తిరుపతి యాత్రలో తప్పక దర్శించతగిన ఆలయం అప్పలాయగుంట శ్రీ వేంకటేశ్వరాలయం


తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శనానికి మనం వెళ్లినప్పుడల్లా చుట్టుప్రక్కల ఉండే ప్రముఖ పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకోవడం పరిపాటి. అలా మీరు దర్శించాల్సిన ఆలయాల్లో ప్రముఖమైనది అప్పలాయగుంట శ్రీ వేంకటేశ్వరాలయం కూడా. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాముఖ్యత వహించిన తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయానికి చుట్టు ఉన్న ఏడు పురాతన శ్రీ వేంకటేశ్వరాలయాలలో అప్పలాయగుంట శ్రీ వేంకటేశ్వరాలయం ఒకటి.

ఆలయ చరిత్ర

శ్రీ వేంకటేశ్వరుడు నారాయణ వనం లో ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహమాడి తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళ్తూ అప్పలాయగుంట లో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయ హస్తంతో ఆశీర్వదించి, ఈ ఆలయంలో కొలువు దీరాడు. తర్వాత ఇక్కడి నుండి కాలినడకన తొండవాడ లోని అగస్తేశ్వరు ని దర్శించి తర్వాత సమీపంలోనే ఉన్న శ్రీనివాస మంగా పురం లో ఆరునెలలు ఉండి అక్కడి నుండి శ్రీవారి మెట్టు ద్వారా (నూరు మెట్ల దారి) తిరుమల చేరాడని స్థల పురాణం.

పేరు వెనుక చరిత్ర

ఈ ప్రదేశంలో అప్పలయ్య అనే వ్యక్తి అవసరార్ధం ఒక గుంట తవ్వించాడని అప్పటి నుండి ఈ ప్రదేశం అప్పలయ్య గుంటగా పిలువబడినదని కాకక్రమంలో అది అప్పలగుంటగా మారిందని తలుస్తుంది. అప్పలయ్య ఆ గుంట త్రవ్వే సమయంలో పనిచేసినవారికి కూలి అప్పు చెప్పకుండా ఏరోజుకు ఆరోజే ఇచ్చేవాడని అందుకనే ఈ ప్రదేశాననికి ఈ పేరు వచ్చిందని అదనంగా ప్రచారంలో ఉంది.

ఆలయ విశేషాలు

ఈ ఆలయానికి దక్షిణం వైపున ఎత్తైన కొండ, చుట్టూ పంటపొలాలు ఉండడముతో వాతావరణము చాల ప్రశాంతంగా ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారం దాటగానే ధ్వజస్తంభం, దాని వెనుక అంతరాళం ఎదురుగా గర్భ గుడిలో శ్రీ వారి దివ్య మంగళ రూపం కనుల విందు చేస్తుంది. శ్రీ వారి ఆలయం ముందు చిన్న కోనేరు, దానికి ముందు అనగా ప్రధాన ఆలయానికి ఎదురుగా చిన్న ఆంజనేయ స్వామి వారి ఆలయము ఉన్నది.

పూజా విశేషాలు

ప్రతి నిత్యం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామివారికి మంగళ వాయిద్యాలతో పూజాభిషేకాలు నిర్వహించి, తర్వాత శ్రీవారికి అభిషేకాలు పూజలు నిర్వహించి, భక్తులకు దర్శన భాగ్యాన్ని కలుగ జేస్తారు. ఆలయ పరిసరాలు ప్రశాంత వాతావరణంతో ఉంటాయి. మనసుకు ఆహ్లాదాన్ని కలుగజేస్తాయి. భక్తుల రద్దీ కూడా సాధారణంగా ఉంటెంది, అందువల్ల భక్తులు సావధానంగా మనఃపూర్తిగా దైవ దర్శనం చేసుకోవచ్చు.

అప్పలాయగుంట శ్రీ వేంకటేశ్వర ఆలయానికి వెళ్లడం చాలా సుళువు. అప్పలాయ గుంట తిరుపతికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. తిరుపతి నుండి ప్రతి గంటకు బస్సులు ఉంటాయి. ఆటోలు కూడా దండిగా తిరుగుతాయి. క్యాబ్ లు కూడా లభిస్తాయి. కొన్ని ఆటోలు, క్యాబ్ లు తమ ప్యాకేజీ టూర్ల లో ఈ ఆలయ సందర్శనం కూడా చేయిస్తారు. ఈ సారి తరుమల వెళ్లినప్పుడు తప్పకుండా మీరు కూడా అప్పలాయగుంట శ్రీ వేంకటేశ్వరాలయాన్ని దర్శించుకోండి...