ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4.00 గం||ల అనంతరం స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుండి ఊరేగింపుగా బయలుదేరి వరాహస్వామి ఆలయం చెంత ఒకరికొకరు ఎదురేగుతారు. ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల తరఫున వేరువేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతిస్తారు.
ఆ తరువాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూబంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుండి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రణయకలహ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వసంతోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.
జనవరి 2న పౌర్ణమి గరుడసేవ రద్దు
ప్రతినెలా పౌర్ణమినాడు నిర్వహించే శ్రీవారి గరుడసేవను జనవరి 2వ తేదీన టిటిడి రద్దు చేసింది. శ్రీవారి ఆలయంలో డిసెంబరు 18వ తేదీ నుండి అధ్యయనోత్సవాలు జరుగుతున్న విషయం విదితమే. ఈ కారణంగా మంగళవారం పౌర్ణమి గరుడసేవను రద్దు చేశారు. కాగా, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి కారణంగా రద్దు చేసిన శ్రీవారి ఆర్జితసేవలు జనవరి 2వ తేదీ మంగళవారం నుంచి యథావిధిగా జరుగనున్నాయి.
Source