విష్ణు గుణ కీర్తనమే భాగవతానికి ఆది
మహాభాగవతం మత్స్య, కూర్మ, వరాహ, మార్కండేయ భాగవతం, భవిష్యత్, బ్రహ్మాండ, బ్రహ్మ, బ్రహ్మవైవర్త, వామన, వాయు, వైష్ణవ, అగ్ని, నారద, పద్మలింగ, గరుడ స్కాందాలనే అష్టాదశ పురాణాలలో ఒకటి. భాగవతాన్ని కూడా అష్టాదశ పురాణాలకు కర్త అయిన వేదవ్యాసుడే రచించాడు. అన్ని పురాణాలను వ్రాసిన తర్వాత ఇంకా వ్యాసుడు ఏదో వెలితి, తెలియని అసంతృప్తిచే బాధపడుతుండగా నారదుడు వచ్చి ఆయన బాధకు కారణం తెలుసుకుని ఆయనను భాగవత రచనకు పురికొల్పినట్లుగా ఈ గ్రంథంలో చెప్పబడింది.
12 స్కంధాలుగా విభాజితమై ఉన్న ఈ మహా గ్రంథంలో విష్ణువు, ఆయన దాల్చిన దశావతారాలు, వానిలో సంపూర్ణ అవతారమైన శ్రీ కృష్ణుని యొక్క మహిమల కీర్తనం, మహిమల వర్ణనం స్థూలంగా భాగవత ఇతి వృత్తమని చెప్పబడింది. అందుకే నారదుడు భాగవత పురాణానికి ఆది కారణమే విష్ణు గుణ కీర్తనమని చెప్పినట్లు ఈ గ్రంథం పేర్కొంటోంది. అతి గహనమైన వేదాంత విషయాల నుంచి అతి శృంగారభరితమైన శ్రీకృష్ణుని రాసలీలల వరకూ భాగవతంలో వేదవ్యాసుడు తనివితీరా వర్ణించాడు. వేదవ్యాసుడు భాగవతంలో వేద రహస్యార్ధాలను అనేకం నిబద్ధం చేశాడు. శ్రీమద్భాగవతంలో అద్వైత వేదాంతసారం సర్వం నిండియున్నది. అందుకే పురాణాలన్నింటిలోనూ దీనికి ప్రత్యేకత ఉన్నది.
భాగవతాన్ని తెలుగువారి దరికి చేర్చిన ఘనత పోతనామాత్యులదే
భాగవతాన్ని సంస్కృతం నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి వివిధ కవులు తమ ప్రాంతీయ భాషల్లోకి అనువాదం చేస్తున్నారు. అయితే ఈ అనువాదాలన్నింటిలో తెలుగులో పోతనామాత్యుల అనువాదం తరువాతే మరేదైనా అనటంలో సందేహం లేదు. అతి మధురమైన భక్తి కావ్యంగా హిందీ భాషలో అందరికీ అర్ధమయ్యే రీతిలో గీతులుగా మహాకవి సూరదాసు రచించిన భాగవతానువాదం అందరినీ ఇప్పటికీ అలరిస్తూనే ఉంది.
తెలుగులో పోతనామాత్యులు చేసిన భాగవత అనువాదం మూల సంస్కృత భాగవతం కంటే ఐదు రెట్లు పెరిగింది. పోతనామాత్యుడు స్వయంగా విష్ణు భక్తులు కావటమే ఇందుకు కారణం. తాను భక్తి వలన భాగవతాన్ని తెలుసుకుని ఆ తత్వాన్ని తెలుగువారికి విడమరిచి ఇచ్చాడు కవి పోతన. తెలుగు భాగవతంలో కుచేలోపాఖ్యానం, రుక్మిణీ కళ్యాణం, ప్రహ్లాద చరిత్ర, గజేంద్రమోక్షం, రంతిదేవుని చరిత్ర, కపిలదేవహూతి ఉపాఖ్యానం, శ్రీకృష్ణ లీలలు తదితర ఘట్టాలను తెలుగువారికే సొంతం చేశాడు పోతనామాత్యుడు.
అష్టాదశ పురాణాలలోనూ వేదం సమూపబృంహితమైనా భాగవతాన్ని తెలుగువారి దరికి చేర్చి భక్తిస్థాపనకు పునాదులు వేసి, తెలుగువారికి ఐహికమే కాకుండా ఆముష్మిక దృష్టిని కలిగించిన కవి పోతన. ఆయన భాగవతము. అందుకే 'నిగమములు వేయి చదివిన సుభగంబులు గావు భక్తి సుభగత్వంబున్' అని చెప్పి తెలుగువారికి సుభగత్వం కలిగించింది శ్రీ మహాభాగవతం.