విజయనగర రాజుల వైభవం హంపి క్షేత్ర ప్రాభవం

''హంపి'' ఒక చారిత్రక ప్రాంతం. ఇది ఆధ్యాత్మికంగాను చారిత్రకంగానూ పస్రిద్ధిచెందింది. హంపి నగరం13-15వ శతాబ్దాల మధ్యకాలంలో దక్షిణ భారతదేశములోని అతి పెద్ద సామ్రాజ్యాలలో ఒకటైన విజయనగర సామ్రాజ్య రాజధాని. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలోని ఒక చిన్న పట్టణం.

హంపి నగరం మొత్తంగా చూస్తే 26 చదరపు కి.మి విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఉత్తరం వైపు తుంగ భద్ర నది మిగతా మూడు వైపుల పెద్ద పెద్ద గ్రానైటు శిలలతో అప్పటి విజయనగర వీధుల వైభవాన్ని తెలుపుతూ ఉంటుంది. ఈ పట్టణం అణువణువు శిల్పకళా చాతుర్యాన్ని చాటి చెపుతుంది. అంతేకాకుండా సుల్తానుల అవివేక విశృంఖల వినాశన వైఖరికి కూడా సాక్ష్యమిస్తుంది. ఈ నగరం బెంగళూరు నుండి 343కి.మీ. దూరంలో, బీజాపుర నుండి 254 కి.మీ.బళ్ళారి నుండి 74కి.మీ. దూరంలో ఉంది. విజయనగరంకు దగ్గరలో ఉన్న రైలు సౌకర్యం గల ఊరు హొస్పేట్‌.

విజయనగర వైభవం


విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ వంశానికి చెందిన హక్క రాయలు(హరిహర రాయలు), బుక్క రాయలు స్థాపించారు. మొదటి హరిహర రాయలు రాజ్యాన్ని స్థాపించడంలో ప్రధాన పాత్ర చూపగా, తరువాత రాజ్యానికొచ్చిన ఈయన సోదరుడు మొదటి బుక్క రాయలు రాజ్యాన్ని విస్తరించాడు. రాజ్యం ముందు తుంగభద్ర నది ఉత్తర తీరాన ఆనెగొందిని రాజధానిగా చేసి స్థాపించగా విద్యారణ్య స్వామి అధ్వర్యంలో రాజధానిని తుంగభద్రానది దక్షిణ తీరానికి తరలించి విజయనగరం అనే పేరుతో ఈ నగరాన్ని శత్రుదుర్భేద్యమైన రీతిలో నిర్మించారు. విద్యారణ్య స్వామి ద్వారా ఏర్పడినది కాబట్టి ఇది ముందు విద్యానగరముగా పిలవబడింది, తర్వాత కాలక్రమంలో విజయనగరంగా మారింది. భారతదేశం లోనే అతిపెద్ద హిందూ సామ్రాజ్యమైన విజయనగర సామ్రాజ్యం రాజధాని అయిన విజయనగర వైభవం దేశదేశాలలోని పర్యటకులను ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంది.

Virupaksha_temple

విరూపాక్ష దేవాలయం


హంపి యొక్క ఆధ్యాత్మిక చారిత్రక వైభవానికి పధ్రాన సాక్ష్యం విరూపాక్ష దేవాలయం. సుమారు 50 మీటర్ల ఎత్తు ఉండే తూర్పు గాలి గోపురం విరూపాక్ష దేవాలయానికి మనల్ని స్వాగతం పలుకుతుంది. దేవాలయంలో పరమశివుడు విరూపాక్షుడుగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. విరూపాక్షునికిి అనుసంధానంగా పంపాదేవి, భువనేశ్వరి దేవి ఆలయాలు ఉంటాయి. విరూపాక్ష దేవాలచ చరిత్ర 7వ శతాబ్దం నుండి చరిత్రపుటల్లో కనిపిస్తుంది. చారిత్రక ఆధారాల ప్రకారం ప్రధాన దేవాలయానికి చాళుక్యులు, హోయస్లల పరిపాల కాలంలో మార్పులు చేర్పులు జరిగాయని చరిత్ర చెబుతుండగా, ప్రధాన ఆలయం మాత్రం విజయనగర రాజులే నిర్మించారన్న సాక్యాలున్నాయి.

 

విజయనగర రాజులు పతనమయ్యాక 16 వ శతాబ్దం ప్రాంతంలో జరిగిన దండయాత్రల వల్ల హంపి నగరంలోని అత్యద్భుత శిల్ప సౌందర్యం పూర్తిగా నాశనమైపోయింది. కానీ విరుపాక్ష-పంపా ప్రాకారం మాత్రం దండయాత్రల బారి పడలేదు. విరుపాక్షునికి ధూప దీపనైవేద్యాలు నిర్విఘ్నంగా కొనసాగాయి. అనంతరం 19 వ శతాబ్దం మొదలులో ఈ ఆలయం పైకప్పు పై చిత్రాలకి, తూర్పు, ఉత్తర గోపురాలకి జీర్ణోద్ధరణ జరిగింది. ఈ ఆలయ అభివద్ధిలో శ్రీ కష్ణదేవరాయల పాత్ర ఎంతో ఉన్నదని లోపలి ప్రాకారం ఉన్న స్థంబాల వసారాలోని శిలాశాసనాలు చెబుతున్నాయి.

ఆలయ విశేషాలు


ఈ దేవాలయానికి మూడు ప్రాకారాలు ఉన్నాయి. తొమ్మిది ఖానాలతో 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గోపురములోని రెండు ఖానాలు రాతితో నిర్మించబడ్డాయి మిగతా ఏడు ఖానాలు ఇటుకలతో నిర్మించబడ్డాయి. ఈ తూర్పు గోపురం నుండి లోపలికి ప్రవేశిస్తే బయటి నుండి ఆలయంలోకి వెళ్ళే మొదటి ప్రాకారం స్తంభాలు లేకుండా ఆకాశం కనిపించేటట్లు ఉంటుంది. ఈ ప్రాకారాన్ని దాటి లోపలికి వెళ్తే స్థంబాలతో కూడి కప్ప బడిన

తుంగభద్రా నది నుండి ఒక చిన్న నీటి ప్రవాహం ఆలయంలోకి ప్రవేశించి గుడి వంట గదికి నీరు అందించి బయటి ప్రాకారం ద్వారా బయటకు వెళ్తుంది. ఈ విరుపాక్ష దేవాలయంలోని బయటి ప్రాకారంలో ఏకశిలలో చెక్క బడిన నంది ఒక కి.మీ. దూరం వరకు కనిపిస్తుంది.

హంపి పరిసరాల్లో పలు చారిత్రక దేవాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించేవారు తప్పనిసరిగా వీటన్నింటినీ కూడా చూసి తీరాల్సిందే. ప్రతి ఆలయం విజయనగర రాజులు కళా పిపాసకు సాక్ష్యం చెబుతాయి. పధ్రానంగా శ్రీకృష్ణదేవయాల కళా పోషణకు ఇక్కడి దేవాలయాలు మచ్చుతునకలుగా నిలుస్తాయి.

vithaleswara-swamy

విఠలేశ్వర దేవాలయ సముదాయం


హంపికి ఈశాన్య భాగంలో అనెగొంది గ్రామానికి ఎదురుగా ఉన్న విఠల దేవాలయ సముదాయం అప్పటి శిల్ప కళా సంపత్తికి ఒక నిదర్శనం. 16 వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం మరాఠీలు విష్ణుమూర్తిగా ప్రార్థించే విలేశ్వరుడిది. విఠలేశ్వర దేవాలయంలో విశేషమేంటంటే సప్తస్వరాలు పలికే ఏడు సంగీత స్థంభాలు. ఈ దేవాలయంలో పురందరదాస ఆరాధనోత్సవాలు అత్యంత వైభవోపూతంగా జరుగుతాయి. ఇక్కడ మరో విశేషం ఏకశిలా రథం. విఠల దేవాలయ సముదాయానికి తూర్పు భాగంలో ఉండే ఈ రథానికి కదిలే చక్రాలు ఉంటాయి. ఆలయంలో గోపురం నీడ ప్రధాన ఆలయంలోని ఒక చిన్న రంధ్రంలో నుండి క్రింద నుండి పైకి అనగా తలక్రిందులుగా కనపడటం అప్పటి కళా చాతుర్యానికి నిదర్శనం.

గజశాల


పట్టపు ఏనుగుల నివాసంకోసం వాటి దైనందిన కార్యకలాపాల కొరకు రాజ ప్రాసాదానికి దగ్గరలోనే ఒక పెద్ద గజశాల ఉంది. ఏనుగులు కవాతు చేయడానికి వీలుగా ఈ గజశాలకు ఎదురుగా పెద్ద ఖాళీ ప్రదేశం ఉన్నది. ఈ గజశాల గుమ్మాలు కొప్పు ఆకారంలో ఉండి ముస్లిం కట్టడ శైలి చూపుతుంటాయి. మావటి వారు, సైనికులు ఉండడానికి గజశాలకు ప్రక్కన సైనిక స్థావరాలు కూడా కనిపిస్తాయి.

hajara-ramalayam

హజారా రామాలయం


హంపి దగ్గరలో హజార రామాలయం ఉంది. ఈ శ్రీరామచంద్రుడి దేవాలయం దీర్ఘచతురస్రాకారపు ప్రాంగణంలో ఉంది. దేవాలయం తూర్పు వైపు అభిముఖంగా ఉంది. ప్రతి రోజు గుడిలో జరిగే సేవలు, ప్రత్యేక సేవల చిత్రాలు ఆలయం బయటి ప్రాంగణంలో చిత్రించబడి ఉన్నాయి. ఆలయం లోపలి ప్రాంగణంలో గోడల మీద మరియు ఆలయంలో రామాయణ కథను తెలిపే చిత్రాలు చిత్రించబడి ఉన్నాయి. చిన్నికృష్ణుడి లీలలు గోడలపై చిత్రించబడి ఉన్నాయి. ఈ దేవాలయములోనికి ప్రవేశము మరియు దేవతార్చన చేసే అవకాశం రాచ ప్రతినిధులకు మాత్రమే ఉండేదిట. ఈ గుడి శ్రీ రాముడు వాలిని వధించిన ప్రదేశములోనే నిర్మించారని చెబుతారు. ఇప్పుడు ఈ దేవాలయం లోపల గోడలపై శ్రీ రాముడి చిత్రాలు అనేకం చిత్రించడం వల్ల, ఆ సంఖ్య లెక్క పెట్టడానికి వీలు లేకుండా ఉండడం తో ఈ దేవాలయాన్ని హజారా(సహస్ర)రామాలయం అని కూడా పిలుస్తారు..

భూగర్భంలో ఉన్న విరూపాక్షుని దేవాలయం


భూగర్భంలో ఉన్న ఈ దేవాలయం చరిత్రకారుల త్రవ్వకాలలో బయట పడింది. ఈ అత్యంత విశాలమైన గుడి ఇప్పుడు పైకి కనిపిస్తోంది. (హంపి లోని విరూపాక్షుని దేవాలయం కాదు). అప్పుడప్పుడు వర్షాలతో ఈ గుడి వరదల పాలై సందర్శకులు చూడడానికి అవకాశం ఉండదు. సందర్శకులు చూడడానికి అవకాశం ఉన్న రోజులలో గబ్బిలాలతోను , కీటకాలతోను నిండి ఉంటుంది.

lotus bhavan

కమల భవనం


పట్టపు రాణుల కోసం నిర్మించబడి, నీటి గొట్టాల ద్వారా నీరు ప్రవహించే ఏర్పాటు ఉండేది. విజయనగర రాజుల కాలములోని ఈ నిర్మాణాలు ముస్లిముల కట్టడ శైలిని ప్రదర్శిస్తున్నాయి. పెద్ద పెద్ద ప్రాకారపు గుమ్మాలు, శంఖు ఆకారంలో ఉన్న పైకప్పు విజయనగర రాజుల కట్టడాల శైలి నుండి విభేదించి ముస్లిముల కట్టడ శైలిని తెలియచేస్తాయి. ఈ భవన నిర్మాణములో వేదికలు నిర్మించడానికి చెక్క కూడా వినియోగించబడింది.

పుష్కరిణి


పట్టపు రాణి స్నాన మందిరాన్ని మెట్ల స్నానమందిరంగా మలిచారు. ఇది ఒక దిగుడుబావి లోపలికి దిగడానికి మెట్లతో స్నానంచెయ్యడానికి అనువుగా నిర్మించబడింది. ఈ రకమైన దిగుడుబావులు పగటిపూట వేడిమి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. జన సంచార సమయాల్లో వీటిని మూసివేస్తారు.

హేమకూట పర్వతం


ఈ పర్వతం హంపి గ్రామానికి దక్షిణం వైపు ఉన్న హేమకూట పర్వతంపై కనిపించే చిన్న చిన్న దేవాలయాలు విజయనగర సామ్రాజ్య స్థాపనకు పూర్వం నిర్మించబడినవి. వాటి చరిత్ర 10వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్నారు. విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగినప్పుడు ఈ దేవాలయాలను పరిరక్షిస్తూ విజయనగర నిర్మాణం జరిగింది(ఇప్పడు శిధిలమైంది). ఇక్కడ ఉన్న కొన్ని దేవాలయాలు అసంపూర్ణముగా నిలిచిపోయి కనిపిస్తాయి.

శ్రీకృష్ణ దేవాలయం


శిథిలావస్థలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయాన్ని హేమకూట పర్వతంపై మనం చూస్తాం. కళింగదేశంపై విజయ చిహ్నంగా ఈ దేవాలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడు. ఈ గుడికి రెండు ప్రాకారాలు ఉంటాయి. బయటి ప్రాకారంలోని కొంత భాగం పూర్తిగా శిథిలమైపోగా కొంత భాగాన్ని సంస్కరించారు. గర్భగుడిలో ఉండాల్సిన మూర్తి మాత్రం లేదు.

Narasimha_Statue

ఉగ్ర నరసింహ మూర్తి


హంపి వీధికి దగ్గరలొనే ఉగ్ర నరసింహమూర్తి విగ్రహం ఉన్నది. అక్కడ లభించిన శాసనాలు ఈ విగ్రహాన్ని శ్రీకృష్ణదేవరాయలు 1528 సంవత్సరంలో ఏకశిలపై చెక్కించినట్టు చెబుతున్నాయి. ఈ విగ్రహము మోకాలిపై చిన్న లక్ష్మీ దేవి విగ్రహము ఉండేది. అయితే ఈ లక్ష్మీ విగ్రహము ప్రధాన విగ్రహము నుండి విడిపడింది. బహుశా ఇది దండయాత్ర ఫలితంగా జరిగి ఉండవచ్చని ఈ ప్రాంత వాసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ లక్ష్మీ విగ్రహాన్ని కమలాపురలోని మ్యూజియంలో భద్రపరిచారు.

sugreeva-cave

సుగ్రీవుడి గుహ


హంపిలో మనకు సుగ్రీవుని గుహ కనిపిస్తుంది. ఈ గుహ సహజసిద్ధంగా ఏర్పడిన గుహ గాను, వాలి బారి నుండి తప్పించుకొవడానికి సుగ్రీవుడు ఇక్కడే విడిది చేశాడని శ్రీ రామచంద్రమూర్తిని ఇక్కడే హనుమంతుడి ద్వారా కలిసాడని చెబుతారు.

రాజ తులాభారం


విఠలేశ్వర స్వామి గుడికి నైరుతి దిశలో రాజతులాభారం ఉంది. ఈ తులాభారం రెండు గ్రానైటు స్తంభాలు వాటి మధ్య భూమికి సమాంతరంగా ఒక గ్రానైటు కమ్మి ఉంటుంది. ప్రత్యేక దినాలలో ఈ రెండు స్తంభాల మధ్య కమ్మిని నిలిపి రాజు తనను తులాభారం మీద తూచుకుని బంగారం మణులు రత్నాలను బ్రాహ్మణులకు, సాధువులకు దానం ఇచ్చేవాడని చెబుతారు.

ఇలాంటి విశేషాలు హంపి చుట్టుప్రక్కల వందల్లో కనిపిస్తాయి. వాటన్నింటి వెనెక ఆసక్తికర కధనాలు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతనతోపాటు వినోదం, విజ్ఞానం మేళవింపుగా ఉండే 'హంపిని మన జీవితంలో ఒక్కసారి ఖచ్చితంగా చూసిరావాల్సిందే.