శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా ”బాలాలయం”



తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో బాలాలయం కార్యక్రమాలు సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి భక్తులకు విశ్వరూప సర్వదర్శనం కల్పించారు. ఆ తరువాత ఉత్తర తిరుమంజనం, తోమాలసేవ, అర్చన చేపట్టారు. రుత్వికులకు రక్షాబంధనం అనంతరం యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. రాత్రి శ్రీగోవిందరాజస్వామివారి సన్నిధి, ఇతర ఉప ఆలయాల్లో కళాకర్షణం చేపడతారు. కుంభాలు, ఉత్సవమూర్తులు, పరివార దేవతామూర్తులను ఊరేగింపుగా యాగశాలకు వేంచేపు చేస్తారు.

ఆలయంలో బాలాలయం కార్యక్రమాల కారణంగా డిసెంబరు 12 నుంచి 14వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి మూలమూర్తి దర్శనాన్ని టిటిడి రద్దు చేసింది. ఉప ఆలయాలైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారధిస్వామివారి ఆలయం, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఆలయం, శ్రీ పుండరీకవళ్లి ఆలయాల్లో యథావిధిగా దర్శనం ఉంటుంది.

డిసెంబరు 15వ తేదీన మహాసంప్రోక్షణ అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఆలయంలోని కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన బాలాలయంలో శ్రీ గోవిందరాజస్వామివారిని భక్తులు దర్శించుకోవచ్చు. జీర్ణోద్ధరణ పనుల కారణంగా సుమారు మూడు నెలల పాటు గర్భాలయంలో మూలమూర్తి దర్శనం ఉండదు. బాలాలయంలోని శ్రీ గోవిందరాజస్వామివారిని భక్తులు దర్శించుకోవచ్చు.