కానీ హిందూమతం విషయంలో దాని పుట్టుకను గాని, దాని వయస్సును గాని నిర్ణయించలేరు. కనుక దానిని అతి ప్రాచీనమైందని, సనాతనమైందని అంటారు. దీనికి వ్యవస్థాపకులే లేరు గనుక ఈ మతం ముందు ఏ వ్యవస్థాపకుని పేరు
ఉండదు. సృష్టి ఆరంభం నుండి అమలులోనున్నది హిందూమతం ఒక్కటే గనుక, దానికి భిన్నంగా మరొక మతమంటూ ఏదీ లేని కారణంగా ఈ మతాన్ని ప్రత్యేకమైన మరొక పేరుతో ప్రచారం చేయవలసిన అవసరం లేదు. మిగతా మతాలు అలా కాకుండా చరిత్రలో ఒక నిర్దిష్టమైన సమయంలో స్థాపింపబడి ప్రచారంలోకి వచ్చాయి గనుక వాటిని గుర్తించడానికి వీలుగా వివిధములైన పేర్లు కలిగి ఉన్నాయి.
హిందూమతానికి ఆరంభం లేదు గనుక వయో నిర్ణయం కూడ లేదు. కానీ చరిత్రకారులు ఏవో గుణకారాలు వేసి దాని వయ: ప్రమాణం 6000 సంవత్సరాలు అని కొందరూ, 10,000 సంవత్సరాలు అని, 20,000 సంవత్సరాలు అని మరికొందరూ ప్రకటిస్తారు. ఆ వాదాన్ని అంగీకరించిన పాశ్చాత్య విజ్ఞానులు మన మతం చాలా ప్రాచీనమైందని ఆమోదించారనే విషయం రూఢి అవుతుంది. మన మతం కొన్నివేల సంవత్సరాలకు పూర్వం పుట్టిందనే వాదాన్ని పరిగణలోకి తీసుకున్నా, దీనిని ఎవరు స్థాపించారు, ఏ సంవత్సరంలో స్థాపించారు అనే విషయాల్ని ఎవరూ నిర్ధారించలేకపోవడం యదార్ధం. ప్రపంచం సృష్టి జరిగినప్పటినుండీ మన మతం ఉంది. భగవంతుడు ఫలానప్పుడు జన్మించాడని ఎవరైనా చెప్పగలరా? అలాగే హిందూమతం కూడా. అతి ప్రాచీనమైన మతం హిందూమతం ఒక్కటే. భగవంతుని పుట్టుకకు ఎవరూ కారణం కానట్లే హిందూమతానికి కూడా. హిందూమతం ఆ విధంగా పరమాత్మునితో సామ్యం కలది. ఇది అనాది అయింది, ఆరంభం లేనిది.
ఏ విషయంలో మనం కాలనిర్ణయం చేయలేమో, దేనికైతే ఆరంభం సూచింపబడదో దానినే అనాది అంటాం. హిందూమతం లాగానే మన ఆరాధనా విధానం కూడా అనాదియైందే. అనాది అనే అర్థంలో ఈ మతం ఎవరిచేతా స్థాపింపబడలేదని, దీని ప్రారంభానికి చరిత్రలో కాలనిర్ధారణ ఏమీ లేదని సూచింపబడుతుంది. ప్రాచీన యుగాలనుంచి మనకు ఈ మతం సంక్రమించింది. దీనికి జాతకంలేదు. దేనికి జాతకముండదో దాన్నే అనాది అంటారు. దేనికి జాతకం ఉంటే దానికి పుట్టుక, కాలనిర్ణయమైనట్లే. పుట్టుక వుంటే మరణం దాని వెంట ఉన్నట్లే. శ్రీ కృష్ణుడు గీతలో చెప్పినట్లు ''జాతస్య హి ధృవో మృత్యు:''.
హిందూమతానికి జాతకం లేదు కనుక కాలపరిమితిలేదు. మృత్యువు అసలే లేదు. పుట్టినబిడ్డకు చావు తప్పనిసరి. పుట్టని బిడ్డకు మృత్యువు ఎలా ఉండదో హిందూమతానికి కూడ పుట్టుకా లేదు, అంతమూ లేదు.
