వరలక్ష్మీ దేవి పూజలో బంగారం ఎందుకు పెట్టాలి || Why to keep gold in Varal...


లోకంలో సిరి సంపదలకు మూలం శ్రీమహాలక్ష్మి, ఆమె కరుణా కటాక్షాలు లేకుంటే మనం సుఖ సంతోషాలతో ఉండలేం. అందుకే అడిగిన వెంటనే వరాలిచ్చే అమ్మగా విరాజిల్లే వరలక్ష్మీ దేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మన ఇంట సిరిసంపదలకు లోటుండదని మనందరి నమ్మకం. అయితే వరలక్ష్మి వ్రతం నాడు అమ్మవారి పూజ వద్ద ఖచ్చితంగా బంగారం ఉంచాలనే నియమం అనాది కాలం నుండి వస్తోంది. స్తోమత కలిగిన వారు ఆభరణాల రూపంలో లేదంటే ఉన్నంతలో ఒక వరలక్ష్మి ప్రతిమ కలిగిన బంగారు నాణెం (దీనినే మనం రూపు అని పిలుస్తాం) పూజలో పెట్టడం ఆయవాయతీగా వస్తోంది. అసలు వరలక్ష్మిదేవికి పూజలో బంగారం ఎందుకు పెట్టాలి అనే భక్తితో కూడిన సందేహం మనందరికీ కలగక మానదు. మరి ఎందుకు పెట్టాలో తెలుసుకుందామా...

బంగారం అంటేనే లక్ష్మీదేవి. ఇంట్లో బంగారం ఉందంటే... లక్ష్మి కొలువై ఉందని భావిస్తారు. డబ్బును కూడా మనందరం లక్ష్మిగానే భావిస్తాం... కానీ బంగారాన్ని మాత్రం హిందువులు లక్ష్మీదేవి ప్రతిరూపంగా తలుస్తారు. బంగారం ఎంత ఎక్కువగా ధరిస్తే వారికి లక్ష్మి కటాక్షం అంతగా ఉందని ఎదుటివారు భావిస్తారు. నిండుగా బంగారు నగలతో అలంకరించుకుని ఇంటికి వచ్చే కొత్త కోడళ్లను, లేదంటే వేడుకల్లో బంగారంతో కళగా కనిపించే కూతుళ్లను చూసి అచ్చం లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా అని పెద్దలు ఆశీర్వదిస్తారు. అందుకే బంగారం కొనుగోలు చేసే శక్తి కలగడాన్ని లక్ష్మీ కటాక్షంగా భావిస్తాం. ధనం ఉంటేనే కదా బంగారం వచ్చేది... అయితే ధనం బైటికి వెళ్లి పెతుంది... కానీ బంగానం ఇంట్లో స్థిరంగా ఉంటుంది... అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో నివాసం ఉంటుంని నమ్మకన్నమాట. అందుకే సిరి సంపదల కోసం చేసే వ్రతం కాబట్టి ఆరోజున బంగారాన్ని తమ శక్తిమేర కొనుగోలు చేస్తారు.

రెండో కారణం ఏంటంటే.. పూజలు వ్రతాల్లో బంగారు ఆభరణాలు ధరించి వేడుకగా కనిపించే అలవాటు దక్షణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుంది. శ్రావణమాసం పర్వదినాలతో పాటు దసరా దీపావళి వంటి పండుగల్లో ఈ ప్రాంతాల వారు ఎక్కవగా మహిళలు బంగారు ఆభరణాలు ధరించేందుకు మొగ్గు చూపుతారు. వీరంతా కొత్త వస్తువులు కొనేందుకు పర్వదినాల్లో ప్రాధాన్యత ఇస్తారు. అందులోనే లక్ష్మీదేవిని ఆరాధించే పండుగల్లో తాము దాచుకున్న డబ్బునంతా బంగారం కొనేందుకు వినియోగిస్తారు. అక్షయ తృతీయ తర్వాత దక్షణాది రాష్ట్రాల వాళ్లు వరలక్ష్మీ వ్రతం పురస్కరించుకుని ఎక్కువగా బంగారం కొంటారు. ఇదే సాంప్రదాయం కొన్ని పదుల సంవత్సరాలుగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అనవాయితీగా మారింది.

మూడవది ముఖ్యమైన కారణం ఏంటంటే.. వరలక్ష్మీ దేవి సిరి సంపదలను ప్రసాదిస్తుంది. ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. అందుకే వరలక్ష్మి వ్రతంరోజున లక్ష్మీదేవి వ్రతంలో ఎంత బంగారం పెడతామో అంతకు రెట్టింపు సిరిని ఆ మహాలక్ష్మి మనకు ప్రసాదిస్తుందని మనందరి నమ్మకం. అందుకే ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా స్థోమతకు తగినట్టుగా బంగారం కొని పూజలో పెడతారు. అంతేకాదు బంగారాన్ని లక్ష్మీదేవిగా కొలుస్తాం కాబట్టి కొత్త బంగారం రూపంలో లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చిందని భావిస్తాం. ఎంతో కొంత బంగారం కొనగలిగామంటే మన పరిస్థితులకు తగ్గట్టుగా మనలను శ్రీమహాలక్ష్మి కటాక్షించినట్టేగా మరి...

అయితే వరలక్ష్మీదేవి వ్రతంలో లేని డాంబికాలకు మాత్రం పోవద్దు. మీరు స్తోమత లేకున్నా అప్పుచేసి మరీ బంగారం కొని పూజలో పెడితే అర్థం ఉండదు. కలిగిన సిరితోనే మనం అమ్మవారిని పూజించాలి తప్ప లేని సిరిని మాత్రం ప్రదర్శించకండి. పురాణాల్లో ఏ పూజ లేదా ఏ వ్రతం సందర్భంలో కూడా ఇంత బంగారం పెట్టాలి, ఇంత ఖర్చుపెట్టి పూజలు చేయాలని అని లేదు. స్థోమతకు తగినట్టుగా అనే పెద్దలు కూడా చెబుతారు. శ్రీమహాలక్ష్మి మనం ఖర్చుపెట్టిన డబ్బు లేదా కొని పెట్టిన బంగారం చూసి కటాక్షిస్తుందంటే పొరబాటే... మీరు చేసిన పూజలోని చిత్తశుద్ధి, అంకిత భావం, భక్తితత్వమే అమ్మవారు పరిగణలోకి తీసుకుంటారు. మీకు కలిగిన దానిలో ఒక్క రూపాయి సమర్పించినా చాలు మాత మీకు సుఖశాంతులు కలుగచేస్తుంది. ఎందుకంటే ఇంట్లో సుఖశాంతులు ఉంటే మన ఇంట అష్టైశ్వర్యాలూ ఉన్నట్టే...