శ్రీకపిలేశ్వరాలయంలో ఘనంగా కృత్తికా దీపోత్సవం



తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాయంలో శనివారం కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం కృత్తికా దీపోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని ఆలయ ప్రాంగణంలో దేదీప్యమానంగా ప్రమిదలు వెలిగించారు. దీపాల వెలుగులో ఆలయం శోభాయమానంగా వెలిగిపోయింది.

ఈ సందర్భంగా టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ మీడియాతో మాట్లాడుతూ కార్తీక మాసంలో శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తిక దీపోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి దీపాలు వెలిగించి స్వామివారి కృపకు పాత్రులయ్యారని చెప్పారు.

ముందుగా, సాయంత్రం 6 గంటలకు గర్భాలయంలో, ఆ తరువాత శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయ గోపురం, శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ గోపురం, ధ్వజస్తంభంపైన కొండపైన దీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఊంజల్‌ మండపంలో ఆకట్టుకునేలా శివలింగం, శూలం ఆకృతిలో ప్రమిదలు వెలిగించారు. పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు ఆలయ ప్రాంగణమంతా దీపాలు వెలిగించి భక్తిప్రపత్తులను చాటుకున్నారు. అనంతరం రాత్రి 7.00 గంటలకు జ్వోలాతోరణం వెలిగించారు.