అంతేగాక ఇతర మతాల పవిత్రగ్రంథాలు ఒక నిర్ణీత నామంతో ఉంటాయి. కానీ హిందూమతానికి పవిత్ర రూపాలైన వేదాలు ఎప్పుడు పుట్టాయో మనం నిర్ణయించలేము. మానవ స్థాపితాలైన మతాల విషయంలో మత ప్రవక్తలయొక్క ప్రవచనాల నుండి అధికారికమైన సూక్తులను తీసుకుని క్రోడీకరించి పవిత్ర గ్రంథాలుగా వెలువరించడం జరిగింది. హిందూమతానికి మాత్రం అలా కాక ఆది, ఆరంభం లేని వేదాలే ప్రామాణిక గ్రంథాలుగా రూపొందాయి. భగవానుని యొక్క ఉచ్ఛ్వాసనిశ్వాసాలే వేదాలుగా భావింపబడుతున్నాయి. సృష్టికర్తే వీటిని స్వయంగా మనకు ప్రసాదించాడు. భగవంతునిచే ప్రసారం చేయబడిన వేదాలే ధ్వనులే వేదాలుగా ఏర్పడి యుగయుగాలనుంచి ఆనోటా ఈనోటా మనకు లభించాయి. ఆ విధంగా మన మతం గ్రంథ పఠనం ద్వారా కాని, గ్రంథస్థ విషయాల ఆధారంగా కాని కాక కేవలం అనుభవం ద్వారా పరిణమించినదే. మిగిలిన మతాలవారు వారికేమైనా సందేహం వస్తే వారి వారి పవిత్ర గ్రంథాలు చూడాల్సి రావచ్చును.
కాని హిందూ మతానుయాయులకు అలాంటి ఆవశ్యకత జనించదు. వేదాలు, పాఠ్యపుస్తకాలు కాదు. అవి భగవంతునిచేత ఉచ్ఛరింపబడిన శబ్దాలు మాత్రమే. వేదాలు అర్థ సహితమైన శబ్దాలను ప్రతిబింబించే మంత్రాలను కలిగి ఉంటాయి. వేదపఠనం వల్ల మన మనస్సులు అచంచలత్వాన్ని పొందుతాయి. ఇతర మతాల్లో శంకలకు అవకాశం ఉండవచ్చు. కానీ మనమతంలో ఎలాంటి అవకాశం లేదు. ఇతర మతాల్లోకి పోయేవారి శాతం చూస్తే అది రెండు వంతుల్లో ఒక వంతు ఉండవచ్చు. ఈ అరశాతం కూడా ఆర్థిక ప్రయోజనం లేక వృత్తిపరమైన అవకాశాలు లాంటి ప్రత్యేక కారణాలవల్ల మాత్రమే. వేదాల్లో మన సంశయ నివృత్తి చేయుటకు, మనకు సుఖశాంతులను కలుగచేయుటకు కావాల్సిన సాధనాలున్నాయి.
హిందూమతానికి ఇతర మతాలకు గల తేడాను ఈ చిన్న ఉదాహరణతో వివరించవచ్చు. పట్టణాల్లో ప్రధానమైన తారురోడ్డు ఉంటుంది. కాలిబాట ఉంటుంది. ప్రధానమైన రోడ్డు రోడ్డు దూరపు తోవను, కాలిబాట దగ్గర మార్గాన్ని సమకూరుస్తాయి. ప్రధానరోడ్డుకు సాధారణంగా ఒక ముఖ్యమైన వ్యక్తి పేరు పెడతారు. దానిని అమిత వ్యయంతో నిర్మిస్తారు. అట్టహాసంగా ప్రారంభోత్సవం చేసి గాని ఆ రోడ్డును సంధిస్తూ పట్టణంలోని పలు ప్రాంతాల నుండి రోడ్లు నిర్మింపబడతాయి. అన్ని రకాల వాహనాలు ఉపయోగించడానికి వీలుగా ఈ రోడ్డు విశాలంగాను, అన్ని హంగులతోను తయారుచేయబడుతుంది. నేను లక్ష్మీబాయి నగర్ నుండి ఉత్తరస్వామిమలై దేవాలయం చేరడానికి ప్రయాణిస్తుండగా దేవాలయం చాలా దగ్గరలో అనగా ఒక ఫర్లాంగు దూరంలోనే ఉన్నట్లు కనిపించింది. కాని రోడ్డుమీద ఎక్కువదూరం ప్రయాణం చేస్తేనే గాని దేవాలయాన్ని చేరలేకపోయాం. అదే కాలిబాటను ప్రయాణంచేస్తే తక్కువదూరం నడచి తక్కువకాలంలో గమ్యస్థానం చేరగలం.
