పంచారామ క్షేత్రాలు - పాలకొల్లు శ్రీ క్షీరారామ లింగేశ్వర ఆలయం

 
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి 8 కిలోమీటర్ల దూరంలో పాలకొల్లు అనే గ్రామంలో శ్రీ రామచంద్రమూర్తి, సీతా అమ్మవార్ల స్వహస్తాలతో ప్రతిష్టితమైన ప్రసిద్ధ క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. పంచారామ క్షేత్రాలలో ఈ పాలకొల్లు ఒకటి. స్థలపురాణం ప్రకారం ఒకప్పుడు శివుడు ఇక్కడ బాణం వేస్తే భూమిలోనుంచి పాలు ఉబికి వచ్చాయని పెద్దల మాట. అందువల్ల పాలకొల్లు గా పిలిచారు. పాలకొల్లును పూర్వం క్షీరపురి, పాలకొలనుగా పిలిచేవారు. క్రీ.శ. 918లో మొదటి చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ గాలిగోపురం.  ఈ గోపురం ఆకాశాన్నంటేలా 125 అడుగుల ఎత్తులో 9 అంతస్థులుగా ఉంది. పై అంతస్థు వరకూ మెట్లు కూడా ఉన్నాయి. ఆలయానికి కొంతదూరంలో ఒక చెరువు ఉంది. దాన్ని రామగుండం అని పిలుస్తారు. స్వామివారికి చేసే అభిషేక క్షీరంతో ఆ చెరువు నిండిపోయి ఉంటుంది కనుక అది పాలకొలను పేరుతో పిలువబడుతూ ఆ ప్రాంతం పాలకొల్లుగా మారింది.

స్వామివారి పేరు క్షీర రామలింగేశ్వరుడు. తెల్లగా పాలవలే మెరిసే రెండున్నర అడుగుల ఎత్తున ఉన్న శివలింగం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ అమృతలింగాన్ని బ్రహ్మాదిదేవతలు వెంటరాగా శ్రీ మహావిష్ణువు ఇక్కడ ప్రతిష్టించి శివుని కోరికపై క్షేత్రపాలకునిగా, లక్ష్మీ జనార్దన స్వామి పేరుతో ఇక్కడ కొలువయ్యాడు.

స్థలపురాణం

పూర్వం ఉపమన్యుడు అనే బాలభక్తుడు పాలకై పరమేశ్వరుని ప్రార్ధించగా ఆయన కరుణించి తన త్రిశూలాన్ని భూమిపై దించగా భూగర్భం నుంచి క్షీరము ఉద్భవించింది. అందుకే ఈ ప్రాంతం క్షీరపురం, పాలకొల్లుగా ప్రసిద్ధమైంది. శ్రీరాముడు బ్రహ్మహత్య దోష నివారణకై రామలింగేశ్వరలింగంతోపాటు కాశీ నుంచి తెచ్చిన శివలింగాన్ని కాశీవిశ్వేశ్వరునిగా ఇక్కడ ప్రతిష్టించారని స్థలపురాణం. ప్రాకార మండపంలో కుడివైపున త్రిపురసుందరీ దేవి కొలువై

ఉంటుంది. శ్రీ ఆదిశంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్రం ప్రతిష్టించారు. విఘ్నేశ్వర, గోకర్ణేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర ఉపాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. పశ్చిమంలో ఋణహర గణపతి కొలువై ఉన్నాడు. ఋణగ్రస్థులైనవారు ఈ గణపతిని పూజిస్తే ఋణవిముక్తులవుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ క్షీర రామలింగేశ్వర దర్శనంతో బ్రహ్మహత్యా పాతకాలు నశిస్తాయని భక్తుల నమ్మకం.