గిరిజనుల సాంప్రదాయ పండుగ నాగోబా జాతర


‘నాగోబా’ దేవాలయం ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌ గ్రామంలో ఉంది. నాగోబా జాతర తెలంగాణా ప్రాంతంలో గిరిజనుల సాంప్రదాయ పండుగ. ఈ పండుగ గిరిజనుల సాంస్కృతి సాంప్రదాయాలకు అద్దంపడుతుంది. పుష్యమాసంలో వచ్చే అమావాస్యరోజున, గిరిజనులు నాగోబా జాతరను ఎంతో సంబరంగా జరుపుకుంటారు. ఈ జాతరకు ఎన్నో వందల ఏళ్ళ చరిత్ర ఉంది.

ఈ రోజు గిరిజనులు ఆరాధ్య దైవమైన నాగోబా ను గిరిజనులు పూజిస్తారు. అమావాస్య నాడు ‘నాగోబా’ పురివిప్పి నాట్యంచేస్తాడని వారి నమ్మకం. తెలుగు రాష్ట్రాలనుంచే  కాకుండా పక్కరాష్ట్రాల నుంచీ లక్షలాదిమంది గిరిజనులు ఈగ్రామానికి చేరుకుని జాతరలో పాల్గొంటారు.

ఈ జాతరకు 16 రోజుల ముందు అంటే పుష్యమాస పౌర్ణమికి ఒకరోజు ముందు కొంతమంది గిరిజనులు పవిత్ర నాగోబా ఆలయం నుంచి కలశం తీసుకుని గోదావరి జలం తేవటానికి కాలినడకన బయలుదేరి వెళతారు. కేస్లాపూర్‌కు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న జన్నారం మండలం కలమడుకు వరకు నడిచి వెళ్ళి గోదావరి జలం తీసుకు వస్తారు. ఇక్కడ గిరిజనుల పూర్వులు స్నానం చేస్తుండగా నాగదేవత దర్శనమిచ్చాడనే నమ్మకంతో అక్కడి జలాన్ని పవిత్రంగా గిరిజనులు భావిస్తుంటారు.


ఇక్కడ సేకరించిన జలంతో నిండిన కలశాన్ని నలభై కిలోమీటర్ల దూరంలోని ‘పూసినగూడ’ గ్రామానికి లేదా ప్రధాన పూజారి ఉండే నార్నూరు మండలం గుంజాల గ్రామానికి తెచ్చి అక్కడ ఒకరోజు ఉన్న తరువాత కేస్లాపూర్‌కు 8కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లిలో ఆగి అక్కడ వెలసిన ఇంద్రాదేవిని సామూహికంగా పూజలు జరుపుతారు. అక్కడి నుంచి బయలుదేరి కేస్లాపూర్‌ చేరి ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న మర్రిచెట్టు కింద 4 రాత్రులు, ఒక పాకలో 3 రాత్రులు సామూహిక పూజలు జరిపి కేస్లాపూర్‌ మందిరానికి వాయిద్యాలతో ఊరేగిస్తూ తెచ్చి ఆలయం వద్ద ఉన్న మర్రిచెట్టుపై పవిత్ర జలకలశం భద్రపరిచి 10కి.మీ. దూరంలోని సిరికొండ చేరుకుంటారు.

పుష్య అమావాస్య రోజున కలశం ఉంచిన మర్రిచెట్టు దగ్గర పుట్టను తయారు చేసి ఆలయం ప్రక్కన ఉన్న పూజామందిరం మట్టితో అలికి అమావాస్య అర్థరాత్రి కలశంలో ఉన్న జలంతో ఆలయంలో ఉన్న నాగ దేవతను అభిషేకిస్తారు. గిరిజన తెగకు చెందిన మెస్రిం వంశస్తులు దేశంలో ఏ మారుమూల ఉన్నా తప్పనిసరిగా ఈ జాతరకు హాజరై నాగదేవతను పూజిస్తుంటారు. నాగోబా దేవతకు పూజలు మేస్రం వంశీయులే నిర్వహిస్తారు. మేస్రం వంశం లోని 22 గిరిజన తెగలు ఈ జాతరలో పాల్గోంటారు.

నాగోబా చరిత్రను గోండు గిరిజనులు రకరకాలుగా చెప్పుకుంటారు. పూర్వం మేస్రం కుటుంబానికి చెందిన నాగాయిమోతి అనే రాణికి నాగేంద్రుడు కలలో కనిపించి సర్ఫ రూపంలో ఆమె గర్భాన జన్మిస్తానని చెబుతాడు. ఆ కల నిజమైందని గోండుల నమ్మకం. సర్పరూపంలోని నాగేంద్రునికి తల్లి అంటే రాణి తన తమ్ముడి కూతురు గౌరీతో వివాహం జరిపించింది. అత్త ఆజ్ఞ మేరకు గౌరీ భర్తను బుట్టలో పెట్టుకొని గోదావరికి వద్దకు వెళుతుంది. ఒకచోట పాము ఉడుం రూపంలో కనిపించగా ఆ ఊరు ఉడుంపూరైంది.

ఆ తరువాత గౌరి ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లగా ఆమెను చూసి నాగేంద్రుడు మనిషి రూపంలోకి మారతాడు. అతను గౌరిని నీకు పేరు ప్రతిష్ఠలు కావాలో, సంప్రదాయం కావాలో తేల్చుకోమంటే గౌరి సంప్రదాయాలను లెక్కచేయక పోవడంతో తిరిగి పాముగా మారాడని కథ. ఆ తరువాత ఉడుంపూర్‌ నుంచి గరిమెల వరకు అతనికోసం వెతికిన గౌరి గోదావరిలోనే సత్యవసి అనే గుండంలో కలిసిపోయిందని, నాగేంద్రుడు గౌరి వద్ద వెంట ఉంచిన ఎద్దు రాయిగా మారిందని భక్తుల విశ్వాసం.

ఆ తరువాత పెళ్ళి అయిన ప్రతి జంటకు నాగేంద్రుడి సన్నిధిలో పరిచయం చేయాలని చెప్పి నాగేంద్రుడు కెస్లాపూర్‌ గుట్టల్లోకి వెళ్లిపోయాడని చెప్తుంటారు. అదే నేడు కెస్లాపూర్‌ గ్రామంగా మారి పోయింది. నాగేంద్రుడు వెళ్లిన గుట్ట వద్ద నాగోబా దేవాలయాన్ని నిర్మిం చారు. ప్రతిఏటా పుష్ట మాసం అమావాస్య రోజున నాగేంద్రుడు ప్రత్యక్షమవుతాడని గిరిజనుల నమ్మకం.