక లక్ష్మీదేవిని ఆరాధించడానికి ఉద్యుక్తులౌతారు.
కాని యధార్ధానికి వీనిలో ప్రతిరూపం పరమాత్మది మాత్రమే. వినాయకునికి విఘ్నాలు తొలగించే శక్తి ఉందంటే అది ఆయనకు మాత్రమే ఉందని కాదు. ఆయన కూడ పరమాత్మయే. భక్తుల్ని ఆకర్షించటానికి విఘ్నాల్ని నిర్మూలించే ప్రత్యేక శక్తిని ఆయన ప్రదర్శిస్తాడు. అలాగే లక్ష్మీదేవి కూడ పరమాత్మ స్వరూపిణే. ఆ దేవి ధనాపేక్షగల భక్తుల్ని ఆకర్షించడానికి ధనలక్ష్మియై సంపదలను ప్రసాదించే శక్తిని ప్రదర్శిస్తుంది. కొన్ని పనులను పూర్తిచేసే ప్రభావాన్ని ప్రదర్శించడం ద్వారా ఈ వివిధమైన రూపాలు భక్తుల్ని ఆకట్టుకుంటాయి.
మన సమాజంలో భగవంతునిపట్ల భక్తి ఉంది. కాని దురదృష్టమేమంటే మనమతం పట్ల ధర్మం విషయంలో అదేభక్తి కనిపించదు. ఈశ్వర భక్తితోబాటు మనం మన మతం యొక్క మూల సిద్ధాంతాలలోని విషయాన్ని తెలుసుకోవాలి. మన మతంపై అచంచల విశ్వాసాన్ని స్థిరపరుచుకోవాలి. దీనికోసం మన మతం యొక్క మూలమైన, ప్రధానమైన అంశాల్ని అవగాహన చేసుకోవటం అవసరం.
దేవతారాధన కోసం మనం దేవాలయాల్ని నిర్మించాం. ఇతర మతాల్లో వారి ఆరాధనాస్థలాలు, ప్రార్థనామందిరాలు తప్ప విగ్రహ ప్రతిష్ఠ అనే ప్రసక్తే ఉండదు. ఒక విశాలమైన హాలులోనే సమావేశమైన ప్రజలు ప్రార్థనలు చేస్తారు. మన మతంలో అలా ఉండదు. మన విగ్రహాలు దైవత్వాన్ని వాటియందు కలిగి ఉంటాయి. ఒక నిర్ణీత దినం వరకూ శిల్పి దానిమీద నగిషీపని చెక్కుతూనే ఉంటాడు. కానీ ఆ మరునాడే మనం దీపహారతి, అభిషేకం మొదలైన కార్యక్రమాలు ఆరంభిస్తాం. విగ్రహం శక్తిని, చైతన్యాన్ని పొందుతుంది.
ఇతర మతస్థుల ప్రార్థనామందిరాలను అచట సమావేశమయ్యే ప్రజల సంఖ్యను బట్టి, అందరూ ఒకే పర్యాయం ప్రార్థనలు సలుపుకొనుటకు వీలుగా నిర్మిస్తారు. కాని మన దేవాలయంలో భక్తులు ఒకరి తర్వాత మరొకరు ప్రవేశించాలి. అందరూ ఒకే పర్యాయం గుంపుగా గుడివద్దకు ప్రవేశించకూడదు. ప్రజలసమూహం ఎంతఉన్నా, గర్భగుడి వద్దకు ఒకరొకరుగా నిర్దేశించిన క్రమశిక్షణననుసరించి, వెళ్ళి ప్రార్థనలు చేయాలి. మన దేవాలయాలు కొంత పవిత్రతతో, దైవత్వంతో నిర్మింపబడ్డాయి. ప్రతి దేవాలయానికి, విగ్రహానికి వెనుక ఒక చరిత్ర ఉంటుంది. ఆవిధంగా మన దేవాలయాలు, విగ్రహాలు లేక దేవతలు దైవశక్తితో భాసిల్లుతున్న స్థలాలుగా రాణిస్తాయి. దేవాలయాలు, దేవతావిగ్రహాలు ఆగమశాస్త్రం ప్రకారం నిర్మిస్తారు.
ఇతర మతస్థుల ప్రార్థనా మందిరాలు చాలా ప్రశాంతంగా ఉంటాయని, మన హిందూ దేవాలయాలు మాత్రం నిత్యం సందడితో, మ్రోతలతో ఉంటాయని కొంతమంది అంటారు. మన గుళ్ళలో రెండురకాలైన సందడులుంటాయి. గంటల మోతలు, మంగళవాయిద్యాల ధ్వనులు, అర్చనా సవ్వడులు, నామావళి పఠన, మంత్ర స్వరాలు మొదలైనవి మొదటి తరగతి ధ్వనులు. ఇవి అభిలషణీయమైనవే. సమావేశాలలో ఒకరితోనొకరు చేయు అనవసర సంభాషణలు, గుసగుసలు మొదలైనవి రెండవ వర్గానికి చెందినవి. ఈ రెండవది అభిలషణీయం కాదు. దేవాలయాల్లో ఈ అనవసరమైన సందడులను తగ్గించుటకు ప్రయత్నాలు చేయాలి.
ఇతర మతస్థుల ఆలయాల్లో ప్రశాంతత నెలకొని ఉండడానికి కారణముంది. వారికి ఒకే విశాలమైన ప్రార్థనామందిరం ఉంటుంది. అక్కడే ప్రార్థనలు చేస్తారు. ప్రార్థనాగీతాల్ని మానసికంగాను, సామూహికంగాను పాడుతారు. ఎవరిదోవన వారు నిష్క్రమిస్తారు. కొంతమంది నిమీలిత నేత్రాలతో ధ్యానం చేసి, ప్రార్థనలు సలిపి మానసిక శాంతిని పొంది వెళ్ళిపోతారు. కానీ మన ఆలయాల్లో అభిషేకం, అర్చన, కర్పూరహారతి, దీపహారతి, నైవేద్యం, భక్తులకు ప్రసాదం ఇవ్వటం మొదలైన తతంగాలు చాలా ఉంటాయి. ఇంకా మంగళవాయిద్యాలు, చామరసేవ లాంటి ఉపచారాలు కూడ మనకున్నాయి.
ఈవిధంగా మన విగ్రహాల్లో దైవత్వం ఆపాదించబడి యుంది కనుక, ఈ విగ్రహాల్ని మనం ఆరాధించినప్పుడు మనం మన పాపాలు హరింపబడటమే కాక మన దారిద్య్రం కూడ నిర్మూలింపబడుతుంది. మనం ఒక విగ్రహంలో కేవలం రాతిని మాత్రమే చూడడం, అందొక భగవత్స్వరూపాన్ని దర్శిస్తాం. దానిని ఒక సౌందర్యమూర్తిగా భావిస్తాం. ఆవిధంగా హిందూమతంలో విగ్రహారాధన ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకొంది.