క్షేత్ర పురాణము
ఆ ఆలయంలో అమ్మవారు జ్ఞానప్రసూనాంబ, ఈ మాత అంబాత్రయములలో ఒకరు. శివలింగము ఇక్కడ వర్తులాకారంలో కాకుండా చతురస్రాకారంలో వుంటుంది. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానాన్ని ప్రసాదించిన ప్రదేశంగా ఖ్యాతికెక్కింది. వశిష్ఠుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, బోయడు అయిన తిన్నడు (కన్నప్ప), వేశ్య కన్యలు, యాదవ రాజు, శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యం వ్రాసిన దూర్జటి వంటి వారి కథలు ఈ క్షేత్ర మహాత్మ్యంతో పెనవేసుకొని ఉన్నాయి.
కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు . అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటినుండి నెత్తురు కార్చాడట. వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చాడట. అప్పుడు స్వామి రెండవకంటి నుండి కూడా నెత్తురు కారటం మొదలయింది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవకన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు. స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదించాడు.
కాశీ క్షేత్రములో మాదిరిగానే ఇక్కడ చనిపొయే వారికి పరమశివుడు ఓంకార మంత్రాన్ని, తారకమంత్రాన్ని ఉపదేశించి మోక్షము ప్రసాదిస్తారని భక్తుల నమ్మకం. దేవాలయ ప్రాంతంలో పాతాళ విఘ్నేశ్వరాలయము ఉంది. దేవాలయానికి సమీపములోగల కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయాన్నినిర్మించారు. శ్రీకాళహస్తీశ్వరాలయం రాజగోపురము యొక్క సింహద్వారము దక్షిణాభిముఖంగా ఉంటుంది. స్వామి వారు ఉత్తరాభిముఖులై ఉంటారు. ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ శ్రీ చక్రాన్ని స్థాపించారు. ఈ క్షేత్రానికి దక్షిణకైలాసము, సత్య మహా భాస్కరక్షేత్రమని, సద్యోముక్తిక్షేత్రమని, శివానందైక నిలయమని ఇతర పేర్లు కూడా ఉన్నాయి. మహా శివరాత్రినాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది.
ఆలయ చరిత్ర
క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో తమిళ సంగం వంశానికి చెందిన నక్కీరన్ అనే తమిళ కవి రచనల్లో శ్రీకాళహస్తి క్షేత్రమును గురించి దక్షిణ కాశీగా చారిత్రక ప్రస్తావన ఉంది. ఇంకా తమిళ కవులైన సంబందర్, అప్పర్, మాణిక్యవాసగర్, సుందరమూర్తి, పట్టినత్తార్, వడలూర్ కు చెందిన శ్రీరామలింగ స్వామి మొదలగు వారు కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు.
ఆలయానికి ఆనుకుని ఉన్న కొండ రాళ్ళపై పల్లవుల శైలిలో చెక్కబడిన శిల్పాలను గమనించవచ్చు. తరువాత చోళులు పదకొండవ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగు పరచడం జరిగింది. ఒకటవ కులోత్తుంగ చోళుడు ప్రవేశ ద్వారం వద్దగల దక్షిణ గాలి గోపురాన్ని నిర్మించాడు. మూడవ కులోత్తుంగ చోళుడు ఇతర ఆలయాల్ని నిర్మించాడు. క్రీస్తుశకం 12వ శతాబ్దానికి చెందిన వీరనరసింహ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను మరియు నాలుగు ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించాడు. క్రీస్తుశకం 1516 విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయలు రాతిపై చెక్కించిన రచనల ఆధారంగా ఆయన వంద స్తంభాలు కలిగిన మంటపం మరియు అన్నింటికన్నా తూర్పు పడమర దిక్కుల వైపుకు ఉన్న ఎత్తైన గాలిగోపురం నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ గోపురాన్ని 1516 వ సంవత్సరంలో గజపతులపై విజయానికి సూచనగా నిర్మించినట్లు తెలియజేస్తుంది.
ఆలయ విశేషాలు
శ్రీకాళహస్తీశ్వరాలయం పేరు మూడు జంతువుల కలయికతో ఏర్పడినది. శ్రీ అనగా సాలీడు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు ల పేరుతో కాళహస్తిగా ప్రసిద్ధి చెందినది.
ఇది స్వర్ణముఖి నది తీరములో ఉన్న క్షేత్రము. స్వర్ణముఖి ఇక్కడ పశ్చిమాభిముఖముగా ప్రవహిస్తుంది. ఈ దేవాలయములోని లింగము పంచభూత లింగములలో ఒకటైన వాయులింగము. మహాశివరాత్రి మరుసటి రోజు, రథోత్సవం కన్నులపండుగగా జరుగుతుంది.
