
శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం అప్రమత్తంగా ఎస్పీఎఫ్ సిబ్బంది విధులు నిర్వహించాలని టిటిడి ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ ఎ.రవికృష్ణ సూచించారు. తిరుపతిలోని శ్వేత భవనంలో సోమవారం టిటిడిలో విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ సిబ్బందితో దర్బార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సివిఎస్వో మాట్లాడుతూ తిరుపతి, తిరుమలలో భద్రతను మరింత కట్టుదిట్టడం చేయడంలో భాగంగా మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మొదటి అంచెలో అలిపిరి చెక్‌పాయింట్, అలిపిరి నడకమార్గం, శ్రీవారిమెట్టు వద్ద ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌తో కూడిన సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెండో అంచెలో సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా తిరుమలలోని ముఖ్యమైన అన్ని ప్రాంతాల్లో సిసి కెమెరాల ద్వారా 24 గంటల పాటు భద్రతను పర్యవేక్షిస్తామని వెల్లడించారు.
మూడో అంచెలో వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్(డిఎఫ్ఎండి), లగేజి స్కానర్ ద్వారా కట్టుదిట్టంగా తనిఖీలు చేపడతామన్నారు. ఎస్పీఎఫ్ సిబ్బంది భక్తులతో గౌరవప్రదంగా వ్యవహరించాలన్నారు. వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, కుటుంబ సభ్యులకు తగిన సమయం కేటాయించాలని, చెడు వ్యసనాలకు లోను కాకూడదని సూచించారు.
అనంతరం అలిపిరి చెక్‌పాయింట్ వద్ద మెరుగ్గా భద్రతా విధులు నిర్వహించిన 20 మంది ఎస్పీఎఫ్ సిబ్బందికి ప్రశంసాపత్రాలు, నగదు బహుమతిని సివిఎస్వో అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీఎఫ్ కమాండెంట్ శ్రీ బివి.రామిరెడ్డి, డిఎస్పీలు శ్రీ ఎంఎల్.మనోహర్, శ్రీ ఎం.శంకర్రావు, ఇన్స్పెక్టర్లు శ్రీ ఎన్వి.రాజు, శ్రీ ఎపిఎంఎస్.రెడ్డి, ఎవిఎస్వో శ్రీ గంగరాజు, 300 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
అలిపిరిలో నిషేధిత వస్తువుల స్వాధీనం
అలిపిరి చెక్‌పాయింట్ వద్ద సోమవారం ఉదయం పలు నిషేధిత వస్తువులను ఎస్పీఎఫ్, టిటిడి సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు చెందిన మూడు వాహనాల్లో 7 మద్యం బాటిళ్లు, 100 గ్రాముల గంజాయి, ఇతర నిషేధిత వస్తువులను గుర్తించారు. నిషేధిత వస్తువులు కలిగివున్న వ్యక్తులను ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు.Source