సంక్రాంతి సంబరాల్లో భాగమైన గొబ్బిళ్ళ పండుగలో పాడుకును గొబ్బిళ్ల పాటలు మీ కోసం భక్తిసారం అందిస్తోంది.
సంక్రాంతి సంబరం అంతా గొబ్బిళ్ల వేడుకలలోనే కనిపిస్తుంది. ఇంటిముందు రంగవల్లుల్లాంటి కొత్త బట్టలు ధరించిన ఆడపిల్లలు సప్తవర్ణాలు అద్దిన రంగవల్లుల మధ్యలో గొబ్బెమ్మలు ఉంచి వాటిని పూజించి అనంతరం గొబ్బిళ్ళ పాటలు పాడుతుంటే ఆ అందం ఆనందం మరొక సందర్భంలో రాదంటారు పెద్దలు. కానీ మన సనాతన సాంప్రదాయాలు కనుమరుగు అవుతున్నాయి. ఈ నేపధ్యంలో మనం మర్చిపోతున్న గొబ్బెమ్మల పాటను మీకు గుర్తు చేసే ప్రయత్నంలో భాగంగా గొబ్బిపాటలను మీకు భక్తిసారం అందిస్తోంది. ‘మల్లెపూల హారం వేసేదా గోపాలకృష్ణ’అనే పాటను మీకు 6వ పాటగా అందిస్తున్నాము..
మల్లెపూల హారమేయవే ఓయమ్మ నన్ను మత్స్యావతారుడనవే
మల్లెపూల హారం వేసెద గోపాలకృష్ణ నిన్ను మత్స్యావతారుడనెదా
కుప్పికుచ్చుల జడనువేయవే ఓయమ్మ నన్ను కూర్మావతారుడనవే
కుప్పికుచ్చుల జడను వేసెదా గోపాలకృష్ణ నిన్ను కూర్మావతారుడనెదా
వరములిచ్చి దీవించవే ఓయమ్మ నన్ను వరహావతారుడనవే
వరములిచ్చి దీవించెదా శ్రీకృష్ణ నిన్ను వరహావతారుడనెదా
నాణ్యమైన నగలు వేయవే ఓయమ్మ నన్ను నరసింహావతారుడనవే
నాణ్యమైన నగలు వేసెద గోపాలకృష్ణ నిన్ను నరసింహావతారుడనెదా
వాయువేగరథము లీయవే ఓయమ్మ నన్ను వామనావతారుడనవే
వాయువేగరథము లిచ్చెద గోపాలకృష్ణ నిన్ను వామనావతారుడనెదా
పాలుపోసి బువ్వపెట్టవే ఓయమ్మ నన్ను పరశురామావతారుడనవే
పాలుపోసి బువ్వ పెట్టెదా గోపాలకృష్ణ నిన్ను పరశురామావతారుడనెదా
ఆనందబాలుడనవే ఓయమ్మ నన్ను అయోధ్యారాముడనవే
ఆనందబాలుడనెదా గోపాలకృష్ణ నిన్ను అయోధ్యారాముడనెదా
గోవులుకాచే బాలుడనవే ఓయమ్మ నన్ను గోపాలకృష్ణుడనవే
గోవులుకాచే బాలుడనెదా గోపాలకృష్ణ నిన్ను గోపాలకృష్ణుడనేదా
బుద్ధులు తెలిపి ముద్దులు పెట్టవే ఓయమ్మ నన్ను బుద్ధావతారుడనవే
బుద్ధులు తెలిపి ముద్దులు పెట్టెదా గోపాలకృష్ణ నిన్ను బుద్ధావతారుడనవే
కాళ్ళకుపసిడి గజ్జెలు కట్టవే ఓయమ్మ నన్ను కల్కావతారుడనవే
కాళ్ళకుపసిడి గజ్జెలు కట్టెదా గోపాలకృష్ణ నిన్ను కల్కావతారుడనెదా