మాఘ మాసంలో స్నానానికి ఎంతో పవిత్రత ఉంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం, ఉత్తరాయణ పుణ్యకాలం కావడంవల్ల మాఘమాసంలో పుణ్య నదుల్లో స్నానం చేయాలి. స్నానాంతరం సమస్త జీవరాశికి ఆధారమైన సూర్యభగవానుడికి నమస్కరించాలి. వైష్ణవ ఆలయానికి గానీ, శివాలయానికి గానీ వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి.
ఏమేం దానాలు చేయాలి?
మాఘపౌర్ణమి రోజున చేసే స్నానాల వలన, పూజల వలన, దానాల వలన వ్యాధుల నుంచి బాధల నుంచి విముక్తి కలుగుతుంది. ఆ పుణ్య ఫలాల విశేషం కారణంగా ఉన్నతమైన జీవితం లభిస్తుంది. మరణం అనంతరం కోరుకునే శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించడమే కాకుండా శక్తిమేరకు దానధర్మాలు చేయాలి. ఈ రోజున గొడుగులు, నువ్వులు దానం చేస్తే విశేష ఫలం లభిస్తుంది. ఈ విధంగా చేయడం వలన జన్మజన్మలుగా వెంటాడుతోన్న పాపాలు- దోషాలు నశించి, అశ్వమేథ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీ కృష్ణుడే ధర్మరాజుతో చెప్పినట్టుగా తెలుస్తోంది.
సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయడమే మాఘమాసం స్నానం ప్రత్యేకం. మాఘస్నానం గురించి పద్మపురాణం వివరిస్తుంది. మాఘస్నానం చేయడంవల్ల బుద్ధివికాసం, ఆరోగ్యం, అందం, ఐశ్వర్యం పెంపొందుతాయని శీలవంతులుగా ఉంటారని పద్మపురాణం తెలుపుతుంది.
భౌతికంగా కూడా స్నానం అనేది చర్మకాంతిని పెంపొందిస్తుంది. శరీరం, మనస్సు పరిశుద్ధమవుతాయి. సోమరితనం, అలసట తొలగిపోయి శరీరంలో ఉల్లాసం, చురుకుదనం ప్రవేశిస్తాయి. సూర్యకిరణాలలో శక్తి వల్ల దేహంలోని కొన్ని రుగ్మతలు దూరమవుతాయి. అందుకే నదులలోను, చెరువులలోను, బావిలోనూ లభించే నీటితో మాఘస్నానంచేయమని చెప్పారు.
ప్రవాహజలాలల్లో స్నానం చేయలేని వారు ‘గంగేచ యమునేచైవ గోదావరి, సరస్వతి, నర్మదే సింధుకావేరి జలేస్మిన్ సన్నిధింకురు’ అన్న శ్లోకాన్ని పఠిస్తూ ఇంట్లోనైనా స్నానం ఆచరిస్తే మాఘస్నానపుణ్యం లభిస్తుందని అంటారు. ప్రతిరోజు చేయలేనివారు కనీసం మాఘ శుద్ధ సప్తమి, ఏకాదశి, పౌర్ణిమ, కృష్ణపక్ష చతుర్దశి రోజుల్లో స్నానం చేసి, మాఘమాస స్నాన ఫలితాన్ని పొందవచ్చు. ఈ మాసమంతా సాధ్యమైనంత వరకు దైవ చింతనతోనే గడపాలి.
అందునా మాఘ పౌర్ణమి నాడు చేసే స్నానం మరింత గొప్ప ఫలితాన్నిస్తుంది. మాఘ పౌర్ణమి నాడు సాధారణంగా సముద్రస్నానం చేస్తారు. ఈరోజు చేసే జప, తప, దానాలకు విశేష ఫలితాలు కలుగుతాయి. ముఖ్యముగా ఈరోజు బ్రాహ్మణునకు చేసే తిలపాత్ర దానం పుణ్యప్రదమైనది.
ఈరోజున ప్రయాగలో త్రివేణీ సంగమం వద్ద ప్రతి ఏటా మాఘ మేళా జరుగుతుంది. 12 సంవత్సరాలకు ఒక్కసారి కుంభ మేళా జరుగుతుంది.

పౌర్ణమిరోజున పాటించాల్సిన నియమాలు
సాధారణముగా ఈరోజున కార్తీక పౌర్ణమి నాడు చేసేటట్లుగానే ఉపవాసం ఉంటారు. అలాగే దానాలను చేస్తారు. పితృదేవతల పేర్లు చెప్పి తర్పణాలు విడచి పేదలకు దానాలు చేస్తారు. మాఘ పౌర్ణమి నాడు గంగాస్నానం బహు పుణ్యప్రదం. గంగలో స్నానం చేయుటకు వీలు కాని పక్షంలో ప్రతి హిందువు ఇంట్లోనూ గంగాజలం ఉంటుంది కాబట్టి దానిలోని కొంత జలాన్ని మనం స్నానం చేసే నీటిలో కలిపి ఆ నీటితో స్నానం చేయవచ్చు. స్నానానంతరం విష్ణు ఆరాధన చేయాలి. అలా చేసినవారికి విష్ణువు అనుగ్రహం వలన సంతోషం కలుగుతుంది, వారి కోరికలు నెరవేరుతాయి. ముఖ్యముగా మాఘ పౌర్ణమి నాడు శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించటం ప్రసిద్ధి చెందినది.
బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం ఈ మాఘ మాసములో విష్ణు మూర్తి స్వయముగా గంగలో నివసిస్తాడు. కాబట్టి కనీసం గంగను తాకడం చేసినప్పటికీ వారికి స్వర్గప్రాప్తి కలుగుతుంది. పురాణాలలో ఎందరో ఋషులు ఈ మాఘ పౌర్ణమి నాడు గంగా స్నానం చేసినట్లుగా ఉన్నది. కనుక ఎవరి వీలునిబట్టి వారు పుణ్య నదీ స్నానం ఆచరిద్దాం. వీలుకానివారు కనీసం మన ఇంట్లోనే గంగాజలం కలిపిన నీటితో పుణ్యస్నానాన్ని చేద్దాం.
మాఘమాసం శివకేశవులిరువురికీ ఫూజించవలసిన పుణ్యమాసం. స్నానం, జపం, ధ్యానం, దానంవల్ల ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుందనీ, భగవంతుని నామస్మరణవల్ల పాపచింతన తొలగిపోయి, భగవత్ చింతన ఏర్పడి మంచి కార్యాలు చేస్తారనీ, వారికి ఆ పుణ్యఫలంవల్ల మోక్షం లభిస్తుందనీ పురాణా వచనం. పద్మపురాణంలో పేర్కొన్నట్లుగా అరటిపళ్లు, చెరకు గడలు, ఉప్పు, చక్కెర, పాలు, నిమ్మ, దబ్బపళ్ళు, పెరుగు, తేనె, బెల్లం, భగవంతుని పూజాసామగ్రి, శంఖం, వినాయకుడు, దుర్గాదేవి ప్రతిమలు దానంచేయాలి. ఇవేకాక, శొంఠి, జీలకర్ర, జాజికాయ, పిప్పళ్ళు లాంటివి ఈ మాఘమాసంలో దానం చేస్తే మంచిదని పెద్దల వాక్కు.
ఈ మాఘపౌర్ణమినాడు సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తోంది. చంద్రగ్రహణానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈక్రింది లింకును క్లిక్ చేయండి.