
భారతదేశంలో గల రెండే రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా, రెండవది బాసర. బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యుల కాలంలో నిర్మింపబడింది. బాసర నిజామాబాదు పట్టణానికి 35 కి.మీ దూరంలో, హైదరాబాదుకు సుమారు 200 కి.మీ. దూరంలోను, విశాఖపట్నానికి 750 కి.మీ, విజయవాడకు 450 కిమీ దూరంలోను ఈ బాసర క్షేత్రం కొలువై ఉంది.

స్థలపురాణం
బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెబుతోంది. కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోసం తన కుమారుడైన శుకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడ కుటీరం నిర్మించి తపస్సు చేయడం ప్రారంభించాడు. వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతామూర్తులను ప్రతిష్టించాడు. వ్యాసుడు ఇక్కడ కొంత కాలము నివసించాడు కనుక అప్పటినుండి ఈ ఊరు వ్యాసపురి , వ్యాసర అనబడి, తరువాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వలన 'బాసర' గా నామాంతరాన్ని సంతరించుకుంది.
ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ పసుపును ఒక్క రవ్వంత తినినా అత్యంత విజ్ఞానం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఆదికవి వాల్మికి ఇక్కడ సరస్వతీ దేవిని ప్రతిష్టించి రామాయణం వ్రాసాడని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. ఈ గుడికి సమీపంలో వాల్మికి మహర్షి సమాధి, పాలరాతి శిల ఉన్నాయి. మంజీరా మరియు గోదావరి తీరాన రాష్ట్రకూటుల చేత నిర్మించబడిన మూడు దేవాలయాలలో ఇది ఒకటని విశ్వసించబడుతోంది. ఆరవ శతాబ్దంలో నందగిరి ప్రాంతంలో నందేడు ను రాజధానిగా చేసుకుని పరిపాలించిన బిజలుడు అను రాజు బాసరలో ఈ ఆలయమును నిర్మించాడన్న కథనం ప్రచారంలో ఉంది.
మరొక కథనం ప్రకారం... పూర్వం కురుక్షేత్ర యుద్ధం అనంతరం కొన్నాళ్లు ప్రశాంతంగా తపస్సు చేసుకునేందుకని వ్యాసమహర్షి, విశ్వామిత్ర మహర్షి తదితరులు శిష్యసమేతంగా ఈ ప్రాంతానికి వచ్చారు. ఇక్కడి ప్రశాంత వాతావరణానికి ముగ్ధులై.. ఇక్కడే తపస్సు కొనసాగించారట! వ్యాస భగవానులు రోజూ పావన గోదావరి జలాల్లో స్నానం చేశాక.. పిడికెడు ఇసుక చొప్పున తీసుకెళ్లి.. సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని రూపొందించారట! ఆ మూర్తికే ఆయన నిత్యపూజలు చేసేవారని.. ఇప్పుడు ఇక్కడున్న విగ్రహం అప్పట్లో వ్యాస మహర్షి ఆరాధించిన మూర్తేనని చెబుతారు. అలా వేద వ్యాస ప్రతిష్టగా పరిగణించే బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి సన్నిధిలో నిత్యం వేల మంది చిన్నారులు అక్షరాభ్యాసం చేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులతో విజ్ఞానవంతులుగా ఎదుగుతున్నారు.
ఆలయ విశేషాలు
ఈ మందిరం సాదా సీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ప్రతి నిత్యం ఉదయం 5 గంటలకు సరస్వతీ మూర్తికి వైదిక మంత్రోపేతంగా పూజ జరుపుతారు. సాయంకాలం ఆరు గంటలకు పూజ జరుగుతుంది. ఈ ఆలయానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిషా. మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలనుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ముఖ్యముగా విద్యా ప్రాప్తికై ఇక్కడ విద్యార్థులతో అక్షరాభ్యాసము చేయించి దేవికి పలక, బలపము, కాగితము, కలము వంటి కానుకలు సమర్పిస్తారు. అక్షరాభ్యాసాలతోపాటుగా ఆలయంలో అభిషేకం, సత్యనారాయణ వ్రతాలు, చండీ హవనం, కుంకుమార్చన నిత్యం నిర్వహిస్తారు.
ఉప ఆలయాల సమాచారం
ప్రధాన సరస్వతీ ఆలయ అంతరాలయంలో మహాలక్ష్మీ , ఆలయానికి పశ్చిమ దిక్కులో మహాకాళీ కొలువై ఉంటారు. అంటే ఈ ఆలయం త్రిశక్తులైన లక్ష్మి, పార్వతి, సరస్వతి అమ్మవార్లు కొలువైన మహిమాన్విత క్షేత్రమన్న మాట. ఆలయానికి తూర్పున దత్తాత్రేయుడు, ఆలయం ముందు ప్రధాన రహదారి వద్ద వేదవ్యాస మహర్షి ఆలయం.. వ్యాసుల వారి గుహ, గోదావరి నది, నదీ తీరాన మహేశ్వర ఆలయం, బస్టాండ్ సమీపంలోని వేదశిల (శ్రీ వేదవతిశిల) తప్పక దర్శించవలసిన ప్రాంతాలు. వీటన్నింటి దర్శనం ఉచితమే!

