గంగా పుష్కరాలు బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు మొదలవుతాయి. బృహస్పతి పన్నెండో రాశి అయిన మీనంలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం పూర్తి అవుతుంది. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. అయితే పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు గంగా నదికి పుష్కరుడు సకలదేవతలతో కలిసి వచ్చి ఉంటాడని ఈ పన్నెండు రోజులలో గంగా నదిలో స్నానం చేయటం వలన సకల తీర్థాలలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని గంగా నదిలో అనేక మంది భక్తులు స్నానాలు చేస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 22 వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకూ గంగానదికి పుష్కరాలు జరుగనున్నాయి.
గంగ నామస్మరణం సర్వపాప హరణం
భారతదేశంలోని నదులలో గంగానది అతి ముఖ్యమైనది, అత్యంత పవిత్రమైనది. హిందువులందరికీ పరమ పూజనీయమైనది ఈ గంగానది. గంగానది స్మరణం వలనే సమస్త పాపాలు శమిస్తాయని, సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. రాక్షసాధిపతి బలిచక్రవర్తి యాగము చేసే సమయములో శ్రీ మహావిష్ణువు వటు(వామన) రూపములో వస్తాడు. మహాదాత అయిన బలిచక్రవర్తిని వటుడు మూడు అడుగుల నేలను దానము చేయమని అడుగగా దానిని సమ్మతించిన బలిచక్రవర్తి మూడడుగుల నేలను దానము చేసేను. అంతట వామనుడు ముందడుగుతో భూలోకమును, రెండవ అడుగుతో ఆకాశమును ఆక్రమించెను. (అప్పటినుండీ ఆకాశమునకు ‘‘విష్ణుపదీ’’ అనే పేరు వచ్చింది. వామనుడు మూడవ అడుగును బలి తలపై నిలిపి అతనిని పాతాళమునకు అణచివేసేను. వామనమూర్తి రెండవ అడుగు ఆకాశమంతయు ఆక్రమించగానే పరమేష్ఠి ఆపాదపద్మమునకు నమస్కరించాడు.
బ్రహ్మ తన కమండలములో గల జలముతో ఉరుక్రముడగు వామనుని పాదమును కడిగెను. ఆ జలమే మరింత పవిత్రమై ఆకాశగంగా రూపమున పరిణితి చెందెను. విష్ణుపాదోద్భవి అయిన, ఈ నది ఆకాశము నుండి ప్రవహించి శ్రీహరి కీర్తి వలె ముల్లోకములను పవిత్రమొనరించెను. అని భాగవతం ఎనిమిదవ స్కందములో గంగోత్పత్తి గురించి తెలుపబడింది.
వామనావతార సమయములో శ్రీహరి రెండవ అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించినపుడు ఆయన పాదంగుళి తాకిడికి బ్రహ్మాండమునకు రంధ్రమై దానినుండి బైటికి వచ్చిన జలధార విష్ణుపాదముపై పడి సురనదిగా (గంగగా) మారిందని వామన పురాణం చెబుతోంది.
గంగానది శ్రీకృష్ణుని యొక్క దేహం నుండి పుట్టినదని బ్రహ్మవైవర్త పురాణంలోను, నారద పురాణంలోను, భాగవతం ఐదవ స్కందంలోను చెప్పబడింది. గోలోకంలో రాధాదేవి కార్తీకపౌర్ణమినాడు ఒక ఉత్సవం జరిపినది. ఆ ఉత్సవానికి బ్రహ్మాది దేవతలందరూ విచ్చేసారు. బ్రహ్మ ప్రేరేపితుడైన శంకరుడు శ్రీకృష్ణుని గురించి గానము చేయగా ఆ గానానికి ముగ్ధుడైన శ్రీకృష్ణుడు ద్రవీభూతుడవుతాడు. ఆ ద్రవమే గంగానదిగా మారినది. ఆ గంగను బ్రహ్మ తన కమండలంలో పట్టి తన లోకానికి, శంకరుడు ఆమెను శిరస్సున ధరించి కైలాసానికి తీసుకువెళ్ళారని పురాణాల ద్వారా తెలుస్తున్న విషయం.
