కమనీయం సీతారాముల కళ్యాణం

శ్రీరాముడు ఆదర్శపురుషుడు. కర్తవ్యపాలనకు చక్కని నిర్వచనం శ్రీరాముడు. శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు, ఏకపత్నీ వ్రతుడు, పితృ, మాతృ, వాక్పరిపాలకుడు, సదాచారం, నిగ్రహం, సర్వ సద్గుణాలు మూర్తీభవించిన దయార్ద్ర హృదయుడు ఇలా శ్రీరాముని గుణగణాలను ఇవి అని... అని కీర్తించలేము. రామాయణాన్ని కూర్చిన వాల్మీకి మహర్షికే అది సాధ్యపడలేదు. వర్ణించ నలవికాదు... కానీ 'వర్ణించకున్న మనసు ఊరుకొన జాలదు ఎందుకంటే రామ నామం అంత మధురమైనది కాబట్టి... రాముని స్తుతించడం మనకు నిర్వచించలేని తృప్తినిస్తుంది కాబట్టి...' అందుకే వాల్మీకి శ్రీమద్రామాయణంలో శ్రీరాముని కొన్ని గుణాల గురించి ఇలా వర్ణించారు.

sri rama navami

వాల్మీకి మహర్షి శ్రీరాముని 'బుద్ధిమాన్‌' అని వర్ణించారు. మంచిబుద్ధి కలవాడు, అంటే ధర్మబద్ధమయిన బుద్ధి గల వాడు అని అర్ధం. అయితే ధర్మము అంటే ఏమిటి? సులువయిన మాటలలో చెప్పాలంటే, ధర్మము అంటే, చేయవలసిన పని చేయుట, చేయరాని పని చేయకుండుట. ''రామో విగ్రహవాన్‌ ధర్మ:'' కాబట్టి, మనము కూడా ఆయన అడుగు జాడలలోనే నడవాలి.

మధురభాషిగా కూడా శ్రీరాముని వాల్మీకి వర్ణించడం జరిగింది. అంటే మధురమయిన మాటలు మాటలాడేవాడు అని అర్ధం. మధురభాషి అనేందుకు కారణాలు రెండు. ఒకటి పరుషమయిన మాటలు కార్య సాధనకు భంగము కొని తెస్తాయి. ధర్మబద్ధమయిన కార్య సాధనలో శ్రీరాముడు అతి సమర్థుడు. కావున, ధర్మస్థాపనకై ఆయన మధురముగా మాటలాడేవాడు. రెండవది మధురమయిన మాటలు పెద్ద, చిన్న, ఆడ, మగ, ధనిక, పేద, అందరినీ పరవశింప చేస్తాయి. శ్రీరాముడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువే కనుక, ఆయన పట్ల పరవశము పొంది, నిత్యము విష్ణు చింతనలో నిమగ్నమవడం ద్వారా, జన్మ రాహిత్యము పొందుటకు మనకు ఆమాటలు అవకాశము కలిగిస్తున్నాయి. ఆ మాటలు శ్రీమద్రామాయణములోనివే గనుక, శ్రీమద్రామాయణ పారాయణమే మోక్ష సాధనకు దారి.

శ్రీరాముని పూర్వభాషిగా ప్రత్యభిభాషిగా వర్ణించారు మహర్షి . అంటే ముందుగనే మాటలాడు వాడు. ముందుగా మాటలాడక పోవుట వలన, ఇతరుల మనస్సు నొప్పించుట ఇత్యాది పాప కర్మ చేసిన వారము కాగలము. ఆ పాప కర్మ ద్వారా మోక్ష సాధనకి ఒక మెట్టు దూరము కాగలము. అలా కాకూడదని శ్రీరాముడు మనకు బోధిస్తున్నాడు.

శ్రీరాముడు ప్రియమయిన మాటలు మాటలాడే వాడు కాబట్టి ప్రియంవాది. శ్రీరాముడు పరాక్రమవంతుడు. అధర్మాన్ని ఎదుర్కొనడానికి కావలసిన గుణము పరాక్రమము. శ్రీరాముడు పరాక్రమ సంపన్నడు కాబట్టి వీర్యవాన్‌ అంటూ కూడా వాల్మీకిమహర్షి రాముని గుణగణాలను వర్ణించారు.

