వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలకు మరింత సౌకర్యంగా శ్రీవారి దర్శనం

వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలకు మరింత సౌకర్యంగా శ్రీవారి దర్శనం : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

క్యూలైన్లలో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలు ఇబ్బందులకు గురౌతున్నారని భక్తుల నుంచి విజ్ఞప్తులు అందిన నేపథ్యంలో వారికి మరింత సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టినట్టు టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు.



వృద్ధులు, దివ్యాంగులకు జూలై 18, 25వ తేదీల్లో ఉదయం 10 గంటలకు వెయ్యి మందికి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల మందికి, మధ్యాహ్నం 3 గంటలకు మరో వెయ్యి మందికి కలుపుకుని 4 వేల మందికి దర్శన టోకెన్లు జారీ చేస్తామని ఈవో తెలిపారు. ఇదివరకు ఒక సంవత్సరంలోపు ఉన్న చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను సుపథం ద్వారా దర్శనానికి అనుమతించేవారమని, భక్తుల వినతి మేరకు జూలై 19, 26వ తేదీల్లో 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలను, వారి తల్లిదండ్రులను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని వివరించారు. ప్రతినెలా రెండు రోజుల పాటు ఈ కేటగిరి భక్తులకు శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పిస్తామని, ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని ఈవో కోరారు.

శ్రీవారి భక్తులకు అందించే లడ్డూ ప్రసాదంపై జీఎస్‌టి ప్రభావం ఉండదని, బంగారు డాలర్లు, గదులు, కల్యాణమండపాలు జీఎస్‌టి పరిధిలోకి వస్తాయని ఈవో తెలిపారు. సామాన్య భక్తులపై జీఎస్‌టి ప్రభావం ఏ మాత్రం ఉండదన్నారు. బంగారు డాలర్లుపై 3 శాతం, రూ.1,000/- నుంచి రూ.2,500/- అద్దె గల గదులపై 12 శాతం, రూ.10 వేల కంటే ఎక్కువ అద్దె గల కల్యాణమండపాలపై 18 శాతం జీఎస్‌టి వర్తిస్తుందని వివరించారు. జీఎస్‌టి కారణంగా టిటిడి కొనుగోలు చేసే వివిధ వస్తువులకు సంబంధించి రూ.32 కోట్లు, టిటిడి భక్తులకు అందించే సేవలపై రూ.19 కోట్లు ఒక ఏడాదికి భారం పడుతుందన్నారు.

టిటిడిలో 86 శాతం గదుల అద్దె రూ.1000/- లోపు మాత్రమే ఉందని, ఈ కారణంగా గదుల విషయంలో సామాన్య భక్తులపై ఎలాంటి అదనపు భారం ఉండదన్నారు. ఈ ఏడాది జూన్‌లో 25,77,165 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని, ఇది గతేడాది కంటే 1.08 లక్షలు అధికమని తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో కోటి 74 వేల లడ్డూలను భక్తులకు అందించామని, గతేడాది జూన్‌లో 94 లక్షల లడ్డూలు అందించామని తెలిపారు. అదేవిధంగా హుండీ ద్వారా ఈ ఏడాది జూన్‌లో రూ.86.56 కోట్లు కాగా, గతేడాది జూన్‌లో రూ.90.38 కోట్లు వచ్చిందన్నారు. అనంతరం పలు విషయాలను ఈవో తెలియజేశారు. ఈవో మాటల్లోనే…

సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 1 వరకు శ్రీవారి బ్రహ్మూెత్సవాలు


తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలు ఈ ఏడాది సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 1వ తేదీ వరకు జరుగనున్నాయి. గత బ్రహ్మూెత్సవాలలో ఎదురైన అనుభవాలను బేరీజు వేసుకుని అవసరమైన మార్పులతో భక్తులకు మరింత మెరుగ్గా ఏర్పాట్లు చేపడుతున్నాం. సెప్టెంబర్‌ 15వ తేదీలోపు బ్రహ్మూెత్సవాల ఏర్పాట్లను పూర్తి చేస్తాం.

వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలకు మరింత సౌకర్యంగా శ్రీవారి దర్శనం : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

గదులు రద్దు చేస్తే రిఫండ్‌


తిరుమలలో ఆన్‌లైన్‌ ద్వారా గదులు బుక్‌ చేసుకుని గడువుకు ముందే ఖాళీ చేస్తున్న భక్తులకు జూన్‌ 15వ తేదీ నుంచి రీఫండ్‌ విధానాన్ని అమలుచేస్తున్నాం. జూలై 5వ తేదీ వరకు 12 గంటలలోపు 773 మంది భక్తులు గదులు ఖాళీచేసి 50 శాతం మొత్తాన్ని, 18 గంటలలోపు 1,419 మంది భక్తులు గదులు ఖాళీ చేసి 25 శాతం మొత్తాన్ని రీఫండ్‌గా పొందారు. మొత్తం 2,226 మంది భక్తులకు రూ.1,32,897/- రీఫండ్‌ చెల్లించాం. గదులు బుక్‌ చేసుకున్న తేదీ నుండి రెండు రోజుల ముందుగా రద్దు చేసుకుంటే 100% అద్దెను జూలై 3వ తేదీ నుండి తిరిగి చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు 965 మంది భక్తులకు అద్దెను తిరిగి చెల్లించాం.

వెండి వాకిలి వద్ద క్యూలైన్‌ మార్పు


వెండివాకిలి వద్ద క్యూలైన్ల నిర్వహణలో పలు మార్పులు తీసుకొచ్చాం. ఇందులోభాగంగా వెండివాకిలి చేరేందుకు ఉన్న మూడు క్యూలైన్లను రద్దు చేసి ఒకే క్యూను ఏర్పాటుచేశాం. తద్వారా ఇక్కడ తోపులాటలు నివారించాం.

శ్రీవారి ఆలయంలో రెండు వరుసల్లో భక్తులకు తీర్థం


గత డయల్‌ యువర్‌ ఈవోలో భక్తులు చేసిన సూచన మేరకు శ్రీవారి ఆలయంలో స్వామివారి తీర్థం పంపిణీ చేసేందుకు రెండు వరుసలు ఏర్పాటుచేశాం.

హెల్ప్‌డెస్క్‌



  •  ప్రతి కంపార్ట్‌మెంట్‌లో భక్తుల సమస్యలను పరిష్కరించేందుకు హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటుచేశాం.

  • కంపార్ట్‌మెంట్లలో వేచి ఉంటున్న భక్తుల నుంచి సమస్యలు, సూచనలు, అభిప్రాయాలను శ్రీవారి సేవకుల ద్వారా సేకరించి, తగిన చర్యలు తీసుకుంటున్నాం.

  • కంపార్ట్‌మెంట్లలో భక్తులు తమ బంధుమిత్రులతో మాట్లాడుకునేందుకు ఉచిత ఫోన్‌ సౌకర్యాన్ని కల్పించాం.

  • వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో అవసరమైన చోట అదనంగా ఫ్యాన్లు, ఎక్జాస్ట్‌ ఫ్యాన్లు, మరుగుదొడ్లు ఏర్పాటుచేస్తున్నాం. ఈ సౌకర్యాలను భక్తులు వినియోగించుకోవాలని కోరుతున్నాం.

దివ్యదర్శనం(వైకుంఠం-1) భక్తులకు యాక్సెస్‌కార్డులు


సర్వదర్శనం భక్తులకు ఇస్తున్న తరహాలోనే దివ్యదర్శనం(వైకుంఠం-1) భక్తులకు జూన్‌ 30వ తేదీ నుంచి యాక్సెస్‌ కార్డులు జారీ చేస్తున్నాం. దివ్యదర్శనం కాంప్లెక్స్‌లో లడ్డూలకు టోకెన్లు పొందిన తరువాత ఎప్పుడైనా వెలుపలికి రావచ్చు. సూచించిన దర్శన సమయానికి తిరిగి కంపార్ట్‌మెంట్లలోకి ప్రవేశించవచ్చు.

Source