లక్ష్మీదేవి ఒక్కో మన్వంతరంలో ఒక్కొక్క రూపంలో అవతరించినట్టు పురాణాలు చెప్తున్నాయి. స్వయంభువ మన్వంతరంలో భృగువు, ఖ్యాతి దంపతుల పుత్రికగా లక్ష్మీదేవి జన్మించింది. సారోచిష మన్వంతరంలో లక్ష్మీదేవి అగ్నినుంచి అవతరించింని చెపుతారు.
జౌత్తమ మన్వంతరంలో జలరాశి నుండి, తామస మన్వంతరంలో భూమినుండి, రైతవ మన్వంతరంలో బిల్వవృక్షం నుండి, చాక్షుస మన్వంతరంలో సహస్రదళ పద్మం నుండి వైవస్వత మన్వంతరంలో క్షీరసాగరంలో నుండి ఆవిర్భవించినట్లు పురాణాల ప్రకారం వెల్లడవుతోంది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో లక్ష్మీదేవి జన్మించిన రోజైన ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి అంటే మార్చి 13న లక్ష్మీజయంతిని మనం జరుపుకుంటున్నాం. వైవస్వతంలో శ్రీమహాలక్ష్మీదేవి ఆవిర్భావం ఈ విధంగా సంభవించింది.
పూర్వం ఒకసారి దూర్వాస మహా ముని కల్పవృక్షమాలను దేవేంద్రునికి బహూకరించగా దేవేంద్రుడు ఆ మాలను తన వాహనమైన ఐరావతానికి ధరింపచేస్తాడు. ఆ ఏనుగు ఆ మాలను కిందపడేసి, కాళ్ళతో తొక్కి ముక్కలు చేస్తుంది. అది చూసిన దూర్వాస మహాముని కోపోద్రిక్తుడై ౖౖ''నా రాజ్యం నుండి లక్ష్మి వెళ్ళిపోవుగాక'' అని శపిస్తాడు. శాపఫలితంగా స్వర్గలోకంలో ఐశ్వర్యం నశించిపోతుంది. రాక్షసులు స్వర్గంపైకి దండయాత్రలు చేస్తారు. స్వర్గాన్ని స్వాధీనం చేసుకుంటారు.
దీంతో దేవేంద్రాది దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని తెలిపి శరణువేడతారు. బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను వెంటపెట్టుకుని విష్ణువువద్దకు వెళ్ళి పరిస్థితిని వివరిస్తాడు. క్షీరసాగర మధనం ద్వారా అమృతాన్ని ఉద్బవింపచేసి, ఆ అమృత బలంతో రాక్షసులను సంహరించాలని విష్ణుమూర్తి సూచిస్తాడు.
క్షీరసాగరమధనంలో ముందుగా ఉద్భవించిన హాలాహలాన్ని ఈశ్వరుడు సేవించగా, తరువాత సురభి అనే కామధేనువు, ఉచ్ఛ్వైశ్రవం అనే అశ్వం, పిమ్మట ఐరావతం, కల్పవృక్షం, వీటన్నింటి తరువాత క్షీరాబ్ధి నుంచి ఉత్తరఫల్గుణి నక్షత్రంలో శ్రీమహాలక్ష్మి ఉద్భవించింది. ఇది వైవస్వత మన్వంతరంలో శ్రీ మహాలక్ష్మీ జననం వెనుక ఉన్న గాధ. ఈ రోజునే మనం లక్ష్మీ జయంతిగా శ్రీమహాలక్ష్మిని ఆరాధిస్తుంటాం.
భక్తిశ్రద్ధలతో ఈ రోజున మహాలక్ష్మిని ఆరాధిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. సిరిసంపదలతో పాటు కీర్తి దక్కుతుంది. బుద్ధి వికాసం కలుగుతుంది. అన్నింటా జయం లభిస్తుంది. బలము, మేధస్సు, ఆరోగ్యం ఇత్యాదివి సంప్రాప్తిస్తాయి.