మీ ఇంట సౌభాగ్యం వెల్లి విరియాలంటే వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకోంది


కుటుంబ సౌభాగ్యం కోసం మహిళలు  ఎన్నో వ్రతాలు చేస్తుంటారు. వాటిలో వరలక్ష్మి వ్రతం ఒకటి. ఈ వ్రతాన్ని నిష్టగా ఆచరిస్తే మన ఇంట సిరి సంపదలు తులతూగుతాయి. అటువంటి ఈ వ్రతాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం...

వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించేందుకు అవసరమైన పూజా ద్రవ్యాలను ముందుగా సిద్ధం చేసుకోవాలి. వీటిని సమకూర్చుకునేందుకు మీరు వ్యయ ప్రయాసలకు ఓర్వనక్కరలేదు. మీ శక్తి మేర అరటిపళ్లు, రెండు కొబ్బరికాయలు, పువ్వులు, తమలపాకులు, పోక చెక్కలు, పసుపు, కుంకుమ, పంచామృతాలు, దీపారాధన సామాగ్రి, అక్షింతలు, ధూప, దీప, నైవేద్యాదులకు తగిన సామాగ్రితో పాటు పూజలో చతికి కట్టుకునేందుకుమూడు తోరాలు సిద్ధం చేసుకోండి.


తోరాలు ఇలా చేయండి:

తోరాలను మీరే స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఒక తెల్లధారం రీలు తీసుకుని, సుమారు 18 అంగుళాలు లేదా మీ చేతికి మూడు చుట్లు చుట్టుకునే అంతసైజులో తొమ్మిది పోచలు కలిపి దానికి పసుపు ముద్దగా చేసి రాయండి. తడి పసుపు రాయడం వల్ల దారాలు దగ్గరగా పేనవేసుకుంటాయి. ఈ దారంతో తొమ్మిడి ముళ్లు వేసి మాల కట్టండి. ఇలాంటివి మూడు తోరాలు చేసుకోవాలి. వీటిలో ఒకటి అమ్మవారికి, రెండవది పూజచేసుకునే వారికి, మరోకటి వాయినం ిచ్చే సమయంలో ముత్తయిదువకు ఇవ్వడానికి అన్నమాట. ఈ తోరాలను ఒక తమలపాకుపై ఉంచి అమ్మవారిపై ఉంచాలి.


అమ్మవారి పీఠం 

పూజావేదిక వద్ద శుభ్రపరచి ఒర పీఠం ఏర్పాటు చేయాలి. మీ ఇంట్లోని ఒక పీటను పీఠంగా తయారు చేయవచ్చు. ఆ పీఠానికి పసుపు రాశి, దానిపై వరిపిండితో అష్టదళ పద్మాల ముగ్గు పెట్టి, ఆ ముగ్గును పసుపు, కుంకుమ తో అలంకరించాలి. తర్వాత ఒక రాగి పళ్లెంలో బియ్యం పోసి దానిపై కొత్త వస్ర్తం పరచి దానిపై కలశాన్ని ప్రతిష్టించాలి. 

కలశాన్ని ప్రతిష్టించేందుకు ఒక రాగి చెంబుకు పసుపు రాసి, కుంకుమ బొట్లు మూడు వైపులా పెట్టి, దానిలో కొద్దిగా శుభ్రమైన నీటిని పోయాలి. దానిపై ఒక మామిడి కొమ్మను ఉంచి, దానిపై కొబ్బరికాయను పీచు పైకి కనిపించేలా ఉంచాలి. 

కొబ్బరి కాయపై కొత్త రవికల గుడ్డను శంఖాకారంలో మడతపెట్టి కాయపై అమర్చి. మనం ముందుగా సిద్ధం చేసుకున్న కొత్త వస్ర్తం పరిచిన రాగిపళ్లెం పై ఉంచాలి . ఇప్పడు మనం వరలక్ష్మి దేవిని ప్రతిష్టించామన్నమాట.  ఈ కలశాన్ని మన శక్తిమేర బంగారంతో,  లేదంటే వరలక్ష్మి రూపును పసుపు దారంతో కట్టి అలంకరించాలి.

