సకల శుభాలు, సంపదలనిచ్చే మణిద్వీప వర్ణన


మణిద్వీప వర్ణన లిరిక్ తో సహా అందిస్తున్నాము... భక్తితో విని ఆనందించండి.  మీరు కొత్త ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసిన సందర్భంలో తొమ్మిది సార్లు మణిద్వీప వర్ణనను పఠించుకుంటే మీ ఇంట్లో సాక్షాత్తూ ఆ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. మీరు పఠించలేక పోయినా ఈ వీడియో 9 సార్లు ప్లే చేసుకుని వినండి చాలు, అన్నీ శుభాలే కలుగుతాయి. దసరా నవరాత్రుల రోజుల్లో ప్రతిరోజూ వింటే ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు. 


మహాశక్తి  మణిద్వీప నివాసిని ముల్లోకాలకు  మూల  ప్రకాశిని
మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువైయింది

సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర  సువర్ణపూలు
అచంచలంబగు మనో సుఖాలు మణిద్వీపానికి  మహానిధులు

లక్షల లక్షల లావణ్యాలు అక్షరలక్షల వాక్ సంపదలు
లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు

పారిజాత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలు
గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు

భువనేశ్వరీ సంకల్పమే జనియించే  మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం

పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడల పొడవున గలవు
మధురమధురమగు చందనసుధలు మణిద్వీపానికి మహానిధులు

అరువదినాలుగు కళామతల్లులు వరాలనొసగే  పదారుశక్తులు
పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు

అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టదిక్కులూ దిక్పాలకులు
సృష్టికర్తలు సురలోకాలౌ మణిద్వీపానికి మహానిధులు

కోటి సూర్యులు ప్రపంచకాంతులు కోటి చంద్రుల చల్లని  వెలుగులు
కోటితారకల వెలుగుజిలుగులు మణిద్వీపానికి మహానిధులు      ||భువనేశ్వరీ||

కంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్రాలు
ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు

పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు
ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు

ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైఢూర్యాలు
పుష్యరాగ మణిప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు

సప్తకోటి ఘనమంత్రవిద్యలు సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు
శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు  ||భువనేశ్వరీ||

మిలమిలలాడే రత్నపు రాసులు తళతళలాడే చంద్రకాంతములు
విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి  మహానిధులు

కుబేర ఇంద్ర వరుణదేవులు శుభాలనొసగే అగ్నివాయువులు
భూమిగణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు

భక్తిజ్ఞానవైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు
సప్తఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు

కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలమహాగ్రహాలు
ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు    ||భువనేశ్వరీ||

మంత్రిణి దండిణి శక్తిసేనలు కాళి కరాళి సేనాపతులు
ముప్పదిరెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు

సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు
గోమేధికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు

సప్తసముద్రములనంత నిధులు   యక్షకిన్నెర కింపురుషాదులు
నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు

మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు
సృష్టిస్థితిలయా కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు     ||భువనేశ్వరీ||

కోటి ప్రకృతుల సౌందర్యాలు సకలవేదములు ఉపనిషత్తులు
పదారురేకల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు

దివ్యఫలములు దివ్యాస్త్రములు దివ్యపురుషులు ధీరమాతలు
దివ్యజగములు దివ్యశక్తులు మణిద్వీపానికి మహానిధులు

శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంతభవనములు
మణి నిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు

పంచభూతములు యాజమాన్యాలు వ్యాళసాలం అనేకశక్తులు
సంతాన వృక్షసముదాయాలు మణిద్వీపానికి మహానిధులు

చింతామణులు నవరాత్రులు నూరామడల వజ్రరాసులు
వసంత వనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు

దుఃఖము తెలియని దేవీసేవలు నటనాట్యాలు సంగీతాలు
ధనకనకాలు పురుషార్ధాలు మణిద్వీపానికి మహానిధులు

పదునాల్గు లోకాలన్నిటిపైనా సర్వలోకమను లోకము  గలదు
సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరికది  శాశ్వత స్థానం

చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల  మంచముపైన
మహాదేవుడు భువనేశ్వరితో  నివసిస్తాడు మణిద్వీపములో       ||భువనేశ్వరీ||

మణిగణ ఖచిత ఆభరణాలు చింతామణి  పరమేశ్వరి  దాల్చి
సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది  మణిద్వీపములో

పరదేవతను  నిత్యము  కొలిచి  మనసర్పించి  అర్చించినచో
అపారధనము సంపదలిచ్చి  మణిద్వీపేశ్వరి  దీవిస్తుంది....2...

నూతనగృహములు కట్టినవారు మణిద్వీపవర్ణన  తొమ్మిదిసార్లు
చదివిన  చాలు  అంతా  శుభమే అష్టసంపదల  తులతూగేరు ....2...

శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీపవర్ణన  చదివిన చోట
తిష్టవేసుకొని  కూర్చొనునంటా  కోటి శుభాలను  సమకూర్చుకొనుటకై

భువనేశ్వరీ సంకల్పమే జనియించే  మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం