శ్రీవారి భక్తితత్వాన్ని వ్యాప్తి చేసిన ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను విస్త తంగా ప్రచారం చేసేందుకు నవంబరు 4వ తేదీన తిరుమలలో పౌర్ణమి గరుడసేవ సందర్భంగా దివ్యప్రబంధ మహోత్సవాన్ని టిటిడి ఘనంగా నిర్వహించనుంది. ధర్మప్రచారంలో భాగంగా పౌర్ణమి గరుడసేవ సందర్భంగా ఇప్పటివరకు వేద మహోత్సవం, భజనమేళా లాంటి కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహించిన విషయం విదితమే.
ఈ కార్యక్రమంలో భాగంగా ద్రావిడ వేద నాలాయిర దివ్యప్రబంధ పారాయణ పథకంలోని దాదాపు 200 మంది పారాయణదారులు స్వామివారి వాహనం ఎదుట పాశురాలను పారాయణం చేస్తారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రతోపాటు దేశం నలుమూలల నుంచి పారాయణదారులు విచ్చేయనున్నారు.
ముందుగా ఉదయం 10 గంటలకు తిరుమలలోని ఆస్థానమండపంలో నాలాయిర దివ్యప్రబంధ పారాయణదారులతో సమావేశం నిర్వహిస్తారు. టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి విచ్చేసి తమ సందేశాలిస్తారు. అనంతరం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో జరుగనున్న శ్రీవారి పౌర్ణమి గరుడసేవలో దివ్యప్రబంధ పండితులు నాలాయిర దివ్యప్రబంధ పారాయణం చేస్తారు. టిటిడి నాళాయిర దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా|| వి.జి.చొక్కలింగం ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.