కాలిబాట ఎవరు ఎప్పుడు ప్రారంభించారో ఎవరికీ తెలీదు. దానికి ప్రారంభోత్సవం అంటూలేదు. మరమ్మతులు లేవు. ఎవరో, ఎప్పుడో దాన్ని ప్రారంభించి ఉంటారు. దాన్ని ప్రారంభించిన వారి పేరుగాని, మొట్టమొదట దానిపై నడిచిన వారి పేరుగాని మనకు కనిపించవు.
ప్రజలు దానిపై సంచరిస్తున్నంత వరకూ ఆ బాట స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలు నడవడం ఆపివేస్తే గడ్డి, ఇతర మొక్కలు దానిపై వ్యాపిస్తాయి. దానిపై ప్రమాదాలకు అవకాశంలేదు. మరమ్మతుల కొరకై మూసివేయబడడం, ఫలితంగా మరొక మార్గాన్ని ఎన్నుకోవడమనేది సంభవించదు. అదే ప్రధాన మార్గాలైతే ప్రమాదాలు జరగటంవల్ల, మరమ్మతుల నెపంతో వాటిని కొంతకాలం మూసివేయడం జరుగుతుంది. కాలిబాట విషయంలో అలాంటివాటికి అవకాశంలేదు. ప్రజలు ఎల్లప్పుడు దానిని ఉపయోగించవచ్చు. గమ్యస్థానాన్ని శీఘ్రగతిని నిశ్చయంగా చేరవచ్చు.
హిందూమతాన్ని కాలిబాటతో పోల్చవచ్చు. కాలిబాటకు వలెనే ఈ మతానికి కూడా ప్రారంభకులులేరు. మన ప్రాచీనులు కాలిబాటను ఉపయోగించి మనకు అందచేసారు. దాన్ని ఉపయోగించడం మానితే గడ్డి మొదలైనవి వ్యాపించి ఆ త్రోవను మరుగుపరుస్తాయి. నిజానికి బాటను ఎంత ఎక్కువమంది ఉపయోగిస్తే అది అంత మంచి స్థితిలోను, పరిశుభ్రతతోను రాణిస్తుంది. కాని మనుష్యులు అతి కష్టంతో, మిక్కిలి వ్యయంతో నిర్మించి నిర్వహిస్తున్న ప్రధాన మార్గాల విషయంలో ఇవేవీ వర్తించవు. ప్రధానమార్గాలు ఏవైనా కారణాలవల్ల అప్పుడప్పుడూ మూసివేయడం జరుగుతుంది. కానీ కాలిబాట మూసివేయడంగానీ, నశించడం గానీ జరుగదు. కాలిబాట వలెనే హిందూమతానికి కూడ ఆరంభంలేదు. అంతమూలేదు. నిత్యత్వంతో భాసిస్తుంది.
ఇంకా చెప్పాలంటే కాలిబాటకు నిర్దేశిత గమ్యం ఉంది. కాని ప్రధాన మార్గాలకి గమ్యమేలేదు. అంతేగాక రహదారి కూడలికి చేరినప్పుడు దారితోచని స్థితి ఏర్పడుతుంది. అక్కడ మార్గాల్ని, ప్రదేశాల్ని నిర్దేశించే సూచికలుంటే తప్ప బాటసారికి తాననుసరించవలసిన త్రోవ అగమ్యమవుతుంది.
కాని కాలిబాటననుసరించి మనం ప్రయాణం సాగిస్తే గమ్యాన్ని సులభంగా, నిశ్చయంగా చేరుతాం. హిందూమతం కాలిబాట వంటిది. దాన్ని అనుసరిస్తే మార్గ సూచికల సహాయం లేకుండానే లక్ష్యస్థానాన్ని అతిశీఘ్రంగా చేరుతాము. చాలామంది ఈ మార్గాన్ని ఎన్నుకుని గమ్యస్థానాన్ని చేరుకున్నారు. గనుక ఈ సందర్భంలో మనం సంకోచించాల్సిన పనిలేదు. ఇతర మతాలన్నీ మానవ నిర్మితాలైన తారురోడ్డులాంటివి.
