తంజావూరు ఆలయ చరిత్ర
ఆలయంలోని శిల్ప కళా రూపాలు చోళుల శిల్ప కళా రీతికి దర్పణాలు. ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం, గర్భగుడిలోని 13.5 అడుగుల ఎత్తు 60 అడుగులు విస్థీర్ణంలో వున్న శివలింగం, ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ. అంతే గాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివ పార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లున్న శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్ప కళా రీతులు ఆలయ శోభను ఇనుమడిస్తున్నాయి.రాజేంద్రచోళుని అంతఃపురం ఈ ఆలయానికి ఒక కిలోమీటరు దూరంలోనే వున్నది. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడ అంతు పట్టదు. ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఇప్పటికి త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయట పడుతూ ఆనాటి వైభవాన్ని ఈ నాటికి చాటు తున్నాయి.
ఈ విశేష నిర్మాణం కుంజర రాజరాజ పెరుంథాచన్ అనే సాంకేతిక నిపుణుడు మరియు వాస్తుశిల్పి చే చేయబడినది. ఈ విషయములు అచట గల శాసనాల ద్వారా తెలియుచున్నది. ఈ దేవాలయం వాస్తు మరియు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణం చేయబడినది. ఈ దేవాలయ మొదటి భవనం పూర్తిగా గ్రానైట్ శిలలతో నిర్మితమైనది. సుమారు 5 సంవత్సరాల పాటు అంటే1004ఎడి నుంచి 1009ఎడి మధ్య కాలంలోఆలయ నిర్మాణం చేపట్టి పూర్తిచేశారు.
చుట్టూ గోడలపై అష్టదిక్పాలకులు
తంజావూరు పరమేశ్వరాలయంలో అష్ఠ దేవతల విగ్రహాలు బయటి గోడలపై ఉన్నాయి. వాటిలో దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దవి. ఈ దేవాలయం అష్ట దిక్పాలకుల విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాలలో ఒకటి. ఈ విగ్రహాలు ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు మరియు ఈశానుడు అనే అష్టదిక్పాలకులు.ఈ విగ్రహాలు జీవిత పరిమాణం గలవి అనగా 6 అడుగుల ఎత్తు కలవి). విశాలమైన ఈ ఆలయంలోనికి చేరడానికి మూడు ద్వారాలున్నాయి. మొదటి ద్వారం (ప్రవేశ ద్వారం) కేరళాంతకన్, రెండవ ద్వారం రాజరాజన్ తిరువనల్, మూడో ద్వారం తిరువానుక్కన్ తిరువనల్.
భారీ నంది విగ్రహం
మన రాష్ట్రంలోని లేపాక్షి బసవన్న తరువాత అంత భారీ నంది విగ్రహం తంజావూరు ఆలయం ఎదురుగా ఉంటుంది. ఈ నంది మండపాన్ని చోళ రాజుల తర్వాత పరిపాలించిన నాయక రాజులు, మరాఠాలు అందమైన నగిషీలతో చింత్రించిన చిత్రాలను అందమైన రీతిలో మలిచారు. ఈ మహానందికి ఎదురుగా ప్రధాన ఆలయం ఉంది. ఈ ఆలయం పై భాగం మహాముఖ మండపాలతో నాలుగు అంతస్తులతో ఉంది.ఆలయ ప్రధాన ద్వారం తూర్పుకు ఉండగా పడమర, ఉత్తర, దక్షిణ దిశల్లో కూడా ద్వారాలున్నాయి. గర్భగుడిలో చాలా పెద్ద లింగ పీఠమూ, దాని మీద అతిపెద్ద లింగమూ ఉన్నాయి. ఇంత అందమైన, పెద్దదిగా ఉన్న లింగము దేశంలో ఇక్కడే చూస్తాము. రెండు గోడల మధ్య రెండు అంతస్తులలో ప్రదక్షిణ మార్గం ఉంది. నాలుగువైపుల ద్వారాలున్న ఈ ఆలయం చతుర్ముఖం లేక సర్వతోభద్రంగా ఉన్న ఆలయంగా వర్ణిస్తారు శిల్పులు.