అంతకుముందు ఉదయం 7.00 నుండి 8.00 గంటల వరకు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు. అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షా బంధనం చేపట్టారు. కుంభ లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు.
ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్ఠిస్తారు. ఎన్ని దానాలు చేసినా ధ్వజారోహణకార్యంలో గరుడారోహణం చేసిన పుణ్యంతో సాటిరాదని పురాణాలు చెబుతున్నాయి. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. సమాజశ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుంది.

బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
పురాతనమైన కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం భారత పురాతత్వశాఖ ఆధీనంలో ఉంది. 1980వ సంవత్సరం నుంచి అభివృద్ధి పనులు చేపడుతున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 10న గరుడసేవ, ఫిబ్రవరి 11న స్వర్ణరథోత్సవం, ఫిబ్రవరి 13న రథోత్సవం, ఫిబ్రవరి 14న చక్రస్నానం జరుగుతుంది. ప్రతిరోజూ ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు, తిరిగి రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు వైభవంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల కారణంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జితసేవలను రద్దు చేశారు.
బ్రహ్మోత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ, ఆకర్షణీయంగా పుష్పాలంకరణలు, లైటింగ్‌తో కటౌట్లు ఏర్పాటుచేశారు.. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో స్వామివారి ఆలయంలో ధార్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాహనసేవల్లో వివిధ జిల్లాల నుండి కళాబృందాలు ప్రదర్శనలివ్వనున్నారు.
Source