ఈ దేవాలయం దేశంలోని అతి పెద్ద ఆలయాలలో ఒకటి. ఆలయం లోపల అమ్మవారి సన్నిధికి సమీపంలో ఒక ప్రదేశం నుంచి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలను సందర్శించవచ్చు. ఇలాంటి సదుపాయం భారతదేశంలో కేవలం కొన్ని ఆలయాలకు మాత్రమే ఉంది. రాహు, కేతు, సర్ప దోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి కావించుకుంటారు. ఇంకా రుద్రాభిషేకం, క్షీరాభిషేకం, పచ్చ కర్పూరాభిషేకం మొదలైన పూజలు కూడా జరుగుతాయి. ఇక్కడ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు.
నిర్మాణంలోనూ ప్రత్యేకత
శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై కనిపిస్తారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖునిగాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళ హస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను దక్షిణామూర్తి దక్షిణ ముఖంగా అంటే మహా ద్వారం ఎదురుగా ఉన్నారు. వాయులింగంగా వెలిసిన స్వామి వాయుతత్వరూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయని చెబుతారు.
గోపురాలు
ఆలయానికి నాలుగు దిక్కులా నాలుగు గోపురాలతోపాటు శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన 120 అడుగుల ఎత్తుగల రాజగోపురం ఉన్నాయి. స్వామి గ్రామోత్సవం ఈ గోపురంనుండే మొదలవుతుంది. ఆలయానికి చేరుకోవడానికి ముందుగా "తేరు వీధి"కి ఎదురుగా ఉన్న భిక్షాల గోపురంనుండి వస్తాడు. జంగమరూపుడైన శివుని సేవించి తరించిన బిచ్చాలు దేవదాసి దీనిని నిర్మించిండని చెబుతారు. ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహరాయల కాలంలో జరిగిందని తెలుస్తోంది. తూర్ప గోపురాన్ని "బాల జ్ఞానాంబి గోపురం" అని, ఉత్తరం గోపురాన్ని "శివయ్య గోపురం" అని, పశ్చిమ దిక్కు గోపురాన్ని "తిరుమంజన గోపురం" అని అంటారు. తిరుమంజన గోపురానికి కుడినైపున "సూర్య పుష్కరిణి", ఎడమవైపున "చంద్ర పుష్కరిణి" ఉన్నాయి. స్వామి అభిషేకానికి, వంటకు నీటిని సూర్యపుష్కరిణి నుండి తీసుకెళతారు. ఈ గోపురంనుండి సువర్ణముఖి నదికి వెళ్ళవచ్చును. దక్షిణం గోపురంనుండి భక్త కన్నప్ప గుడికి, బ్రహ్మ గుడికి వెళ్ళవచ్చును.
ఇతర శివలింగాలు, పరివార దేవతలు
ఇక్కడ అనేక శివలింగాలు మహర్షులు లేదా దేవతలచే ప్రతిష్ఠింపబడినవిగా భావిస్తారు. భృగు మహర్షి - అర్ధ నారీశ్వర లింగము; అగస్త్యుడు - నీలకంఠేశ్వర లింగము; ఆత్రేయుడు - మణి కంఠేశ్వర లింగము; ఇంకా వ్యాసుడు, మార్కండేయుడు (మృత్యంజయేశ్వర లింగము), రాముడు, పరశురాముడు, ఇంద్రాది దేవతలు, సప్తర్షులు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, ధర్మరాజు ప్రతిష్ఠించినవనే లింగాలున్నాయి. వర్షాల కోసం మృత్యుంజయేశ్వరునికి సహస్రలింగాభిషేకం చేస్తారు. కాశీ విశ్వేశ్వరుడు కూడా ఆలయంలో మూర్తి స్వరూపుడై యున్నాడు.
వివిధ గణపతి మూర్తులు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సూర్యభగవానుడు, శని గ్రహ మూర్తులు ఉన్నారు. వేంకటేశ్వర స్వామి, వరదరాజ స్వామి, వీరరాఘవ స్వామి మూర్తులు కాడా కనిపిస్తాయి. నిలువెత్తు కన్నప్ప విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది. శంకరాచార్యుల స్ఫటిక లింగము, 64 నాయనార్ల లోహ విగ్రహాలు కూడా మనం దరి్శంచుకోవచ్చు.
