ఏకాదశులు: ప్రతీ నెలలోను వచ్చే ఏకాదశులు-వాటి ఫలితములు

మన హిందూ సాంప్రదాయములో కాలానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కర్మానుష్ఠానం కోసం కొన్ని పర్వములను నిర్ణయించారు మన పెద్దలు. ఆ పర్వములను కూడా తిథుల ప్రకారంగా నిర్ణయించడం జరిగింది. ఆ తిథులలో ముఖ్యమైనది ఏకాదశి తిథి. ఈ ఏకాదశి ప్రతీ మాసములోను శుక్లపక్షములోనూ, కృష్ణ పక్షము లోనూ వస్తుంది.

ఈ విధంగా నెలకు రెండేసి ఏకాదశుల చొప్పున 12నెలలకు 24 ఏకాదశులు వస్తాయి. వీటికి ఒక్కొక్కదానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఈ ఏకాదశి మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు. అందుకే ఈ తిథిని హరివాసరం అని కూడా అంటారు. ఈ ఏకాదశి రోజున ఉపవాసము ఉండి దీక్షతోవిష్ణు సహస్ర నామావళి పఠిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.

  • చైత్ర శుక్ల ఏకాదశి : ఈ ఏకాదశిని కామదైకాదశి అని అంటారు. ఈరోజున ఏకాదశి వ్రతం ఆచరించిన సమస్త కోరికలు తీరతాయి.

  • చైత్ర బహుళ ఏకాదశి : ఈ ఏకాదశిని వరూధిన్యైకాదశి అని అంటారు. ఈ వ్రతం ఆచరించినట్లయితే వేయి గోవులు దానమిచ్చిన కలిగే పుణ్యము పొందగలరు.

  • వైశాఖ శుక్ల ఏకాదశి : ఈ ఏకాదశిని మోహిన్యేకాదశి అని అంటారు. దీనిని ఆచరిస్తే కోరిన వ్యక్తులు వశమవుతారు. ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఈ రోజునే అన్నవరంలో శ్రీ సత్యనారాయణమూర్తి కళ్యాణం జరుగుతుంది.

  • వైశాఖ బహుళ ఏకాదశి : ఈ ఏకాదశిని అపర ఏకాదశి అంటారు. ఈ వ్రతము ఆచరించడం వల్ల సమస్త తీర్థ క్షేత్ర దర్శన ఫలం లభిస్తుంది.

  • జ్యేష్ఠ శుక్ల ఏకాదశి : ఈ ఏకాదశిని నిర్జలైకాదశి అని అంటారు. ఈ రోజున కనీసం మంచినీరు కూడా త్రాగకుండా వ్రతమాచరించి మరునాడు పారణ చేస్తే సకల శుభములు కలుగుతాయి.

  • జ్యేష్ఠ బహుళ ఏకాదశి : ఈ ఏకాదశిని యోగిన్యైకాదశి అంటారు. దీనిని ఆచరించిన ఎడల సమస్త రోగములు నయమగును. దీర్ఘరోగాలు పటాపంచలవుతాయి.

  • ఆషాఢ శుక్ల ఏకాదశి : దీనినే తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని అంటారు. ఈ రోజునుంచే చాతుర్మాస్య వ్రతం ఆరంభిస్తారు. శ్రీ మహావిష్ణువు ఈ దినమున క్షీరసాగరం నందు నిదురిస్తాడు. ఈ వ్రతమును 18 సంవత్సరముల వయసు నుండి జీవితాంతం ఆచరించిన దీర్ఘాయువు కలిగి నిండు నూరేళ్ళు ఆయుర్దాయం ఉంటుంది.

  • ఆషాఢ బహుళ ఏకాదశి : దీనినే కామ్యైకాదశి అంటారు. దీనిని ఆచరించడం వలన సమస్త కోరికలు తీరును.

  • శ్రావణ శుక్ల ఏకాదశి : ఈ ఏకాదశిని పుత్ర ఏకాదశి అంటారు. దీనిని ఆచరించడం వల్ల సంతానం కలుగుతుంది. పుత్ర సంతానం లేనివారికి తప్పక పుత్ర సంతానం కలుగుతుంది.

  • శ్రావణ బహుళ ఏకాదశి : అజైకాదశి అని కూడా అంటారు. దీనిని ఆచరించినట్లయితే సమస్త కష్టములు తొలగి అజేయులగుదురు.