మన మతాన్ని ఒక రక్షకభటునితో పోల్చవచ్చు. మన మతం ఏక ధృవాభిముఖత కలిగిన మతం కాదు. రక్షకభటుడు తన విధి నిర్వహణ కాలంలో ఒక రకమైన దుస్తులుధరిస్తాడు. ఆ సమయంలో అతనికి నిర్ణయింపబడ్డ కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు. అతడే ఇంటికి వచ్చి వేరొక వస్త్రధారణ చేసి గృహోపయోగమైన విధులను నిర్వర్తిస్తాడు.
అట్లే మనకు మనం అనుసరించవలసినవి రెండు రకాలైన ధర్మాలున్నాయి. ఒకే ధర్మాన్ని ఎల్లవేళలా అనుసరించకూడదు. మనం ఆఫీసులలో విధులను నిర్వహించేటప్పుడు పాటించవలసిన ధర్మంవేరు. ఇంటివద్ద జరుగు కార్యకలాపాలోల పాల్గొనే సమయంలో అనుసరించాల్సిన ధర్మం మరొకవిధమైంది. ఆవిధంగా మన ధర్మం ద్వంద్వ ప్రమాణాల్ని కలిగి ఉంటుంది.
ఏ సమయంలో ఏ విధమైన ధర్మం పాటించాలో అలా అనుసరిస్తే మనకు దైవకటాక్షం సిద్ధిస్తుంది. అలాకాక ఆఫీసులోను, ఇంటివద్ద కూడ ఒకే ధర్మాన్ని అనుసరిస్తే అది క్రమశిక్షణా రాహిత్యానికి, సంఘర్షణకు, అస్థిమితతకు, మానసిక అశాంతికి దారితీస్తుంది. సారాంశమేమంటే హిందూమతం ప్రాచీనమైన కాలిబాట వలె ఆదిలేనిది. అపౌరుషేయమైనది. కాలిబాట ఉపయోగిస్తున్నంత వరకూ దృశ్యమానమై ప్రకాశిస్తుంది. అలాకానిచో గడ్డి, ఇతర మొక్కలు పెరుగుదల వలన మరుగునపడే అవకాశముంది. మామూలుగా ప్రధాన మార్గాలు అనేక కారణాలవల్ల నిరుపయోగమౌతాయి. అప్పుడు కాలిబాటలే శరణ్యమవుతాయి. ఇవి గమ్యాన్ని అనతికాలంలో చేరడానికి దోహదమిస్తాయి. కాలిబాటలు తాత్కాలికంగా అగమ్యంగా మారినా అవి పూర్తిగా నిరుపయోగదశకు పరిణమించవు. భగవానుడు ఆ బాటలను పునరుద్ధరించడానికి అవతరిస్తాడు. శ్రీకృష్ణుడు గీతలో ఇదే విషయాన్ని ఇలా చెప్తాడు.
శ్లో|| యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |
అభ్యుర్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం ||
ఈ సందర్భంలో ఆయన గ్లాని అనే మాటను వాడతారు. నాశనం అనే మాటను వాడడు. ఆ దశను క్షీణదశ అని అంటాడు కానీ నశింపు అని నుడువడు. మన హిందూమతానికి పుట్టుకలేదు గనుక నాశనం కూడా లేదు. అందుచేత మధ్యకాలంలో అది కొంత క్షీణదశను పొందవచ్చు. ఆ దశ నుండి దాని దానిని సహజస్థితికి తెచ్చుటకు భగవానుడు మహాపురుషుల రూపంలోనో లేక జ్ఞానుల రూపంలోనో అవతరిస్తాడు.
ఇతర దేశాల్లో భగవానుడు దూతల రూపంలో భూలోకానికి వస్తాడు. కాని మనదేశంలో భగవానుడే స్వయంగా రాముడు, కృష్ణుని రూపంలో అవతారాలెత్తి లోకాన్ని ఉద్ధరించాడు. కలియుగంలో మనమింకా ప్రథమపాదంలో ఉన్నాం. గనుక పరమాత్ముడు కల్కిగా అవతరించడానికి చాలాకాలం పడుతుంది. భక్తవిజయంలో మన దేశాన్ని ఉద్ధరించిన మహాత్ముల, మహర్షుల యొక్క జీవితచరిత్రలు వర్ణింపబడ్డాయి.