మంటపములు
ఆలయంలో శిల్పకళతో శోభించే స్తంభాలు, మంటపాలు ప్రత్యేకంగా చూపరులను ఆకర్షిస్తాయి. ఇంకా అనేక వర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి. నగరేశ్వర మంటపము, గుర్రపుసాని మంటపము, నూరుకాళ్ళ మంటపము (రాయల మంటపము), పదునారు కాళ్ళ మంటపము, కోట మంటపము వాటిలో కొన్ని. నూరుకాళ్ళ మంటపం చక్కని శిల్పాలకు నిలయం. పదహారు కాళ్ళ మంటపంలో 1529లో కృష్ణదేవరాయలు సోదరుడు అచ్యుత దేవరాయలు పట్టాభిషేకం జరిగింది. అమ్మవారి ఆలయం ఎదురుగా అష్టోత్తర లింగ ముఖద్వారం పైకప్పులో చక్కని చిత్రాలున్నాయి.
రాహు కేతు క్షేత్రము
ఇది రాహు కేతు క్షేత్రమని ప్రసిద్ధి పొందింది. పుత్ర శోకానికి గరైన వశిష్ట మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనమిచ్చాడట. ఈ నాగరూపమునే బ్రహ్మదేవుడు కూడా అర్చించాడట. ఈ నాగరూపం కారణంగా ఈ క్షేత్రానికి "రాహు కేతు క్షేత్రము" అని పేరు వచ్చింది. సర్ప దోషము, రాహు కేతు గ్రహ దోషాలనుండి నివారణ కోసం ఈ స్వామిని పూజిస్తారు. స్వామి కవచము నవగ్రహ కవచమునకు అలంకారములు చేస్తారు.
దక్షిణామూర్తి
దక్షిణాభిముఖంగా ఉన్న ఆలయ ప్రవేశ ద్వారంనుండి లోనికి ప్రవేశించగానే ఉత్తరముఖంగా కొలువైయున్న దక్షిణామూర్తిని దర్శించవచ్చును. దక్షిణామూర్తి పూజలందుకొనడం కారణంగా ఇది జ్ఞాన ప్రధానమైన క్షేత్రం అయ్యింది. ఈ విధమైన దక్షిణామూర్తి విగ్రహం వేరెక్కడా కనుపించదు. ఇక్కడ వైదిక సంప్రదాయానికి ప్రముఖస్థానం ఉంది.
ఆలయంలో జరిగే సేవలు
ఆలయంలో కర్పూర హారతి, అష్టోత్తర అర్చన, సహస్ర నామార్చన, త్రిశతి అర్చన, పాలాభిషేకము, పచ్చ కర్పూరాభిషేకము, కాశీ గంగాభిషేకము, రుద్రాభిషేకము, నిత్యదిట్ట అభిషేకము, శ్రీ శనేశ్వరస్వామి అభిషేకము, శుక్రవారం అమ్మవారి ఊంజలి సేవ, వివాహ కట్నం, పంచామృతాభిషేకము, అఖండ దీపారాధన కట్నం, నిత్యోత్సవం (ఉదయం), ప్రదోష నంది సేవ, ఏకాంత సేవ, వాహన పూజ, సుప్రభాత సేవ, శని నివారణ జ్యోతిదీప కట్నం, తళిగ కట్నం, సర్పదోష (రాహు కేతు) పూజ, పౌర్ణమినాడు ఊంజల్ సేవ, నంది సేవ, పెద్ద వెండి సింహ వాహనము
తీర్ధాలు
ఆలయం పరిసరాలలో 36 తీర్ధాలున్నాయట. సహస్ర లింగాల తీర్ధము, హరిహర తీర్ధము, భరద్వాజ తీర్ధము, మార్కండేయ తీర్ధము, మూక తీర్ధము, సూర్య చంద్ర పుష్కరిణులు వాటిలో ముఖ్యమైనవి. దేవాలయంలోని "పాతాళ గంగ" లేదా "మూక తీర్థము"లోని తీర్థాన్ని సేవిస్తే నత్తి, మూగ లోపాలు పోయి వాక్చాతుర్యం కలుగుతుందటారు.
