ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది.
ఈ వైకుంఠ ఏకాదశి నాడు ''వైకుంఠ ఏకదశీ వ్రతం'' ఆచరించిన వారికి శుభఫలితాలుంటాయి. పర్వతుని సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృ దేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి. కృత యుగంలో ''ముర'' అనే రాక్షసుడు దేవతలను, సాధువులను క్రూరంగా హింసించే వాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకున్నారు. భగవంతుడు మురాసురుడి మీదికి దండెత్తి, అతని వధించాడు. ముర సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటే, అతన్ని బైటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకున్నాడు.
అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి, విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే, మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై మురను సంహరించగా, ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు ఏకాదశి అన్న బిరుదు ప్రసాదించాడు. నాటి నుంచి ఏకాదశీ వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తారని ఏకాదశి వ్రత నిర్వచనంగా పెద్దలు చెబుతారు. వైష్ణవ ఆళ్వారుల్లో శ్రీనమ్మాళ్వారులు ఈ రోజున పరమపదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశీ వ్రతమాచరిస్తారు.