తెలుగువారి పెద్దపండుగయిన సంక్రాంతి సంబరాలు భోగితో ప్రారంభం అవుతాయి. భోగి నాడు పిల్లలు, పెద్దలు తెల్లవారుఝామునే లేచి ఇళ్లముందు భోగిమంటలు వెలిగిస్తారు. అసలు ఈ భోగి మంటలు ఎందుకు వెలిగిస్తారు. వీటి పరమార్థం ఏమిటో తెలుసుకోండి.
సంక్రమణ మహాపర్వానికి ముందు రోజుకి ఒక ప్రాధాన్యం ఉంది. దీనికి భోగిపర్వం అని పేరు. భగ అనే పదం నుంచి భోగి వచ్చిందంటారు పెద్దలు. అయితే భోగము అనే మాటకు అర్థం ఏమిటంటే అనుభవము అని. ఆనందంగా దేనిని అనుభవిస్తామో లేదా దేనిని అనుభవించడం వల్ల ఆనందం పొండుతామో దానిని భోగము అనాలి. అలాంటి భోగములు అనుభవించవలసిన రోజుని భోగి అంటారు. దక్షిణాయనానికి చివరి రోజు భోగి. అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖసంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే భోగి అని చెబుతారు. నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆనందం. సామాన్యుల ఆనందాలు వేరు. వాళ్ళకి లౌకిక విషయాలు దొరికితే అది భోగం. ఆ విషయంతో విసుగు కలిగితే మరో విషయం లభించాలని. కానీ ఏది లభిస్తే మరి ఇంకేదీ కావాలని అనిపించదో, ఏది పరిపూర్ణమైన ఆనందమో అదే నిజమైన భోగం. అలాంటి భోగం యోగం వల్లనే లభ్యం అవుతుంది. అందుకే యోగులే భోగులు కాగలరు.
విష్ణువుకు ఇష్టమైన రోజు భోగి
ధనుర్మాసం ఆఖరి రోజు వచ్చే భోగి అంటే శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టం. నెలరోజుల పాటూ గోదాదేవి చేసిన ధనుర్మాస వ్రతాన్ని మెచ్చి స్వయంగా రంగనాథుడే దివినుంచి భువికి దిగివచ్చిన రోజు. అందుకే భోగి రోజు పొద్దున్నే ఆవుపేడతో లోగిళ్లలో కళ్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు, అందులో గొబ్బెమ్మలతో అలంకరిస్తారు.
భోగి మంటలు
భోగిరోజు ప్రధానమైనవి భోగిమంటలు. ఆవు పేడతో చేసిన పిడకలు, కర్రలు, ఇంట్లో పాత వస్తువులు అన్నింటినీ అగ్నికి ఆహుతి చేస్తారు. అంటే మనలో చెడును తగలబెట్టి మంచిని పెంచుకోవడమే ఈ భోగిమంటల వెనుకున్న ఆంతర్యం. సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి. ఈ రోజు చలి తారాస్థాయిలో ఉంటుంది కాబట్టి భోగిమంటలు వేసుకోమంటారు. భోగినాటికి ఉధృతంగా ఉండే చలి వల్ల క్రిమికీటకాలు ప్రబలే అవకాశం ఉంది, భోగిమంటలు వాతావరణంలోకి కాస్త వెచ్చదనాన్ని నింపుతాయి. పైగా సంక్రాంతినాటికి పంట కోతలు పూర్తవడంతో, పొలాల నుంచి వచ్చే పురుగులు కూడా ఇళ్లలో చేరకుండా తిప్పికొట్టేందుకు భోగిమంటలు ఉపయోగపడతాయంటారు.