రెండు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా ప్రారంభమైన ‘మనగుడి’


హైందవ సనాతన ధర్మానికి ప్రతీకలుగా అలరారుతున్న దేవాలయాల వైశిష్ట్యాన్ని నేటి తరానికి అందించడమే ధ్యేయంగా టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో శుక్రవారం మనగుడి కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.

డిసెంబరు 1 నుండి 3వ తేదీ వరకు 11వ విడత మనగుడి కార్యక్రమాన్ని రెండు తెలుగురాష్ట్రాలలో ఎంపిక చేయబడిన 294 ఆలయాలలో నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం ఆయా గ్రామాల ప్రజలు ఆలయాలను శుభ్రపరచి, రంగులు వేశారు. డిసెంబరు 2న నగర సంకీర్తన, కృత్తిక దీపోత్సవం, డిసెంబరు 3న దత్తజయంతి సందర్భంగా గురుపూజ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తులకు గోవిందరక్ష కంకణాలు, ప్రసాదాలు పంపిణీ చేయనున్నారు.

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శేషాపురం గ్రామంలోని పురాతనమైన శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారి ఆలయాన్ని త్వరలో టిటిడిలోకి విలీనం చేసుకోనున్నట్లు టిటిడి తిరుపతి జెఈవో శ్రీపోల భాస్కర్‌ తెలిపారు. శుక్రవారం ఆయన అధికారులతో కలిసి ఆలయాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు మరియు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారి ఆలయాన్ని టిటిడిలోకి విలీనం చేసుకోనున్నట్లు వెల్లడించారు. ధర్మప్రచారంలో భాగంగా పురాతన ఆలయాలను పునరుద్ధరించి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగానే ఆలయ అభివృద్ధికి రోడ్లు, ఇంజినీరింగ్‌, ఇతర మౌలిక వసతులను పరిశీలించినట్లు తెలిపారు. టిటిడి ప్రమాణాల మేరకు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకునేందుకు వీలుగా వసతులు కల్పిస్తామని జెఈవో తెలియజేశారు.