తెప్పోత్సవంతో ముగిసిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

ప్రముఖ పుణ్య క్షేత్రం తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కళ్యాణోత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి. జనవరి 24న ప్రారంభమైన ఈ ఉత్సవాలు 31వ తేదీ వరకూ కొనసాగాయి.

lakshminarasimha swamy antarvedi

ఆరంభం ఇలా...


తొలిరోజు శ్రీ సూర్యనారాయణమూర్తి జన్మదినమైన రథసప్తమిరోజున నరసింహ స్వామి నవ వరునిగా అలంకరించారు. బుగ్గన చుక్క, నొసటన కళ్యాణ తిలకము ధరించి నూతన పట్టువస్త్రధారణతో స్వామివారు కొత్త పెళ్ళికొడుకులా భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే అమ్మవారిని పెళ్ళి కుమార్తెగా అలంకరించారు. అదేరోజు సాయంత్రం 6.30 గంటలకు స్వామివారికి ధూపసేవను నిర్వహించారు. ప్రతి సంవత్సరం శ్రీవారికి ముద్రికాలంకరణ, అమ్మవారిని పెళ్ళికుమార్తెను చేసే కార్యక్రమాలను కేశవదాసుపాలేనికి చెందిన బెల్లంకొండ, ఉండవల్లి వంశస్థులు ఆలయ పూజారుల సమక్షంలో నిర్వహిస్తూ ఉంటారు.
వైఖానస ఆగమానుసారం వైష్ణవ సాంప్రదాయం ప్రకారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించి మామిడాకులను కాల్చి వచ్చిన భస్మంతో స్వామివారికి బుగ్గచుక్క పెట్టి, ఉంగరాలు తొడిగి పెళ్ళికుమారుని, పెళ్ళి కుమార్తెను కళ్యాణానికి సిద్ధం చేశారు. తొలిరోజు స్వామివారిని ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం చంద్రప్రభ వాహనాలపై అధిష్టింపచేసి గ్రామోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

రెండవరోజు...


ఉత్సవాల రెండవరోజు గురువారం సాయంత్రం స్వామివారు హంసవాహనంపైన, రాత్రి శేష వాహనంపైన కొలువుదీరి గ్రామోత్సవంలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. సాయంత్రం 6.30 గంటలకు ధూపసేవ, అనంతరం ధ్వజారోహణం కార్యక్రమాలు ఆలయ సాంప్రదాయానుసారంగా చేపట్టారు.

మూడవరోజు...


కళ్యాణోత్సవాల్లో భాగంగా మూడవరోజు స్వామివారు హనుమద్వాహనం, సింహవాహనాలపై ఊరేగారు. స్వామివారు వాహనాలపై దేవేరీ సమేతంగా ఆశీనులై గ్రామోత్సవంలో భక్తులను కరుణించారు. అంతకుముందు స్వామి, అమ్మవార్లకు లాంఛనప్రాయంగా పూజలను నిర్వర్తించారు.

నాలుగోరోజు....


ఉత్సవాల్లో భాగంగా నాలుగోరోజు స్వామివారు శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి, కంచు గరుడ వాహనాలపై ఊరేగి భక్తులకు కనువిందు చేశారు. రాత్రి 11.29 నిముషాలకు రోహిణీ నక్షత్రయుక్త తులా లగ్నంలో స్వామి, అమ్మవార్లకు అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. అంతర్వేది ప్రాంతమంతా ఓ పక్క జలసంద్రం, మరోపక్క జనసంద్రం అన్నట్టుగా మారిపోయింది. తెలుగు రాష్ట్రాలనుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి ఈ వేడుకను కనులారా తిలకించారు.

radhotsavam antarvedi

ఐదవరోజు...


కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఐదవరోజు స్వామివారికి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి రథాన్ని లాగేందుకు వేలాదిగా భక్తులు పోటీపడ్డారు. ఈ భాగ్యంకోసం భక్తులు తపనతో ఒకరిపై ఒకరు పోటీ పడడం కనిపించింది. మధ్యాహ్నం 2.04 నిముషాలకు స్వామివారిని, అమ్మవారిని ఆలయం నుంచి పల్లకిలో రథం వద్దకు తోడ్కొనివచ్చి రథంపై అధిష్టింపచేసి అనంతరం రథోత్సవాన్ని ప్రారంభించారు. వేలాదిగా భక్తులు రథం వెంట నడుస్తూ నారసింహుని స్తుతించారు.

