అంగరంగ వైభవంగా ద్రాక్షారామ భీమేశ్వరుని కళ్యాణోత్సవాలు

పంచారామాల్లో ఒకటిగా, శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠంగా భాసిల్లుతూ భూకైలాసంగా పిలువబడే ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయంలో మాఘ శుద్ధ దశమి తత్కాల ఏకాదశి అంటే జనవరి 27 నుంచి భీమేశ్వరస్వామి కళ్యాణోత్సవాలు ఘనంగా జరిగాయి.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేరోజున ఒకే వేదికపై ముగ్గురు దేవతామూర్తులైన మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి, చండికా సమేత సూర్యేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీ సమేత నారాయణ స్వామివార్ల కళ్యాణ మహోత్సవాలు అంగరంగవైభవంగా జరిగాయి.
కళ్యాణోత్సవాల్లో భాగంగా జనవరి 30న రథోత్సవం, 31న వసంతోత్సవం, ఫిబ్రవరి ఒకటిన తెప్పోత్సవం కన్నులపండుగగా జరిగాయి. ఫిబ్రవరి రెండున పుష్పోత్సవంతో కళ్యాణోత్సవాలు ముగిసాయి.

మొదటిరోజు


మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి కళ్యాణోత్సవం సందర్బంగా తొలిరోజు ఉదయం 5.31 నిముషాలకు మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి, చండికా సమేత సూర్యేశ్వరుడు, లక్ష్మీ సమేత నారాయణస్వామి వార్లను పెండ్లి కుమార్తెలు, పెండ్లి
కుమారులుగా తీర్చిదిద్దారు. సాంప్రదాయ సిద్ధంగా పసుపు కొమ్ములు దంచడంతో కళ్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అధికారులు అమ్మవార్లకు పెండ్లి వస్త్రాలను సమర్పించారు. ఉదయం భీమేశ్వర స్వామివారికి
రుద్రాభిషేకం, అమ్మవారికి సహస్ర గులాబీల అర్చన నిర్వహించారు. మధ్యాహ్నం కాలార్చన, రాజభోగం నిర్వహించారు. నాలుగు గంటలకు అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలను చేపట్టారు. స్వామివార్లను నందివాహనంపై అధిష్టింపచేసి సాయంత్రం
గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం రాత్రి 10.55 గంటలకు ఆకాశమంత పందిరి, భూదేవంత పీట వేసి ముగ్గురు మూర్తులకు ఘనంగా కళ్యాణాన్ని నిర్వహించారు.

రెండవరోజు


ముగ్గురు మూర్తుల కళ్యాణోత్సవాల్లో భాగంగా రెండవరోజు కళ్యాణమూర్తులను ఉదయం పల్లకిపై ఊరేగిస్తూ నగరోత్సవాన్ని నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం రాత్రి గరుడవాహనంపై స్వామివార్లను మేళతాళాలతో నగరోత్సవంలో భాగంగా ముగ్గురు
మూర్తులను ఊరేగించారు.

మూడో రోజు


మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి, చండికా సమేత సూర్యేశ్వరుడు, లక్ష్మీ సమేత నారాయణస్వామివార్లకు మూడోరోజు ప్రత్యేకపూజలు నిర్వహించారు. కళ్యాణమూర్తులను భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకున్నారు.

నాలుగోరోజు రథోత్సవం


మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి, చండికా సమేత సూర్యేశ్వరుడు, లక్ష్మీ సమేత నారాయణస్వామివార్లకు ఘనంగా రధోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాదిగా భక్తులు వెంటరాగా కళ్యాణమూర్తులను ద్రాక్షారామం వీధుల్లో
ఊరేగించారు. ఈ రథోత్సవం ద్రాక్షారామ వేగాయమ్మపేటలో ఉన్న ఆస్థాన పూజామండపం వరకూ సాగింది. పూజామండపం వద్ద స్వామివార్లకు ఆస్థానపూజ నిర్వహించారు.

ఐదోరోజు వసంతోత్సవం


మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి, చండికా సమేత సూర్యేశ్వరుడు, లక్ష్మీ సమేత నారాయణస్వామివార్లకు వసంతోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివార్లను ఆస్థానమండపం నుంచి రథంపై ఆలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు
నిర్వహించారు. అనంతరం తీర్థపుబిందె, బాలభోగం, అభిషేకాలు, కుంకుమపూజలు తదితర కార్యక్రమాలను చేపట్టారు. ఇవి పూర్తయ్యాక వసంతోత్సవ వేడుక జరిగింది.

ఆరోరోజు


కళ్యాణోత్సవాల్లో భాగంగా మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి, చండికా సమేత సూర్యేశ్వరుడు, లక్ష్మీ సమేత నారాయణస్వామివార్లకు రాత్రి ఆలయ ప్రాంగణంలోని సప్తగోదావరిలో ఘనంగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన
మూర్తులను ఆలయం నుంచి తీసుకువచ్చి విద్యుద్దీపాలతో అలంకరించిన హంస వాహనంపై అధిష్టింపచేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివార్లు సప్తగోదావరిలో మూడు పర్యాయాలు విహరించారు.