పరమశివుడు జ్యోతిర్లింగ రూపునిగా ఆవిర్భవించిన పరమ పవిత్రదినం మహాశివరాత్రి. మాఘ బహుళ చతుర్దశినాడు అంటే శివరాత్రినాడు పరమేశ్వరుడు రాత్రి 12 గంటల ప్రాంతంలో జ్యోతిర్లింగ రూపునిగా ఆవిర్భవించాడు. అందువల్ల ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా పరమేశ్వరునికి అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుగుతాయి.
అభిషేకాలే కాకుండా శివరాత్రినాడు ముఖ్యంగా లింగోద్భవకాలంలో చేసే దానాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఆ పరమేశ్వరుని కరుణా కటాక్ష వీక్షణాలు మనపై ఎప్పటికీ ఉండాలంటే చేయాల్సిన దానాలు గురించి తెలుసుకుందాం.
దానాలు-ప్రాధాన్యత
సంపద కలిగిన వారు ఈరోజు శక్తిని అనుసరించి బంగారం లేదా వెండి కుందులలో ఆవునేతి దీపం వెలిగించి పండితునికి సమర్పిస్తే అజ్ఞానాంధకారం నశిస్తుంది, లేనివారు కనీసం తోటకూర దానం చేసినా వారికి అంతులేనన్ని సంపదలు కలుగుతాయి. శివ భక్తులకు అన్న వస్త్రాలు, ఛత్రం దానం చేయాలి.బిల్వ పూజ
బిల్వపత్రాలతో అంటే మారేడు దళాలతో పరమేశ్వరుడిని ఆరాధిస్తే శివుడు అతి ప్రసన్నుడవుతాడు. ఎందుకంటే శివరాత్రినాడు పద్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు బిల్వమూలంలో ఉంటాయని, కనుక శివరాత్రినాడు ఉపవసించి ఒక్క బిల్వమైనా శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతోంది.