వ్యక్తి సంతోషం కంటే సమాజం మొత్తం సంతోషంగా ఉండడం ముఖ్యమని, ఇలాంటి కార్యాలను మాత్రమే అందరూ ఆచరించాలని విదురుడు బోధించారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉద్ఘాటించారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ‘విదురనీతి’పై రెండు రోజుల ధార్మికోపన్యాసాలు జరిగాయి.
ఈ సందర్భంగా శ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉపన్యసిస్తూ ద్వాపరయుగంలో దృతరాష్టుడు అనే రాజు వద్ద విదురుడు మంత్రిగా ఉండేవారని, రాజ్యకాంక్షతో పాండవులను పలు ఇబ్బందులు పెడుతున్న దృతరాష్టునికి విదురుడు ఏ మాత్రం సంశయం లేకుండా ధర్మబద్ధంగా పలు సూచనలు చేశాడని చెప్పారు.
విదురుని మాటలకు దేశకాల పరిమితి లేదని, ఏ ప్రాంతంలోనైనా, ఏ కాలంలోనైనా చెల్లుబాటవుతాయని వివరించారు. సమాజపరంగా, శీలపరంగా, వ్యక్తిపరంగా, వ్యక్తిత్వపరంగా మానవులు ఎలా నడుచుకోవాలనే విషయాలను విదురుడు తెలియజేశాడని చెప్పారు.
Source