ఆకాశ సముద్రమని ప్రసిద్ధికెక్కిన సోమమను పేరుగల సముద్రము నుండి ఆకాశమున ప్రవహించు నది ఒకటి బయలుదేరినది. అది మేరు శిఖరము పైబడి సీత, అలకనంద, చక్షు, భద్ర అనుపేర్ల నాలుగు పాయలుగా చీలినది. ఆయా స్థలములలో ప్రవహించి కొన్ని వందల పర్వతములను చీల్చుకుని భూమికి చేరుటచేత దానికి గంగ అనుపేరు వచ్చినదని వరాహపురాణం 82వ అధ్యాయములో వివరింపబడింది.
జగద్యోనియగు నారాయణుని ఏధ్రువాధారమని పేరుగల పదము ఉన్నదో దానినుండియే త్రిపథగామియగు గంగాదేవి ఉత్పన్నమైనది అని మార్కండేయ పురాణం 53వ అధ్యాయం ద్వారా తెలుస్తోంది. ఆకాశమందు గల సముద్రము పేరు సోమార్ణవము. అది దేవతలకు అమృత జలమును ప్రసాదించుచున్నది. దానినుండి గంగానది పుట్టినదని లింగపురాణంలో చెప్పబడింది. బ్రహ్మాండపురాణ కథనం ప్రకారం అగస్త్యుడు సముద్రజలం మొత్తం త్రాగగా ఆ సముద్రములు మళ్ళీ గంగానదీ జలంతో నిండాయి. రామాయణంలో గంగను హిమవంతుని పెద్దకూతురుగా వర్ణించారు.
గంగాదేవి తొలిజన్మలో కర్దమ పుత్రికయైన కళకు మరీచునకు పుట్టిన కుమార్తె. అపుడామె పేరు పూర్ణిమ. ఆమెయే మరుసటి జన్మలో శ్రీహరి పాదముల నుండి గంగ అను పేరుతో పుట్టినది. పూర్ణిమకు విరజుడు, విశ్వగుడు అనే ఇరువురు కుమారులు, దేవకుల్య అనే పుత్రిక కలరని భాగవతం నాలుగవ స్కందం 13, 14 శ్లోకాలలో పేర్కొనబడింది.
గంగకు కల వివిధ నామములు
భాగీరథీ
సూర్యవంశమున సగరుడు అను రాజు కలడు. అతనికి అరవైవేల మంది కుమారులు. వీరు కపిలమహర్షి ఆగ్రహమునకు గురై భస్మమైపోయారు. సగరుని ముని మనుమడు భగీరథుడు. ఈయన పితృదేవతలకు సద్గతులు కల్పించడానికి బ్రహ్మను గూర్చి తపస్సు చేసాడు. ఆ తపస్సుకు సంతుష్టుడైన బ్రహ్మ ప్రత్యక్షమై ఏ వరము కావాలో కోరుకొనుము అని అనెను. అంతట భగీరథుడు బ్రహ్మదేవా మా పితృదేవతలందరికీ సద్గతులు కలుగవలెనన్న ఆ మహాత్ముల భస్మరాశి గంగా జలముతో తడువవలెను. కావున గంగను నాకు అనుగ్రహింపము అని కోరెను. దానిని బ్రహ్మదేవుడు అట్లే అగుగాక అని ఆకాశమునుండి పడుతున్న గంగా ప్రవాహమును భూమి భరించలేదు కనుక నీవు శివుని ఆశ్రయించుము, అని పలికి అంతర్ధానమయ్యెను.
అనంతరం భగీరథుడు శివునికై తపస్సు చేసి అతని మెప్పించి శివుని శిరమున ఉన్న గంగను తన వెంట తీసుకుని వెళ్ళి తన పితృదేవతల భస్మరాశి మీద ప్రవహింపచేసి వారికి సద్గతులను కల్పించెను. ఈ విధముగా ఆకాశములో ఉన్న గంగ భగీరథునిచే భూమికి తీసుకురాబడినది. కనుక గంగకు భాగీరథీ అనే పేరు ఏర్పడింది.
జాహ్నవి
గంగను భరీరథుడు తన వెంట తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో ఉన్న జహ్నుమహర్షి ఆశ్రమాన్ని గంగ ముంచెత్తింది. దానికి కోధిల్లిన మహర్షి గంగను మింగాడు. అది చూసిన భగీరథుడు పితృదేవతలకు ఉత్తమ లోకాలను కలిగించుటకు శివుని మెప్పించి ఆయన జటాజూటములో ఉన్న గంగను తీసుకువెళుతున్నట్లు చెప్పి గంగను విడవమని ప్రార్థించాడు. దానికి శాంతించిన జహ్ను మహర్షి గంగను తన కుడిచెవి నుండి వదిలాడు. ఈ విధంగా జహ్నుని నుండి కన్యారూపముగా వచ్చినందువల్ల గంగ జాహ్నవిగా పిలువబడుతోంది.
