ఆగస్టు 4న వరలక్ష్మీ వ్రతానికి తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు




తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 4న నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్టు టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్‌ తెలిపారు. తిరుచానూరులోని ఆస్థానమండపంలో గురువారం ఆయన వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ వరలక్ష్మీ వ్రతం టికెట్లను ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంచామని, భక్తులు బుక్‌ చేసుకోవాలని కోరారు. ఆగస్టు 3వ తేదీన 200 టికెట్లను ఆలయం వద్ద గల కౌంటర్‌లో విక్రయించాలని అధికారులకు సూచించారు. వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు తిలకించేందుకు వీలుగా ఆస్థానమండపంలో, రథమండపం వద్ద ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటుచేయాలని ఆదేశించారు.

అమ్మవారి ఆలయం, ఆస్థాన మండపం, ఇతర ప్రాంతాల్లో ఆకట్టుకునేలా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ చేపట్టాలని సూచించారు. కంకణాలు, కుంకుమ ప్యాకెట్లు, కరపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని, భజన బృందాలను ఏర్పాటుచేయాలని హిందూ ధర్మప్రచార పరిషత్‌ అధికారులను ఆదేశించారు.

వ్రతాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు తగిన లైటింగ్‌ ఏర్పాట్లు చేపట్టాలని జెఈవో సూచించారు. ఆస్థానమండపంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు ఏర్పాటుచేయాలన్నారు. అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో ముందస్తుగా క్యూలైన్లు తదితర ఏర్పాట్లు చేపట్టాలన్నారు. రెండు రోజులు ముందు నుంచి తిరుచానూరు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో ప్రచార రథాల ద్వారా వరలక్ష్మీ వ్రతం విశిష్టతను తెలియజేయాలన్నారు.

కాగా, వరలక్ష్మీవ్రతం రోజున ఉదయం 3.30 నుంచి 5.00 గంటల వరకు మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం, ఉదయం 10.00 నుంచి 12.00 గంటల వరకు ఆస్థానమండపంలో వరలక్ష్మీవ్రతం, సాయంత్రం 6.00 గంటలకు స్వర్ణరథం ఊరేగింపు నిర్వహిస్తారు. భక్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనవచ్చు. ఈ కారణంగా అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, ఊంజల్‌సేవ రద్దయ్యాయి.