ప్రత్యేక ఉత్సవాలు
మాఘ శుద్ధ పంచమినాడు సరస్వతీ జన్మదినోత్సవం జరుపుకొంటారు. ఆ రోజున మహాభిషేకం తరువాత వివిధ పుష్పాలతో వాగ్దేవిని నయనానందకరంగా అలంకరిస్తారు. జగద్రక్షణకై, భక్త పోషణకై అవతరరించిన కామితార్ధ ప్రదాయినిగా బాసర జ్ఞాన సరస్వతి ఈనాడు విశేష పూజలందుకుంటోంది. వసంత పంచమికి 15 రోజుల ముందు నుండి ప్రారంభం అయ్యే ఈ ఉత్సవాలు వసంత పంచమి తరువాత మూడు రోజుల వరకు జరుగుతాయి. ఆ సమయంలో దేవికి ప్రత్యేక పూజలు ఆరాధనలు జరుపుతారు.
గురుపౌర్ణమి సందర్భంగా ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారు. సప్తశతి చండీయాగం చేసి వేద పండితులకు సన్మానం నిర్వహిస్తారు. మహా శివరాత్రి పర్వదినం మొదలుకొని మూడు రోజులు పెద్ద జాతర సాగుతుంది. వేలాది భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించి వాగ్దేవికి ప్రదక్షిణాలు ఆచరిస్తారు. ఇక్కడ నిర్వహించే పూజలు.. ప్రత్యేక దర్శనాలకు సంబంధించి ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యమేమీ లేదు.
నవరాత్రులు
ఆశ్వియుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఉదయము, సాయంకాలము 64 ఉపచారములతో, వైదిక విధానంలో అమ్మవారికి వైభవంగా పూజలు జరుగుతాయి. శ్రీ దేవీ భాగవతము, దుర్గా సప్తశతి పారాయణలు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా మూల నక్షత్ర పర్వదినం రోజున మూల నక్షత్ర మహా సరస్వతీపూజ నిర్వహిస్తారు. మహర్నవమి రోజున చండీ హోమము చేయబడుతుంది.
విజయదశమి నాడు వైదిక మంత్రాలతో మహాభిషేకము, సుందరమైన అలంకారము, సాయంకాలము పల్లకీ సేవ, శమీపూజ జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భక్తులు, ఉపాసకులు తమ తమ అభీష్టానుసారం పూజలు చేసుకుంటారు. ఇంకా ధార్మిక చర్చలు, ఉపన్యాసములు, హరికథలు, పురాణ పఠనం నిర్వహిస్తారు. యాత్రికులకు నిరతాన్నదానం సమర్పిస్తారు.
మాధుకరము
ఈ వూరిలో ఇది ఒక ముఖ్యమైన సంప్రదాయం. మధుకర వృత్తి (యాచించుట) ద్వారా లభించే భిక్షకు మాధుకరము అని పేరు. శ్రీదేవి అనుగ్రహము కోరేవారు నియమ నిష్టలతో 11 లేదా 21 లేదా 41 రోజులు దీక్షతో గురూపదేశ మంత్రము అనుష్టానం చేస్తారు. ఆ కాలంలో వారు మధ్యాహ్నం వూరిలోనికి పోయి భిక్షను స్వీకరించి, సరస్వతీ దేవికి నమస్కరించి, ఆ భిక్షను భుజిస్తారు.
వసతి వివరాలు
బాసర సరస్వతీ ఆలయానికి వచ్చే భక్తుల వసతి కోసమని 100 సాధారణ గదులు, 18 ఏసీ గదులు అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఆలయం వద్ద వివిధ ఆలయాల నిధులతో నిర్మించిన అతిథిగృహాల్లోనూ వసతి అందుబాటులో ఉంటుంది. పర్యాటక శాఖ వారి హరిత అతిథిగృహంతో పాటు పలు ప్రైవేటు లాడ్జిలు, రిసార్టుల్లోనూ వసతి సౌకర్యముంది.
దర్శన వేళలు
ఉదయము 4 గంటలకు ఆలయద్వారాలు తెరచి 4 గంటల నుండి 4.3ఏ గంటల వరకు అభిషేకము టిక్కెట్లను ఇస్తారు. 4 గంటల నుండి 7.30 గంటల వరకు అభిషేకము, అలంకారము, హారతి, నైవేద్యము చేసి ప్రసాద వితరణ చేస్తారు. 7.30 గంటల నుండి 12.30 గంటల వరకు అర్చన, సర్వదర్శనం ఇతర పూజలు చేస్తారు. 12.30 గంటలకు నివేదన చేసి ఆలయము 2 గంటవరకు మూసి ఉంచుతారు. 2 గంటల నుండి 6.30 గంటల వరకు అర్చన సర్వదర్శనం చేస్తారు. 6.30 గంటల నుండి 7 గంటల వరకు ప్రదోష పూజ నిర్వహిస్తారు. 7 గంటల నుండి 8.30 గంటల వరకు మహా హారతి దర్శనం తరువాత ఆలయము మూసి వేస్తారు.
- రోజూ ఉదయం 4 గంటలకే ఆలయద్వారాలు తెరుస్తారు.
- ఉదయం 4.30 గంటలకు అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తారు.
- అనంతరం 4.30 నుంచి 6.30 వరకూ అభిషేకం కొనసాగుతుంది.
- 6.30 నుంచి 7.30 గంటల వరకు విరామం.
- ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సాధారణ దర్శనం, ప్రత్యేక దర్శనం, అక్షరాభ్యాస
- పూజలు ఆరంభం.
- మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2.00 గంటల వరకు మధ్యాహ్న విరామం
- మధ్యాహ్నం 2 నుంచి 6.30 వరకు దర్శనం, పూజలు
- సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు సాయంత్ర ప్రదోషకాల పూజలు
- రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు హారతి. అనంతరం ఆలయ తలుపులు మూసివేస్తారు.