తిరుమలలో సెప్టెంబరు 23 నుంచి ప్రారంభంకానున్న శ్రీవారి బ్రహ్మూెత్సవాలకు అవసరమైన ఇంజినీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల ఈవో కార్యాలయంలో సోమవారం సీనియర్ అధికారులతో వారపు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గరుడసేవనాడు భక్తుల కోసం తిరుపతిలో గుర్తించిన పార్కింగ్ స్థలాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. భక్తులు సులువుగా పార్కింగ్ స్థలాలను గుర్తించేందుకు వీలుగా ఫ్లెక్సీలు, సూచికబోర్డులు ఏర్పాటుచేయాలని ఆదేశించారు.
అడ్వాన్స్ బుకింగ్‌లో గదులు పొందిన భక్తులు గడువుకు ముందే ఖాళీ చేసిన పక్షంలో రీఫండ్ చెల్లించేందుకు వీలుగా ఆధార్ నంబరును బ్యాంక్ అకౌంట్‌కు అనుసంధానం చేసుకునేలా వారికి టిటిడి సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. వందేళ్లు నిండిన పురాతన ఆలయాల జాబితాను రూపొందించి మరమ్మతులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
శ్రీవారి బ్రహ్మూెత్సవాలకు భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్(డిఎఫ్‌ఎండి), సిసి కెమెరాలను త్వరితగతిన సమకూర్చుకోవాలని సివిఎస్‌వోకు ఈవో సూచించారు. కాల్‌సెంటర్‌లో భక్తులు అడిగే సమాచారాన్ని వేగవంతంగా అందించేందుకు వీలుగా సిబ్బందితో కూడిన ప్రత్యేక కాల్‌సెంటర్ సెల్ ఏర్పాటుచేయాలని తిరుపతి జెఈవోను కోరారు. హర్యానా రాష్ట్రంలోని క్షురుక్షేత్ర, కన్యాకుమారిలో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయాల వద్ద అర్చకులు, సిబ్బందికి అవసరమైన నివాసగృహాలను త్వరగా పూర్తి చేయాలన్నారు.
Source