  • భాద్రపద శుక్ల ఏకాదశి : దీనిని పరివర్తన్యైకాదశి అంటారు. శయనేకాదశినాడు నిదురించిన మహావిష్ణువు ఎడమ ప్రక్కనుండి కుడి ప్రక్కకు తిరుగును. అందుచే దీనిని పరివర్తన్యైకాదశి అని పేరు. ఈ వ్రతం వలన నిలిచిపోయిన పనులు పూర్తి అవుతాయి.

  • భాద్రపద బహుళ ఏకాదశి : దీనిని ఇంద్ర ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి వ్రతము ఆచరించడం వల్ల ఇంద్రునితో సమానమయిన భోగములు అనుభవిస్తారు.

  • ఆశ్వయుజ శుక్ల ఏకాదశి: దీనిని మహాజ్జయేకాదశి అంటారు.విజయదశమి అయిన వెంటనే వచ్చు ఈ ఏకాదశి వ్రతం చేయడం వలన అన్ని రంగములందు విజయం లభిస్తుంది.

  • ఆశ్వయుజ బహుళ ఏకాదశి : దీనిని రమైకాదశి అంటారు. ఈ వ్రతం ఆచరించినట్లయితే ఉత్తమ స్థాన ప్రాప్తి పొందగలరనుటలో సందేహంలేదు.

  • కార్తీక శుక్ల ఏకాదశి : దీనిని ఉత్థానైకాదశి మరియు బోధనైకాదశి అని కూడా అంటారు. ఈ రోజున శ్రీమహావిష్ణువు నిదుర లేస్తాడు. ఈ వ్రతమును ఆచరిస్తే అనేక దానధర్మములు చేయడంవల్ల లభించే ఫలము లభిస్తుంది.

  • కార్తీక బహుళ ఏకాదశి : దీనిని ఉత్పత్యైకాదశి అంటారు. ఈ దినమున శ్రీ మహావిష్ణుఉ ఏకాదశి దేవతను సృష్టించెను. ఈ వ్రతం ఆచరించుటచే సమస్తదోషములు నశించును.

  • మార్గశిర శుక్ల ఏకాదశి : దీనిని ధృవైకాదశి లేదా ఉత్తమైకాదశి అంటారు. భగవద్గీత జన్మించిన రోజు కావున గీతాజయంతిని కూడా ఈ రోజునే చేస్తారు. ఈ వ్రతం వలన స్థిరమయిన మనస్సు, తృప్తిని కలిగించును.

  • మార్గశిర బహుళ ఏకాదశి : దీనిని సఫలైకాదశి అంటారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల అనేక

  • ఉపకారములు జరిగి జీవితంలో అనేక మంచి పనులు చేస్తారు.

  • పుష్య శుక్ల ఏకాదశి : దీనిని వైకుంఠ ఏకాదశి లేదా మోక్ష ఏకాదశి అంటారు. ఈవ్రతం ఆచరించుటచే విష్ణు లోకమును పొందే మోక్షం ప్రాప్తిస్తుంది.

  • పుష్య బహుళ ఏకాదశి : దీనిని తిలైకాదశి అంటారు. ఈ రోజున నువ్వుల గింజలు నీళ్ళతో స్నానం చేయడం, నువ్వుల పొడితో శౌచం, నువ్వు గింజలతో చేసిన చిమ్మిలి ఆహారం తీసుకొని నువ్వులు దానం చేయాలి. శని దోషములు పోగొడుతుంది.

  • మాఘ శుక్ల ఏకాదశి : దీనిని జయైకాదశి అంటారు. మరియు భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. ఈ దినమునే భీష్ముడు వైకుంఠమును పొందినరోజు. ఈ దినమునందే అంతర్వేదిలో కళ్యాణం జరుగుతుంది.

  • మాఘ బహుళ ఏకాదశి : దీనిని విజయైకాదశి అంటారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల విష్ణు సాయుజ్యం పొందగలరు.

  • ఫాల్గుణ శుక్ల ఏకాదశి : దీనిని అమలవైకాదశి అంటారు. ఈ వ్రతం వలన భార్యాభర్తలు ఇరువురు అన్యోన్యముగా జీవిస్తారు.

  • ఫాల్గుణ బహుళ ఏకాదశి : దీనిని పావవిమోచనైకాదశి అంటారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల ఒకసంవత్సరంలో చేసిన పాపములన్నియు పోవును.