పండుగలు
పండుగల విషయానికొస్తే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వారం రోజులపాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ రోజులలో ఆలయం లోపలనే కాకుండా నాలుగు ప్రధాన వీధులైన నెహ్రూ వీధి, కుంకాల వీధి, తేరు వీధి, నగరి వీధులు జనంతో కిటకిటలాడుతుంటాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ ఉత్సవం ప్రధానమైన మూడు రోజులు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా నిర్వహిస్తుంది. అన్నింటి కన్నా ఎక్కువగా మహాశివరాత్రి రోజున సుమారు లక్షకు పైగా భక్తులు స్వామి దర్శనార్థం విచ్చేస్తారు. ఈ రద్దీని తట్టుకోవడానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. శివుడు కళాప్రియుడు కాబట్టి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన గాయకులు, హరికథకులు, నాట్య కళాకారులు, నర్తకీమణులు, భజన కళాకారులు, మిమిక్రీ కళాకారులు, సంగీత వాయిద్య కారులు, భక్తులను తమ కౌశలంతో రంజింప జేస్తారు.
మహాశివరాత్రి పర్వదినాన జరిగే నందిపై ఊరేగింపు కన్నుల పండుగగా ఉంటుంది. నంది వాహనమెక్కి ఊరేగు శివుని ముందు అనేక జానపద కళా బృందాలు ప్రదర్శించే కళలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మహాశివరాత్రి తరువాతి రోజు జరిగే రథ యాత్రలో కూడా ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇంకా నారద పుష్కరిణిలో జరిగే తెప్పోత్సవం కూడా ఉత్సవాల్లో ప్రధాన వేడుక. అందంగా అలంకరించిన తెప్పలపై స్వామి వారిని మరియు అమ్మవారిని కోనేటిలో విహారం చేయిస్తారు. పట్టణం నడిబొడ్డులోగల పెళ్ళి మంటపంలో జరిగే కళ్యాణోత్సవంలో వేలాది భక్తులు పాల్గొంటారు. పెద్ద ఖర్చులు భరించి పెళ్ళి చేసుకోలేని పేదలు స్వామి, అమ్మవారి కళ్యాణంతో పాటుగా పెళ్ళి చేసుకోవడం ఇక్కడ తరతరాలుగా ఇక్కడ వస్తున్న ఆనవాయితీ.
ఇంకా ఆలయానికి సమీపంలో ఉన్న దుర్గాంబ కొండపై వెలసిన కనక దుర్గమ్మ అమ్మవారికి ఏటా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. ఈ తొమ్మిది రోజులపాటు కూడా భక్తులు విశేషంగా అమ్మవారిని దర్శించుకుంటారు. ఇంతకు మునుపు చిన్నదిగా ఉన్న ఆలయాన్ని 2006లో విస్తరించడం జరిగింది. మరి కొంత దూరంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి కొండపై కూడా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.
ధర్మరాజుల స్వామి తిరునాళ్ళు కూడా ఐదు రోజులపాటు విశేషంగా జరుగుతాయి. ద్రౌపదీ అమ్మవారు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. ఈ ఉత్సవాల సమయంలో ప్రతిరోజు భారత పారాయణం జరుగుతుంది. విరాటపర్వం చదివిన రోజున పట్టణంలో కచ్చితంగా వర్షం కురవడం ప్రజలు విశేషంగా చెప్పుకుంటారు. ఉత్సవాలలో ప్రధాన భాగంగా ఐదవరోజున సుమారు 2000 మంది భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేస్తారు.
ఇంకా ప్రతీ సంవత్సరం డిసెంబరు నెలలో జరిగే ఏడు గంగల జాతర కూడా చెప్పుకోదగ్గ ఉత్సవమే. ఈ ఉత్సవాలలో భాగంగా పట్టణం లోని ఏడు వీధులలో ఏడు రూపాలలో ఏర్పాటు చేసిన గంగమ్మలను ప్రతిష్ఠిస్తారు. ముత్యాలమ్మ గుడి వీధిలో గల గంగమ్మ దేవాలయం నుంచి ఈ ఏడు విగ్రహాలు ఊరేగింపుగా బయలుదేరి ఆయా వీధులలో ప్రతిష్ఠిస్తారు. ఆ గంగమ్మ విగ్రహాలు జీవం ఉట్టి పడేలా తయారు చేయడం ఆ కళాకారుల నైపుణ్యానికి నిదర్శనం.
పాతాళ గణపతి ఆలయము
ఈ ఆలయమునకు ప్రవేశద్వారము వైపున పాతాళ గణపతి ఆలయము ఉంది. ఇందులోనికి ప్రవేశము ఒకసారికి ఒకరికి మాత్రమే ఉంది. మెట్లద్వారాలోనికి వెళ్లేందుకు సన్నని సందు వంటి మార్గము లోనికి ఉంది. దాదపు 20 అడుగుల లోతు వరకు ప్రయాణించిన పిదప గణపతి విగ్రహం ఉంది. ఈ స్వామి కోర్కెలు తీర్చేవాడని ప్రసిద్ధి.