తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు గదులు పొందేందుకు జూలై 12వ తేది నుంచి నమోదు చేసుకునే విధానాన్ని నూతనంగా వ్రవేశపెడుతున్నట్లు టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గత డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పలువురు భక్తులు చేసిన సూచన మేరకు తిరుమలలో గదులు పొందేందుకు సులభతరమైన విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఇందుకోసం కేంద్రీయ విచారణ కార్యాలయంలో 10 కౌంటర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కౌంటర్లలో ముందుగా భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
అందుబాటులో ఉన్న గదులను మొదట నమోదు చేసుకున్నవారికి మొదటనే అనే ప్రాతిపదికన కేటాయిస్తామన్నారు. గదుల కేటాయింపు సమాచారాన్ని సంబంధిత భక్తులకు ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా తెలియజేస్తామని వివరించారు. ఈ విధానంలో భక్తులు ఎక్కువసేపు క్యూలైన్‌లో వేచిఉండాల్సిన అవసరం లేదన్నారు.
ఆన్‌లైన్‌లో 56,295 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల
అక్టోబర్ నెలకు సంబంధించి 56,295 సేవా టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు ఈవో వెల్లడించారు. ఇందులో ఆన్‌లైన్ డిప్ విధానంలో సుప్రభాతం 7,780, తోమాల 120, అర్చన 120, విశేష పూజ 1,875, అష్టదళపాద పద్మారాధన 300, నిజపాద దర్శనం 2,300 టికెట్లు కలిపి మొత్తం 12,495 సేవా టికెట్లు ఉన్నాయన్నారు. భక్తులు ఆర్జితసేవల కోసం వారం రోజుల పాటు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్‌లైన్ డిప్‌లో ఆర్జితసేవలు పొందిన భక్తులు 3 రోజులలో పేమెంట్ చేయాల్సి ఉంటుందన్నారు. సొమ్ము చెల్లించనిచో సదరు టికెట్లను మరోసారి ఆన్‌లైన్ డిప్ తీసి ఇతర భక్తులకు కేటాయిస్తామని తెలియజేశారు. వారికి కూడా పేమెంట్ చేసేందుకు 3 రోజులు గడువు ఇస్తామన్నారు.జూలై 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రెండో విడత డిప్‌తోపాటుగా, సెప్టెంబర్ నెలలో మిగిలిన టికెట్లను కూడా రెండవ సారి డిప్ తీస్తామని వివరించారు. అదేవిధంగా, ఆన్‌లైన్ సాధారణ ఆర్జిత సేవా టికెట్లు 43,800 ఉన్నాయి. వీటిలో కల్యాణోత్సవం 10,500, ఊంజల్ సేవ 2,800, ఆర్జితబ్రహ్మూెత్సవం 6,020, వసంతోత్సవం 11,180, సహస్రదీపాలంకార సేవ 13,300 టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాం. వరంగల్‌కు చెందిన సత్యనారాయణ, ప్రకాశంకు చెందిన నరసింహారావు అడిగిన ప్రశ్నలకు ఈవో పైవిధంగా సమాధానం ఇచ్చారు.
Source