భగవద్గీతతో సమాజానికి ఆధ్యాత్మిక మార్గనిర్దేశనం: శ్రీశ్రీశ్రీ స్వస్వరూపానందస్వామిజీ


ఆధ్యాత్మిక మార్గనిర్దేశనం ద్వారా సమాజాన్ని సన్మార్గంలో నడిపే శక్తి భగవద్గీతకు ఉందని శ్రీనివాసమంగాపురంలోని వశిష్టాశ్రమానికి చెందిన శ్రీశ్రీశ్రీ స్వస్వరూపానందస్వామిజీ ఉద్ఘాటించారు. టిటిడి హిందూధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో వార్షిక గీతాజయంతి ఉత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి.


ఈ సందర్భంగా సాయంత్రం జరిగిన కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ స్వస్వరూపానందస్వామిజీ ఉపన్యసిస్తూ భగవంతుని ప్రాప్తి పొందడానికి శరణాగతి ఒక్కటే మార్గమన్నారు. భగవద్గీత ఒక మతానికి సంబంధించినది కాదని, మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు సమాజంలో ఆధ్యాత్మిక కోణంలో ఎలా జీవించాలో తెలియజేస్తుందని అన్నారు. భారతదేశంలో ఉద్భవించిన ఈ గ్రంథాన్ని విదేశీయులు సైతం తమ భాషల్లోకి అనువదించుకుని ఫలితాన్ని అనుభవిస్తున్నారని తెలిపారు.



గీతాసారాన్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు టిటిడి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ముఖ్యంగా యువతకు గీతాసారం అందాల్సి ఉందని, ఇలాంటి కార్యక్రమాల ద్వారానే అది సాధ్యమవుతుందని తెలిపారు. అనంతరం టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుడు శ్రీ ఉదయభాస్కర్‌రెడ్డి బృందం అన్నమయ్య సంకీర్తనలను చక్కగా ఆలపించారు. వయోలిన్‌పై శ్రీ ఠాగూర్‌నాథ్‌రెడ్డి, మృదంగంపై శ్రీ పాండురంగారావు వాయిద్య సహకారం అందించారు.


ముందుగా ఉదయం 9 నుంచి 10 గంటల వరకు 20 మంది భక్తులు గీతాపారాయణం చేశారు. ఆ తరువాత 6 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు భగవద్గీతపై కంఠస్తం పోటీలు నిర్వహించారు.