తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం రుక్మిణీకృష్ణులు తెప్పపై భక్తులకు అభయమిచ్చారు. విద్యుద్దీపాలు, పుష్పాలతో శోభాయమానంగా తెప్పను అలంకరించారు.
ముందుగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి సమేత శ్రీకృష్ణుల ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. రుక్మిణీకృష్ణులు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి కనువిందు చేశారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.
తెప్పపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి కటాక్షం
తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు తెప్పలపై భక్తులను కటాక్షించారు.
ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగింపు నిర్వహించి పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. రాత్రి 7 గంటల నుండి విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామి, అమ్మవార్లు ఆశీనులై పుష్కరిణిలో మూడు చుట్లు విహరించారు.
కాగా, శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు నాలుగో రోజు ఐదుచుట్లు, చివరి రోజు ఏడుచుట్లు పుష్కరిణిలో తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి పాల్గొన్నారు.