తిరుమల శ్రీవారికి అభిషేక సేవను ప్ర్రవేశపెట్టిన శ్రీ తిరుమలనంబి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు



కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారికి అభిషేక సేవను ప్రవేశ పెట్టిన ఘనత శ్రీతిరుమలనంబికి దక్కిందని తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌ శ్రీనివాసరాజు అన్నారు.

తిరుమల జెఈవో, సివిఎస్వో శ్రీ ఆకె రవికృష్ణతో కలిసి శ్రీవారి ఆలయ దక్షిణ మాడ వీధిలో గల శ్రీతిరుమలనంబి 1044వ అవతారోత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమలనంబి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ శ్రీవారి కైంకర్యాలు చేసేందుకు శ్రీ తిరుమలనంబి 973వ సంవత్సరంలో తిరుమలకు చేరుకున్నారని తెలిపారు. ఆయన తన తాతగారు అయిన యమునాచార్యుల ఆజ్ఞతో తిరుమలకు వచ్చి పాపవినాశనం తీర్థం నుండి ప్రతిరోజూ జలాన్ని తీసుకొస్తున్నపుడు శ్రీవారిని అభిషేకించేవారన్నారు. వృద్ధాప్యంలో కూడా పాపనాశనం తీర్థం తీసుకువచ్చినప్పుడు స్వామివారు జాలిపడి అంజనాద్రిలో ఉద్భవింపచేసిన ఆకాశగంగ తీర్థంతో అభిషేకం చేయవలసిందిగా ఆజ్ఞాపించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు.

తిరుమలనంబి స్వామివారికి పుష్పకైంకర్యం, మంత్రపుష్పకైంకర్యం ఇతర కైంకర్యాలను చేస్తూ తిరుమలలో ఉంటూ అపరభక్తుడిగా నిలిచాడని, శ్రీమద్‌ రామానుజాచార్యులకు రామాయణంలోని 18 రహస్యార్థాలను చెప్పి, విశిష్టాద్వైత మతానికి పునాది వేశారని తెలియజేశారు. శ్రీవారి వైభవాన్ని నలుదిశలా చాటడానికి కృషి చేసిన పరమ భక్తుల జన్మదినాల సందర్భంగా ప్రతి సంవత్సరం వారి పేరుపై ఉన్న ఉప ఆలయాల్లో వార్షికోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ తిరుమలనంబి వంశీకులు శ్రీ తాతాచార్య కృష్ణమూర్తి, శ్రీసి.రంగనాథన్‌, ఆళ్వార్‌ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ చొక్కలింగం, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటి అధ్యాపకులు ప్రొ|| కన్నన్‌, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.