గరుడ సేవనాడు తిరుపతిలో 2500 వాహనాలకు పార్కింగ్‌ ఏర్పాట్లు : టిటిడి జెఈవో శ్రీ పోల భాస్కర్‌


శ్రీవారి బ్రహ్మూెత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 27న నిర్వహించే గరుడసేవకు వాహనాల్లో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని భారతీయ విద్యాభవన్‌ పాఠశాల మైదానంతోపాటు దేవలోక్‌ ప్రాంగణంలో 2500 నాలుగు చక్రాల వాహనాలు నిలిపి ఉంచేలా పార్కింగ్‌ ఏర్పాట్లు చేపడుతున్నామని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ తెలిపారు. సివిఎస్‌వో శ్రీ ఎ.రవికృష్ణ, తిరుపతి అర్బన్‌్‌ ఎస్పీ శ్రీ అభిషేక్‌ మహంతితో కలసి సోమవారం తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఆర్‌టిసి, టిటిడి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ తిరుమలలో స్థలాభావం కారణంగా నాలుగు చక్రాల వాహనాలను తగ్గించాల్సిన నేపథ్యంలో తిరుపతిలోనే పార్కింగ్‌ ఏర్పాట్లు చేపడుతున్నామని, భక్తులు టిటిడికి సహకరించి పార్కింగ్‌ ప్రదేశాలను వినియోగించుకోవాలని కోరారు. తిరుమలలో వాహనాల ట్రాఫిక్‌ను తగ్గించి భక్తులు సౌకర్యవంతంగా రోడ్లపై నడిచేందుకు తిరుపతి నుంచి ఆర్‌టిసి బస్సుల్లోనే వెళ్లాలని పిలుపునిచ్చారు.

జూపార్క్‌ సమీపంలోని దేవలోక్‌ ప్రాంగణంలో 32 ఎకరాల్లో, భారతీయ విద్యాభవన్‌ పాఠశాల మైదానంలో వాహనాల పార్కింగ్‌ కోసం ఇంజినీరింగ్‌ పనులు జరుగుతున్నాయన్నారు. ఈ పార్కింగ్‌ ప్రదేశాల నుంచి అలిపిరి వరకు భక్తులను ఉచితంగా బస్సుల్లో చేరవేస్తామని, అక్కడినుంచి ఆర్‌టిసి బస్సుల్లో తిరుమలకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. పార్కింగ్‌ ప్రదేశాల వద్ద పారిశుద్ధ్య ఏర్పాట్లు, అన్నప్రసాదాలు, తాగునీరు, వైద్యసౌకర్యం, సూచికబోర్డులు, లైటింగ్‌, సమాచార కేంద్రాలు తదితర వసతులు కల్పిస్తామన్నారు.

సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ గరుడసేవ నాడు తిరుమలకు పరిమితికి మించి నాలుగు చక్రాల వాహనాలు వెళ్లకుండా తిరుపతిలోనే తగిన పార్కింగ్‌ ఏర్పాట్లు చేపడుతున్నట్టు తెలిపారు. భక్తులు ఆర్‌టిసి బస్సుల్లోనే తిరుమల-తిరుపతి మధ్య రాకపోకలు సాగించి ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు సహకరించాలని కోరారు.