పుష్యమాసం-నువ్వులు రెండింటికీ ఉన్న సంబంధం ఏమిటి?

చాంద్రమాన, సౌరమాన గణనల రెండింటి ప్రకారం ఏర్పడే పండుగలు వస్తాయి పుష్యమీ నక్షత్రం పౌర్ణమినాడు చంద్రునితో కూడి ఉన్న మాసం పుష్యమాసం. చాంద్రమాన గణన ప్రకారం సంవత్సరంలో ఇది పదోమాసం....దేవతలతో పాటు, పితృదేవతలనీ ఆరాధించడం ఈ మాసం ప్రత్యేకం.

పుష్యమి అనేది శనిగ్రహ నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిదేవత బృహస్పతి. ఇతడు బుద్ధి కారకుడు. అందువలన బృహస్పతికీ, శనికీ అత్యంత ప్రీతికరమై నదీ మాసమని చెబుతారు. శనిపేరు వినగానే ఉలిక్కిపడతారు చాలామంది. అతడు హాని కారకుడనే నమ్మకమే దీనికి కారణం. కానీ శని సత్యధర్మాలను సమానంగా పాటించేవాడు. ఆరాధించేవారిని అనుగ్రహించే తత్వంకలవాడని పురాణాలు చెబుతున్నాయి. శనికి ఇష్టమైన పదార్థం నువ్వులు, వాటి నుంచి వచ్చేనూనె. కాబట్టి ఈ మాసంలో వాటితో ఆయనను అభిషేకించి, పూజించాలని, నువ్వులు దానం చేయాలని, బెల్లంతో కలిపిన నువ్వులు తినాలని శాస్త్ర ప్రవచనం.

అయితే నువ్వులు, బెల్లానికి పుష్య మాసానికి ఉన్న అనుబంధాన్ని మరింత లోతుగా పరిశీలిస్తే. హేమంతఋతువులో పుష్యమాసం రెండో మాసం. హేమంతం అంతా హిమంతొ కూడుకునే మాసం. అంటే మంచు కప్పబడి ఉండే మాసమన్నమాట. పగటి సమయం తక్కువ, రాత్రి సమయం ఎక్కువ. అందువల్లే 'పుష్యమాసంలో పూసగుచ్చ పొద్దుండదు' అనే నానుడి ఏర్పడింది. ఆ కొద్దిసేపైనా ఎండతీక్షణత ఉండదు. సూర్యరశ్మి శరీరానికి తగినంత అందదు. అందువల్ల తైల గ్రంథులు వాటి విధిని సక్రమంగా నిర్వహించలేక మందగిస్తాయి. ఫలితంగా చర్మం పొడిబారుతుంది. పగుళ్లు ఏర్పడతాయి. దీనికి నివారణ తైల అభ్యంగనం ఒక మార్గం. తైలం అంటే తిలనుంచి అంటే నువ్వుల నుంచి తీసిన నూనే అని అర్ధం.

శరీర ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచేది ఉష్ణోగ్రత. ఇది శరీరంలోని ధాతువుల్లో ఉండే కొవ్వు పదార్థాలపై ఆధారపడి ఉంది. ఈ మాసంలో అవి మందగించడంవల్ల శరీరంలోని తైలశాతం తగ్గుతుంది. దాన్ని భర్తీ చేయడానికి సరైన మార్గం నువ్వులు, బెల్లం కలిపి తినడం. బెల్లం ఆయుర్వేద పరంగా అత్యంత ఆరోగ్య ప్రదమైన పదార్థం. దీనివల్ల రక్తవృద్ధి జరుగుతుంది. ధాతు పుష్టి కలిగి నాడీవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. అందువల్లనే పుష్య నెలలో వచ్చే పండుగలన్నింటిలోనూ నువ్వులు ప్రధానంగా వాడడం తప్పనిసరి అని పెద్దల మాట. అందుకే సంక్రాంతి పిండి వంటలంన్నిటిలో నువ్వులు, బెల్లం తప్పకుండా ఉంటాయి, ఉండాలి కూడా. పండుగ పిండి వంటల్లో భాగంగా మనం తినే చక్కిలాలు, అరిసెలు, పాకుండలు ఇంకా ఇతర పిండి వంటల్లో నువ్వులు, బెల్లం కలిసి ఉంటాయి.

పుష్యమాసం శని మాసం

ఈ మాసం లో శని ప్రభావం అధికంగా ఉంటుంది. జ్యోతిశాస్త్రం ప్రకారం శని మన శరీర జీవ నాడి కారకుడై ఉంటాడు. ఈ జీవ నాడి యొక్క ఒక శాఖ హృదయ స్పందనను,రక్త ప్రసరణను అదుపుచేస్తుంటుంది. ధనుర్మాసం అయిపోయేటప్పటికి ,శరీరంలోని కొవ్వు పదార్ధం తగ్గుతుంది. ఆ తర్వాత మొదలయ్యే సమయానికి శరీరానికి ఈ కొవ్వు పదార్ధపు కొరతను తీర్చాలని శాస్త్రాల్లో నిర్దేశింపబడింది. ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికి, శరీరంలోని ముఖ్య జీవనాడి ఆరోగ్యంగా పని చెయ్యడం కోసము, హృదయ స్పందన సక్రమంగా ఉండేటట్లు చెయ్యగల "నువ్వులు -బెల్లం " తినాలి అనే నియమం పెట్టారు. ఎందుకంటే నువ్వులు, బెల్లం శరీరంలో నష్టపోయిన కొవ్వు పదార్ధాలను భర్తీ చేస్తాయి.

పుష్యమి నక్షత్రం శని నక్షత్రం... ఈ నక్షత్రానికి బృహస్పతి అధిదేవత. శనికి అధి దేవత యముడు. "యమం" అంటే అంటే ఆధీనంలో ఉంచుకోవటం... "సం యమం" అన్నమాట, అంటే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటం ఈ జీవ నాడి మూలంగా మాత్రమే సాధ్యమవుతుంది.

శని ధర్మదర్శి. న్యాయం,సత్యం,ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వ ప్రాణుల సమస్త విశ్వ ప్రేమను,పవిత్రతను ఉద్ధరించేవాడు అతడే . మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి,నియమ నిష్ఠులు పాటించినట్లు అయితే శనికి ఉన్న పైన చెప్పిన గుణాలు అన్నీ మనం పొందవచ్చు. ఎప్పుడు మనిషి వీటిని పొందుతాడో ,అప్పుడతడు బృహస్పతి వంటి వాడు అవుతాడు అంటారు అంటే బుద్ధి కుశలుడు అవుతాడన్నమాట . అందువల్ల, ఫుష్యమాసంలో నువ్వులు విరిగా వాడాలి, నువ్వులు బెల్లం కలిసిన పదార్ధాలు ఎక్కువగా సేవించాలి.