''మహతా స్వేన వీర్యేణ న చ విస్మిత్ణ'' శ్రీరాముడు సకల సద్గుణముల ద్వారా గొప్పవాడయినను, ఎప్పుడూ గర్వించని వాడు. గర్వము అంధకార హేతువు. అంధకారము అనగా తనను తాను తెలుసుకొనలేకపోవడమే ''అహం బ్రహ్మాస్మి''. కనుక అంధకారము వలన మనము బ్రహ్మత్వము పొందుట అసంభవము. గర్వమును విడిచి పెట్టిన వాడు కనుకనే శ్రీ రాముడు సకల గుణాభిరాముడయ్యాడని వాల్మీకి మహర్షి పేర్కొన్నారు.

dasaratha rama

రాముని జననమే ఓపండుగ


'రామ' అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని జిహ్వ-జిహ్వే కాదు. సీతారాముల కళ్యాణం జరపని ఊరు ఊరే కాదు అన్నారు మన పెద్దలు. శ్రీరామనవమి దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా హిందువులకు అత్యంత ప్రధానమైన మైన పండుగ. హిందువులు ఈపండగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజున ప్రతీ వీధి, ప్రతి పల్లె, ప్రతి పట్టణం, ప్రతీ నగరం రామనామ స్మరణతో మారు మోగుతుంది. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిల్లగ్నంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమునే ప్రజలు పండుగగా జరుపుకుంటారు.

vanavasa gamana srirama

పధ్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాడు. ఈశుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే చోటుచేసుకుంది. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు ఆంధ్రప్రదేశ్‌లో కడప జిల్లాలో గల ఒంటిమిట్ట రామాలయం, తెలంగాణాలోని భద్రాచలం పుణ్యక్షేత్రాల్లో సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. దేశ వ్యాప్తంగా కూడా రామాలయాల్లో సీతారాముల కళ్యాణం అంగ రంగ వైభవంగా జరుగుతుంది. భక్తుల గుండెల్లో కొలువై, సుందర, సుమధుర చైతన్య రూపమై, కోట్లకొలది భక్తుల పూజలందుకొంటున్నాడు శ్రీరామచంద్రుడు. ఆయనను తెలుగువారు ప్రతి ఇంటా ఇంటి ఇలవేలుపుగా కొలుస్తారు. గ్రామం అంటే ఒక చెరువు, ఒక పాఠశాల, అంతకన్నా ముందు ఓ రామాలయం ఉండి తీరాలన్నది పూర్వం నుంచి వస్తున్న ఆచారంగా నిలిచింది. నేడు రామాలయం లేని గ్రామం మనం చూడలేము.

sitarama kalyanam

భద్రాద్రిలో కళ్యాణ వేడుకలు భళా


భద్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలి వస్తారు. కళ్యాణంలో పాల్గ్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆశీస్సులు పొందుతారు. సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం, సర్వ సంపదలకు నిలయం, సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం. శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం భద్రాచలం దివ్య క్షేత్రం. భద్రుడు అనగా రాముడు అని అచలుడు అంటే కొండ అని. రాముడు కొండపై నెలవై ఉన్న దివ్య ధామము కనుక ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధిచెందింది. శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడే గడపడమే ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యం. శ్రీరామ నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలూ చెబుతున్నాయి.

sita ramula kalyanam

భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు జరిగినట్లుగా చెబుతారు, అయితే తాను చెరసాలనుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. శ్రీ సీతారామ కళ్యాణము, రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమినాడే. ఆ మరునాడు దశమి రోజున శ్రీరామ పట్టాభిషేకం రామునికి జరిగింది. ప్రతియేటా భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణము చూసి తరించిన వారి జన్మ సార్థకం చెందుతుందనేది భక్తుల విశ్వాసం.

శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు. సూర్యుడు, రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు మొదలైనవారు. వీరిలో రఘు మహారాజు కచ్చితంగా మాట మీద నిలబడే వాడిగా ప్రసిద్ధి గాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడచి తండ్రి తన పినతల్లి కైకకు ఇచ్చిన మాటకోసం పదునాల్గేళ్ళు వనవాసం చేశాడు. దీనివల్లనే రాముడు రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలవబడుతుంటాడు.

panakam vadapappu

శ్రీరాముని సేవలో తరించండిలా


శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, ఆంజనేయ సమేతముగా ఆరాధించి, వడపప్పు, పానకము నైవేద్యముగా సమర్పించుకుంటే శుభం కలుగుతుంది. ఆ రోజున కుటుంబ సభ్యులందరూ ఉదయమే లేచి, తలంటు స్నానం చేసి, శుభ్రమైన లేదా కొత్త వస్త్రములను ధరించి. సీతా, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర మూర్తి పటమును గాని, సీతారాముల విగ్రహములనుగాని పూజా మందిరంలో ఉంచి శ్రీరామ అష్టోత్తర పూజ చేయాలి.

నీటిలో బెల్లం, మిరియాలు, యాలకులు కలిపి పానకం తయారు చేసి, వడపప్పు(నానపెట్టిన పెసర పప్పు), పానకం నైవేద్యం పెట్టి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలసి ఊరిలోని రామాలయమునకు, పందిళ్లకు వెళ్లి సీతారాములను చూసి, వారిని ధ్యానించుకొని, ప్రసాదం స్వీకరించాలి. వీలైన వారు రామాలయంలో గాని, శ్రీరామ నవమి పందిళ్లలో గాని సీతారాముల కళ్యాణం జరిపించుకుంటే మరీ మంచిది. మీకు ఆ వెసులుబాటు లేకుంటే కళ్యాణ సమయానికి వెళ్లి సీతారాముల కళ్యాణం చూసి వచ్చినా సమమైన ఫలితమే లభిస్తుంది. శ్రీ సీతారాముల కళ్యాణం జరిపించినా లేక చూసినా కూడా సర్వ శుభాలు కలుగుతాయయన్నది పెద్దల మాట.

sri rama navami puja

మీ ఇంట్లో పూజ చేసుకోండిలా


పూజా విధానం విషయానికి వస్తే ముందుగా అదౌ నిర్విఘ్నేన...అని తలచుకుంటూ గణపతి పూజ పూర్తిచేసి వినాయకుడిని ధ్యానించి, పున: సంకల్పం చేసుకుని శ్రీరామునికి షోడశోపచార పూజ యధావిధిగా గావించి, ఆపై శ్రీరామాష్టకం, శ్రీరామ అష్టోత్తరం, జానకీ అష్టకం పఠించి పువ్వులతో పూజ చేయాలి. చైత్రమాసం మల్లెలమాసమే గనుక మల్లెపూవులతో పూజించడం శుభప్రదం. మల్లెపూవులు లభ్యంకాని ప్రాంతాలలో వుండేవారు ఏదైనా సువాసనలు గల తెల్లరంగు పూవులతో లక్ష్మణ భరత శతృఘ్న ఆంజనేయ సమేత సీతారాముల పటానికి, లేదా విగ్రహానికి పూజించాలి.

శ్రీరాముడు ఖరీదైన, వ్యయ ప్రయాసలతో ముడిపడిన పిండివంటలేవీ కోరుకోడు. స్వామి సాత్వికుడు భక్తుల నుంచి పరిపూర్ణ భక్తి విశ్వాసాలు మాత్రమే ఆశిస్తాడని మనకు రామకధా సారంగా బోధ పడుతోంది. వడపప్పు, పానకం, రామయ్యకు అత్యంత ప్రీతి పాత్రమైనవి. వానితో పాటు ఆ రోజు ఏ వంట చేయాలనుకొన్నారో ఆ వంట పూర్తిచేసుకుని అదికూడా నైవేద్యం పెట్టాలి. ఏదైన ఒక ఫలం కూడా నివేదిస్తే మంచిది. పూజానంతరం స్వామివారి ప్రసాదంగా ముందుగా పానకం, వడపప్పు తీసుకోవాలని మర్చిపోకండి.