పూజా విధానం

వ్రతం చేసే ముందు ఆచమనం చేసి, గణపతిని ధ్యానించి ఒక తమలపాకుపై పసుపు గణపతిని ప్రతిష్టించి, యధాశక్తి పూజ చేయాలి. గణపతి పూజ ముగిసిన తర్వాత వరలక్ష్మీ నోము ప్రారంభించాలి. పునరాచమనం చేసుకుని ఆచమనం చేశాక కలశ పూజతో వ్రతం ఆరంభమవుతుంది. 

అమ్మవారి కలశంపై పసుపు, కుంకుమ, పూలు ఉంచి ఆవాహనం చేయాలి. ఆ తర్వాత ఒక పద్ధతి ప్రకారం మహాలక్ష్మికి ధ్యానం, అర్ఘ్యం, పాద్యం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, వస్త్రం, ఉపవీతం, గంధం, అక్షతలు, పుష్పం, అధాంగ పూజ, అష్టోత్తర శతనామ పూజ చేయాలి.  అనంతరం ధూపం, దీపం, నైవేద్యం, నమస్కారం, పానీయం, తాంబూలం, కర్పూర నీరాజనం, మంత్రపుష్పం, ప్రదక్షిణ, తోరపూజ, అమ్మవారికి వాయనం ఇవ్వడం వంటివి పూర్తి చేయాలి.  

నేవైద్యం

వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి మూడు లేదా ఐదు లేదా తొమ్మిది లేదా 11 రకాల పదార్ధాలను నైవేద్యంగా సమర్పించాలి. వీటిలో ప్రధానంగా చనివిడి, వడపప్పు, పానకంతో పాటు, పులగం, పరమాన్నం, పూర్ణం బూరెలు, పులిహోర, ఉండ్రాళ్లు ఉండాలి. మిగిలినవి మీకు నచ్చినవి, దేవునికి నైవేద్యం పెట్టడానికి అర్హమైనవి ఉండవచ్చు.

తోరధారణ

పూజలో ధూప, దీప, నైవేద్యాలు సమర్పించిన తర్వాత తోరపూజ చేయాలి, అనంతరం ఒక తోరాన్ని అమ్మవారికి సమర్పించి, మరొక దానిని పూజ చేసేవారు కుడిచేతికి ధరించాలి. అదే చేత్తో అక్షింతలు పట్టుకుని శ్రీ వరలక్ష్మి వ్రత కధ శ్రద్ధగా చదివి అర్ధం చేసుకోవాలి.

ముత్తయిదువకు వాయనం

పూజ అనంతరం ఒక ముత్తయిదువను ఇంటికి పిలిచి వాయనం ఇచ్చి,  మూడవ తోరాన్ని ముత్తయిదువను అమ్మవారిగా భావిస్తూ ధరింపచేయాలి. ఈ సందర్భంగా ముత్తయిదువలను ‘ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం’ అని పరస్పరం అనుకోవాలి. 

వాయనంలో నానబెట్టిన శనగలు, మూడు తమలపాకులు, రెండు అరటిపళ్లు, రెండు పోకచెక్కలు, రవికెల గుడ్డ, పువ్వులు, పసుపు, కుంకుమ, కొంత దక్షణ వాయనంలో ఉంచాలి. ముందుగా ముత్తయిదువను ఒక పీటపై కూర్చుండబెట్టి, కాళ్లకు పసుపు రాసి, కుంకుమ గంధం అలంకరించి, అక్షంతలు చేతికి ఇచ్చి, శ్రీ మహాలక్ష్మి మీ యింటికి వచ్చి వాయనం తీసుకుంటున్నట్టుగా భావిస్తూ వాయనం అందచేసి ఆవీర్వచనం పొందాలలి. 

పూజ పూర్తయిన తర్వాత ఇంటి పెద్దల ఆవీర్వాదం, ముఖ్యంగా భర్త ఆశీర్వాదం తీసుకోవాలి.