అనంతపురం జిల్లాలోని కదిరి గ్రామంలో ఉన్న శ్రీ నరసింహస్వామి దేవాలయం తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటి. ఈ దేవాలయంలో స్వామివారి రథోత్సవం ఫాల్గుణ బహుళ సప్తమి నాడు జరుగుతుంది. ఈ సందర్భంగా కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విశేషాలను క్లుప్తంగా పరిశీలిద్దాం.
కదిరి ఆలయ నిర్మాణం
ఈ దేవాలయం 13వ శతాబ్దంలో దశలవారీగా అభివృద్ధి చెందిందని శాసనాల వలన తెలుస్తోంది. ఆలయానికి నాలుగు వైపులా గోపురాలు కలిగి ఉంటుంది. ప్రధాన ఆలయంలో గర్భగుడి, అంతరాలయం, ప్రదక్షిణాపథం, ముఖమంటపం, అర్థమంటపం, రంగమంటపం ఉన్నాయి. రంగ మంటపంలో ఉన్న నాలుగు స్తంభాలపై శిల్పకళారీతులు అత్యంత సుందరంగా ఉంటాయి. ఇక్కడున్న కోనేరును భృగుతీర్థం అంటారు. ఇక్కడ స్వామివారు అమ్మతల్లి, తాయారు, ప్రహ్లాదులతో కలిసి దర్శనమిస్తారు. ఈ ఆలయం ముందున్న పెద్ద రాతి ధ్వజస్తంభం నిలబెట్టిన విధానం కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ధ్వజస్తంభం పునాదిలో నుండి కాకుండా ఒక బండపైనే అలా నిలబెట్టి ఉంది.
ఆలయంలో ఉత్సవాలు
ప్రతిఏడు సంక్రాంతి సమయంలో స్వామివారి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో వచ్చే పశువుల పండుగ రోజున శ్రీదేవి, భూదేవి లతో కలిసి వసంత వల్లభుడు కదిరి కొండకు పారువేటకు వస్తాడని భక్తుల విశ్వాసం. పారువేట అనంతరం స్వామివారిని ఊరేగింపుగా ఆలయంలోనికి తీసుకువస్తారు. దీన్నే రథోత్సవం అంటారు. ఈ రథోత్సవానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రథం 120 టన్నుల బరువుండి ఆరు చక్రాలతో సుమారు 45 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఎక్కడాలేని విధంగా ఇక్కడ రథోత్సవం సమయంలో భక్తులు రథంపై దవణం, పండ్లు, మిరియాలు చల్లుతారు. క్రిందపడిన వీటిని ప్రసాదంగా భావించి ఏరుకుని తింటే సర్వరోగాలు నయమవుతాయని భక్తుల నమ్మిక. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదోరోజు ఫాల్గుణ బహుళ పౌర్ణమిని కదిరి పున్నమిగా జరుపుతారు. ఈరోజు భక్తులు ఉపవాసముంటారు. ఏటా ఈ ఆలయంలో నృసింహజయంతిని వైశాఖ శుద్ధ చతుర్దశి, మల్లెపూల తిరునాళ్ళను వైశాఖ శుద్ధ పౌర్ణమి, చింతపూల తిరునాళ్ళను ఆషాఢపౌర్ణమి, ఉట్ల తిరునాళ్ళను శ్రావణ బహుళ నవమి, దసరా వేడుకలను, వైకుంఠ ఏకాదశి పర్వదినాలను ఘనంగా జరుపుకుంటారు.
కదిరి ఆలయ విశిష్టత
ఉత్సవాల సమయంలో ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ స్వామిని కొలవడం ఈ ఆలయ ప్రత్యేకత. ఇక్కడికి భక్తులు సమీపంలోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా వస్తుంటారు. ఇక్కడి ఇంకో విశేషమేమంటే, కదిరి పట్టణానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో తిమ్మమ్మ మర్రిమాను ఉంది. ఇది ఏడున్నర ఎకరాల స్థలంలో విస్తరించి, 1100 ఊడలతో వ్యాపించి ఉంది. దీని వయస్సు సుమారు 600 సంవత్సరాల పైబడి ఉంటుందని నమ్మకం. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించుకుంది. పన్నెండు కిలోమీటర్ల దూరంలో కటారు పల్లెలో యోగివేమన సమాధి కూడా ఉంది. ఇది కూడా పర్యాటకులను ఆకర్షిస్తోంది.