
తరతరాలకు స్ఫూర్తినిచ్చే అన్నమయ్య సంకీర్తనల సాహిత్య సంపద : ఆచార్య ఆంజనేయులు
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల సంకీర్తనలు భక్తి, తాత్వికత, మానవీయ విలువల సమ్మేళనంగా తరతరాలకు స్ఫూర్తినిచ్చే అపూర్వ సాహిత్య సంపదగా నిలిచాయని హైదరాబాద్ కు చెందిన ఆచార్య ఆంజనేయులు తెలిపారు. అన్నమయ్య 618వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం సాహితీ సదస్సులు ఘనంగా ప్రారంభమయ్యాయి.సదస్సుకు అధ్యక్షత వహించిన ఆయన “ప్రాచీనాంధ్ర సాహిత్యంలో అన్నమయ్య ప్రత్యేకత” అంశంపై మాట్లాడుతూ, తాళ్లపాక అన్నమాచార్యులను తొలి వాగ్గేయకారుడిగా అభివర్ణించారు. ఆయన సంకీర్తనలు భక్తిని గాఢం చేసే దివ్య మార్గదర్శకాలుగా నిలిచాయని పేర్కొన్నారు.
హైదరాబాద్ కు చెందిన డా. అనంత పద్మనాభ రావు “అన్నమయ్య సంకీర్తనల ప్రచారం–ప్రసారం”పై మాట్లాడుతూ, టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ద్వారా సంకీర్తనల ప్రచారం సమర్థవంతంగా కొనసాగుతోందన్నారు. రేడియో, టీవీ, డిజిటల్ వేదికల ద్వారా ఈ కీర్తనలు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు.
తిరుపతికి చెందిన ఆచార్య దామోదర నాయుడు తాళ్లపాక కవుల పదప్రయోగాల వైశిష్ట్యాన్ని వివరించగా, ఆచార్య చెన్నప్ప అన్నమయ్య కీర్తనల్లో సమానత్వం, మానవత్వం ప్రతిఫలిస్తున్నాయని తెలిపారు.

అన్నమయ్య 618వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం రెండవ రోజు సాహితీ సదస్సు ఘనంగా జరిగింది.
సదస్సుకు అధ్యక్షత వహించిన హైదరాబాద్‌కు చెందిన శ్రీమతి నాగపద్మిని “అన్నమయ్య తీర్చిన అలమేల్మంగా” అనే అంశంపై ఉపన్యసిస్తూ, అన్నమయ్య శృంగార సంకీర్తనల భావ వైశాల్యం అపారమని పేర్కొన్నారు. ఆయన కీర్తనల్లో మధురభక్తి, సాహిత్య సౌందర్యం సమన్వయంగా ప్రతిఫలిస్తుందని వివరించారు.
“పలుకు తేనెల తల్లి…”, “ఏమని పొగడుదమే…”, “అలరులు కురియగా…” వంటి సంకీర్తనల్లో అలమేల్మంగా అమ్మవారిని మాధుర్యభరితంగా వర్ణించిన తీరు విశిష్టమని తెలిపారు.
డా. ఆముదాల మురళి “అన్నమయ్య అద్వైత తత్వం”పై మాట్లాడుతూ, శరణాగతి, లోకనీతి, వేదసారాన్ని సమన్వయపరిచి అన్నమయ్య సాహిత్యం నిర్మించారని చెప్పారు. భక్తి సాహిత్యంలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు.
డా. షేక్ షావళి “అన్నమయ్య, సూరదాసుల సంకీర్తనల్లో నవవిధ భక్తి” అంశంపై మాట్లాడుతూ, భగవత్ సంకీర్తన ద్వారా మోక్షం సిద్ధిస్తుందని వివరించారు.
మహతి కళాక్షేత్రంలో…
మహతి కళాక్షేత్రంలో కూడా సాయంత్రం 6 గం.లకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి సుశీల బృందం భక్తి సంగీత కార్యక్రమం, రాత్రి 7 గం.లకు శ్రీ పద్మ కళాక్షేత్ర డ్యాన్స్ అకాడమీ వారి నృత్య కార్యక్రమం నిర్వహించారు.