ఆరవరోజు...


ఉత్సవాల్లో ఆరవరోజు సాయంత్రం స్వామివారు గజవాహనంపై, రాత్రి 8.00 గంటలకు పొన్నవాహనంపై ఆశీనులై గ్రామోత్సవంలో దర్శనమిచ్చారు. సాయంత్రం 5.00 గంటల నుంచి 7.00 గంటల వరకూ ఆలయాన్ని భీష్మ ఏకాదశి పర్వదినంకోసం సిద్ధంచేశారు. భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి ఘడియల్లో స్వామివారికి అన్నరాశులను నైవేద్యంగా సమర్పించారు. ఈరోజు తరలివచ్చిన భక్తులు ముందుగా సముద్రస్నానాలు చేసి అనంతరం స్వామివారి దర్శనానికి తరలివచ్చారు.

ఏడవరోజు...


ఉత్సవాల్లో ఏడవరోజు స్వామివారు సముద్రస్నానం ఆచరించారు. గరుడపుష్ప వాహనంపై స్వామివారు సుదర్శన చక్రాలు ధరించి భక్తజన కోలాహలం నడుమ ఊరేగింపుగా అంతర్వేదిలో గోదావరి సముద్రంలో కలిసే సంగమ ప్రాంతానికి చేరుకుని సాగరస్నానాన్ని ఆచరించారు. స్వామివారు గ్రామోత్సవంలో భాగంగా రాజాధిరాజ, అశ్వవాహనాలపై అధిరోహించి భక్తుల పూజలందుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారిని, అమ్మవారిని పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఎనిమిదోరోజు....


కళ్యాణోత్సవాల్లో భాగంగా ఎనిమిదోరోజు తెల్లవారుజామున మూడుగంటల నుంచి ఆరుగంటల వరకూ స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన, బాలభోగ సేవలను నిర్వహించారు. మాఘపౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారిని ఉదయం ఎనిమిది గంటలకు గరుడపుష్ప వాహనంపై ఊరేగిస్తూ గ్రామోత్సవం నిర్వహించారు. 10.30 గంటలకు స్వామివారికి చక్రస్నానాన్ని నిర్వహించారు. వేలాదిగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తొమ్మిదోరోజు...


లక్ష్మీ నరసింహస్వామి తొమ్మిదిరోజుల కళ్యాణోత్సవాల చివరిరోజైన ఫిబ్రవరి ఒకటిన స్వామివారికిఘనంగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. ఇందుకోసం ప్రత్యేక పడవను ఏర్పాటుచేసి విద్యుద్దీపాలతోను, పుష్పాలతోను అలంకరించి స్వామి, అమ్మవార్లను అధిష్టింపచేశారు. సాయంత్రం ఆరుగంటలకు తెప్పోత్సవాన్ని నిర్వహించారు. అంతకుముందు ఉదయం స్వామివారికి సుప్రభాతసేవ, బాలభోగ నివేదనలు సాంప్రదాయబద్ధంగా జరిగాయి. రాత్రి ఎనిమిది గంటలకు తిరుమంజనసేవ, ధూపసేవ, విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, ద్వాదశతిరువారాధన నిర్వహించారు. రాత్రి తొమ్మిది గంటలకు స్వామివారికి శ్రీపుష్పోత్సవం నిర్వహించిన అనంతరం పవళింపు సేవ చేయడంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

• మాఘ శుద్ద సప్తమి : మాఘ బహుళ పాడ్యమి – బ్రహ్మోత్సవాలు ప్రారంభం
• మాఘ శుద్ధ దశమి : కళ్యాణం
• మాఘ శుద్ధ ఏకాదశి భీష్మైకాశి : రథోత్సవం
• జేష్ఠ శుద్ధ ఏకాదశి : శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణం
• వైశాఖ శుద్ధ చతుర్దశి : నృసింహ జయంతి