భీష్మసు
మహారాజు ప్రదీపుని కుమారుడు శంతనుడు. పూర్వ జన్మలో ఇతడు బ్రహ్మచే శపించబడిన మహాభిషుడను రాజర్షి. శంతనుడు ఒకనాడు వనములో సంచరిస్తూ దప్పికతో నదీ సమీపమునకు వెళ్ళాడు. అక్కడ సుందర శరీరంతో విహరిస్తున్న గంగాదేవిని చూసి ఆమెపై మోహము కలిగి ఆమెను పరిణయమాడుటకు నిర్ణయించుకున్నాడు. అతని అభిలాష తెలుసుకున్న గంగ ఓ రాజా! నేను నిన్ను వివాహం చేసుకుంటాను కాని నేను ఏమి చేసినా నీవు కారణం అడగకూడదు, ఏమీ అనకూడదు, ఒకవేళ నీవు నన్ను ఏమైనా అనిన ఎడల నేను నీ వద్ద నుండి వెళ్ళిపోతాను. అని షరతు విధించింది. దానికి అంగీకరించిన శంతనుడు గంగను గాంధర్వ విధిలో పెళ్ళాడాడు. కొంత కాలానికి గంగ ఒక మగశిశువును ప్రసవించింది. గంగ పూర్వం అష్టవసువులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రసవించిన శిశువులను ఒక్కొక్కరిగా నదిలో పడవేసేది. అది చూసిన శంతనుడు తీవ్రంగా చింతించాడు.
గంగ అష్టమ సంతతిని కూడా పై విధంగా చేయడానికి నిశ్చయించింది. శంతనుడు వారించాడు. తనను వారించిన శంతనునిపై క్రోధిల్లి గంగ ఆ పుత్రుని శంతనుని వద్ద విడిచి వెళ్ళిపోయింది. ఆ పుత్రుడే శంతనుని కోరిక తీర్చడానికి ఆజన్మ బ్రహ్మచర్య వ్రతమునుపూనిన భీష్ముడు. వసువైన భీష్ముని కనుటచే గంగకు భీష్మసూ అనే నామం ఏర్పడింది. వశిష్ఠ మహర్షి శాపంకారణంగా అష్టవసువులు మానవరూపములో గంగకు పుత్రులుగా పుట్టి వెంటనే శాప విముక్తిని పొందారు. విష్ణుపాదము నుండి ఉద్భవించుటచే గంగ విష్ణుపది అనే నామమును ధరించినది. గంగానది స్వర్గలోకము నుండి భూలోకానికి, భూలోకము నుండి పాతాళ లోకమునకు చేరుటచే త్రిపథగ అని పిలువబడుతోంది. దేవలోకము నుండి హిమవత్పర్వతము పై పడి, భూమిని చేరే గంగా ప్రవాహము అలకనంద అనే పేరుతో కీర్తించబడుతోంది.
ఇంకా నంది,నళిని, దక్షపుత్రి, విహగ, విశ్వకాయ, అమృత, శివ, విద్యాధరి, సుప్రశాన్త, విశ్వప్రసాదిని, క్షేమ, జాహ్నవి, శాన్త, శాన్తి ప్రదాయిని అనే పేర్లు కూడా గంగకు ఉన్నట్టు మత్స్యపురాణము ద్వారా తెలుస్తోంది.
గౌరీకుండ్
స్కందపురాణాన్ని బట్టి గౌరవర్ణంలో ప్రకాశిస్తున్న హిరణ్యశృంగ పర్వతమే గౌరీపర్వతము అని తెలుస్తోంది. గౌరీదేవి నివాసమున్న పర్వతం కిందనే ఈ సరస్సు ఉండటం వలన ఇది గౌరీకుండంగా ప్రసిద్ధమైంది. దీనినే మత్స్యపురాణంలో బిందుసరస్సుగా అభివర్ణించారు. అంతేకాక భగీరథుడు తపస్సు చేసిన స్థలం కూడా ఇదేనని తెలుస్తోంది. గంగావతరణ సమయంలో శివుని శిరస్సు మీదకు దూకే సమయంలో చిందిన బిందువులే బిందు సరస్సుగా అయిందని మత్స్యపురాణం తెలుపుతోంది.