భక్తజన సంద్రంగా మారిన కోరుకొండ నరసన్న క్షేత్రం

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవాలు ఫిబ్రవరి 26వ తేదీ సోమవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ప్రధానఘట్టం కావడంతో భక్తజనులు స్వామి దర్శనానికై పోటెత్తారు. నరసన్న క్షేత్రం భక్తజనసంద్రమైంది. తెల్లవారుజామునుంచే కొండపై ఉండే స్వామిని దర్శించుకోవడానికి అసంఖ్యాక భక్తులు తరలివచ్చారు. కొండపైన ,కొండకింద ఉన్న ఆలయాలలో కొలువైన ఆ నరసింహుని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

radhotsavam in korukonda

కన్నులపండువగా రథోత్సవం


మధ్యాహ్నం స్వామివారి రథోత్సవం కన్నులపండువగా జరిగింది. విశేషంగా అలంకరించిన రథంపై పెండ్లికుమారునిగా ముస్తాబైన స్వామిని, పెండ్లికుమార్తెగా అలంకరించిన అమ్మవార్లను ప్రతిష్టింపచేశారు. ఐదు గంటలపాటు జరిగిన ఈ రథోత్సవంలో పాల్గొని తరించడానికి భక్తులు పోటీపడ్డారు. రాజవీధులగుండా సాగిన ఈ రథోత్సవంలో భక్తులు పెద్దఎత్తున అరటిపళ్ళు సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు.

కళ్యాణం కమనీయం


లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం రాత్రి ఎంతో వైభవోపేతంగా నిర్వహించారు. అంగరంగవైభవంగా అలంకరించిన కళ్యాణవేదికపై లక్ష్మీనరసింహస్వామి దంపతులకు, శ్రీదేవి, భూదేవి సమేత అనంత పద్మనాభస్వామివారికి కళ్యాణోత్సవం ఆగమశాస్త్రానుసారం, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పాంచాహ్నిక దీక్షతో ఘనంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి భక్తులు తన్మయులయ్యారు. ఈ సందర్భంగా తిరుమల, అన్నవరం, అంతర్వేది దేవస్థానాల తరపు నుంచి పట్టువస్త్రాలు, కోరుకొండ గ్రామపంచాయతీ తరపునుంచి ముత్యాల తలంబ్రాలు స్వామివారికి సమర్పించారు. విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా ముస్తాబైన కోరుకొండ ఆలయం కాంతులీనింది.

గరుడోత్సవం


లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవాల్లో రెండవరోజైన ఫిబ్రవరి 28 వతేదీ మంగళవారం రాత్రి గరుడవాహనంపై స్వామివారిని గ్రామపురవీధుల్లో ఊరేగించారు. విశేషంగా అలంకృతులైన నవదంపతులైన లక్ష్మీనరసింహస్వామిని గరుడవాహనంపై అధిష్టింపచేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుంచి రాజవీధుల గుండా గ్రామోత్సవం ఎంతో వైభవంగా సాగింది. దారిపొడుగునా స్వామి అమ్మవార్లకు భక్తులు నీరాజనాలు పట్టారు. అఖండకాగడాల నడుమ, బాజాభజంత్రీలతో సాగిన ఈ గ్రామోత్సవాన్ని తిలకించి భక్తులు భక్తిపరవశులయ్యారు.

రంగరాజస్వామి కళ్యాణానికి సన్నాహాలు


లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి కొండ దిగువనే ఉన్న శ్రీ రంగరాజస్వామి  కళ్యాణోత్సవం 29 వ తేదీ అంటే బుధవారం రాత్రి  నిర్వహిస్తారు. ఈ ఆలయం లక్ష్మీనరసింహస్వామి ఆలయం కంటే పురాతనమైనదని పూర్వీకులు చెప్తున్నారు.