మన మతాన్ని పునరుజ్జీవింపచేయడానికి సంత్ జ్ఞానేశ్వర్ లాంటి వేలకువేలు జ్ఞానులు వివిధ కాలాల్లో ఉదయించారు. మతం పూర్తి క్షీణదశకు చేరితేతప్ప భగవానుడు తనకై తానే అవతరించడు. మిగతాసందర్భాల్లో తన అంశలున్న తన ప్రతినిధులను మాత్రమే పంపుతాడు. కనుక ఏ సందర్భంలోను మనమతం నశింపుకు గురికాదు.
కొన్ని పరిసరాల ప్రభావం వల్ల మనమతం క్షీణదశకు చేరుతున్నట్లు, ప్రజలు కష్టాలకు గురియౌతున్నట్లు తోచవచ్చు. యదార్థంగా ప్రస్తుతం దేశం అంతా బాధల వలయంలో చిక్కుకుంది. ఈ పరిస్థితుల్లో మనం చేయాల్సిందల్లా అనాదియైన మనమతాన్ని ఆశ్రయించి దాని అడుగుజాడల్లో నడచుకోవటమే. దురదృష్టమేమంటే అనాదియైన మన మతం ప్రస్తుతం అనాధగా మారింది. ఐదా నిస్పృహ చెందనవసరం లేదు. మహాపురుషులు వెనుక జన్మించారు. ఇప్పుడూ పుడతారు. ప్రతివాడు తన అనుష్ఠానాన్ని, ఆచరణలను, కార్యాల్ని, విధులను విశ్వాసంతో శ్రద్ధతో నిర్వహిస్తే చాలు.
క్షీణదశ చిహ్నాలు కనిపించినపుడు పునరుజ్జీవనోత్సుకత ప్రదర్శించాలి. కాలిబాట గడ్డితో మరుగుబడుటను నివారించడం మనవిధి. దానిని సురక్షితంగా నిర్వహించాలంటే ఆ బాటపై మన గమనం నిత్యం సాగించటమే. సిద్ధాంతాల్ని వల్లెవేస్తే చాలదు. వాటిని అమలులో పెట్టడం ప్రారంభించాలి. విజ్ఞానదాయకమైన విషయాల్ని విన్నప్పుడు వాటిని ఆచరణలో పెట్టడానికి
ఉపక్రమించాలి. అర్జునుడు కృష్ణుని ఉపదేశాలను విని ఊరుకోలేదు. వాటిని ఆచరించడం ప్రారంభించాడు. హిందూమతం సిద్ధాంతాల ఆచరణకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. మత ప్రవచనాలు విని ఆ ప్రబోధాలను ఆచరణలో పెట్టినప్పుడే మనకు పూర్తి ప్రయోజనం సిద్ధిస్తుంది. మనకు నిర్ణయింపబడిన విధులను, ధర్మాలను శ్రద్ధతో నిర్వర్తించాలి. తండ్రి తండ్రిగా తన ధర్మాన్ని, తల్లి తల్లిగా తన ధర్మాన్ని, అలాగే కూతురు, ఉపాధ్యాయుడు మొదలైన వారందరూ ఎవరి ధర్మాల్ని వారు సక్రమంగా విశ్వాసంతో నిర్వర్తిస్తే తిరిగి మనమతం పూర్వంవలె ఉజ్జ్వలంగా ప్రకాశిస్తుంది.
కనుక మనమందరం సమిష్టి బాధ్యతతో, మన హిందూమతం యొక్క ప్రధానాంశాల అవగాహనతో మన మతానికి సంభవించిన క్షీణతను అన్నివిధాలా అరికట్టి దాని పునరుజ్జీవనానికై కృషి చేయాలి. ప్రతివాడు తన విధిని సక్రమంగా నిర్వర్తిస్తే ఆదర్శవంతమైన వాతావరణం ఎల్లెడల ప్రవర్తిస్తుంది. ప్రపంచం మనం చిత్రించుకున్నట్లుగా అంత చెడుదశలో లేదు. కనుక మన కర్తవ్యాన్ని మనం చిత్తశుద్ధితో నిర్వహించ గలిగితే హిందూమతం యొక్క పునరుజ్జీవనం ఉజ్జ్వలంగా సమకూరేటట్లు చేయవచ్చు.