నోములు-వ్రతాలు - అక్షయబొండాల నోము ఎలా ఆచరించాలి?





మనం అనేక రకాల వ్రతాలు ఆచరిస్తూ ఉంటాం. స్త్రీలు సౌభాగ్యం కోరుతూ రకరకాల నోములు పడుతూ ఉంటారు. వాటిలో ఒ ముఖ్యమైన నోము అక్షయ బొండాల నోము. ఈ నోము ఏవిధంగా ఆచరించాలి, దాని 
ఫలితం ఏమిటి అనే వివరాలు తెలుసుకుందాం. 

నోములకి వ్రతాలకి మధ్య తేడా ఏమిటి?

వ్రతాలు అంటే అందరూ తప్పనిసరిగా ఆచరించవలసినవి. నోములు అయితే వాటిని ప్రత్యేకమైన రోజున కథ చదివి అక్షతలు వేసుకుని పట్టవలసి ఉంటుంది. వ్రతాలు అంటే ప్రతీ ఏడాది మనం ఆచరించే వరలక్ష్మీ వ్రతము, వినాయక వ్రతము, త్రినాధ వ్రతము, వారి ఇంటి సంప్రదాయాన్ననుసరించి చేసే కేదారేశ్వర వ్రతము, ముఖ్యంగా ప్రతీ కుటుంబం ఆచరించాల్సిన సత్యనారాయణస్వామి వ్రతము మొదలైనవి ఉంటాయి. 

నోములు అలాకాదు. వాటిని పుణ్యస్త్రీలు కథ చదివి అక్షతలు వేసుకుని ఉద్యాపన చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాటిలో ముఖ్యమైనది ఈ అక్షయబొండాల నోము. 

మన సౌభాగ్యం అక్షయమవ్వాలని, కుటుంబ సంపదలు అక్షయమవ్వాలని, కుటుంబంలో అందరి ఆరోగ్యం అక్షయమవ్వాలని కోరుతూ సువాసిని స్త్రీలు ఈ నోము నోచుకుంటారు. 

నోము ఎప్పుడు పట్టాలి? 

ముఖ్యంగా ఏ నోము అయినా మాఘమాసంలో వచ్చే రథసప్తమి అంటే పౌర్ణమి ముందు వచ్చే సప్తమి రోజున కాని, మహాశివరాత్రి రోజున కాని పట్టాలి.  మనం పడదామనుకున్న నోము కథను చదువుకుని, అక్షతలు తలపై వేసుకుని ప్రారంభించాలి. ఈ అక్షయబొండాల నోమును కూడా అలాగే రథసప్తమి, మహాశివరాత్రి రోజుల్లో ఏదో ఒక రోజున ముందుగా నోము కథ చదువుకుని నోము పట్టాలి. 

నోములో భాగంగా ఏం చేయాలి?

ఈ అక్షయబొండాల నోము పట్టిన వారు ప్రతీ రోజు ఐదుగురు పుణ్యస్త్రీలకు ఐదు పసుపు ఉండలు ఇవ్వాలి. ముందుగా ముత్తయిదువకు కాళ్ళకు పసుపు రాసి, బొట్టు పెట్టి, గంథం అలంకరించి, అక్షతలు ఆమె చేతికిచ్చి పసుపు ముద్దలు అందించి ఆమె ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ పసుపు ఉండలను తమలపాకులో పెట్టి ఇవ్వాలి. ఇలా ఏడాదిపాటు అంటే మనం రథసప్తమిరోజున నోము పడితే మళ్ళీ ఏడాది రథ సప్తమి వరకూ ప్రతీ రోజూ రోజుకు ఐదుగురు ముత్తయిదువలకు ఇస్తూ ఉండాలన్నమాట. 

ఉద్యాపన ఎప్పుడు చేసుకోవాలి?

ప్రతీ నోముకు ఉద్యాపన చేసుకోవాల్సి ఉంటుంది. అక్షయబొండాల నోముకు కూడా మనం పట్టిన ఏడాదిలో ఎప్పుడైనా ఉద్యాపన చేసుకోవచ్చు. అయితే వీటికి కొన్ని మాసాలు, రోజులు శ్రేష్టమని పెద్దలు చెబుతారు. చైత్రమాసము, వైశాఖమాసము, శ్రావణము, ఆశ్వయుజము, కార్తీకము, మాఘమాసము ఎంతో శ్రేష్టమైనవి. అయితే భాద్రపదము, పుష్యమాసము, అధికమాసాలు, ఆషాఢము తదితర మాసాల్లో సాధారణంగా ఉద్యాపనలు చేయరు. 

ఈ నోము ఉద్యాపనకు ప్రత్యేక మైన వారాలు, తిధులు అంటూ ఏమైనా ఉంటాయా?

ఉద్యాపన శుక్రవారము, మంగళవారాలు, అమావాస్య రోజుల్లో కూడా చేయకూడదు. ఆదివారం చేపడితే చాలా ఉత్తమం అని పెద్దలమాట.

ఈ నోము ఉద్యాపనకు ఏమేమి కావాలి?

అక్షయబొండాల నోము ఉద్యాపనకోసం 30 కొబ్బరిబొండాలు(నీళ్ళబొండాలు), ఐదు జాకట్టుముక్కలు, ఐదు తాంబూలాలు, దక్షిణ, అరటిపళ్ళు, వక్కలు, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు కావాలి.

ఉద్యాపన ఎలా చేయాలి?

ముందుగా ఐదుగురు ముత్తయిదువలను ముందురోజే వారి ఇంటికి వెళ్ళి బొట్టుపెట్టి నేను అక్షయబోండాల నోము చేసుకుంటున్నాను, వాయినం అందుకోడానికి రావాలని ఆహ్వానించాలి. ఉద్యాపనరోజున ముందుగా  కొబ్బరిబొండాలను శుభ్రంచేసి పసుపు రాసి కుంకుమబొట్లు పెట్టాలి. వాటిని ఐదేసి వంతున పళ్ళాలలో సిద్ధంచేసుకోవాలి. గౌరీదేవి ముందు దీపారాధన చేసి అష్టోత్తర శతనామాలతో అమ్మవారికి కుంకుమార్చన చేయాలి. క్షీరాన్నం నివేదన చేయాలి. అమ్మవారికి ముందుగా ఐదు కొబ్బరి బొండాలను నివేదన చేయాలి. 

తరువాత వచ్చిన ముత్తయిదువలను ఐదుగురినీ ఆసనాలపై కూర్చుండబెట్టి అందరికీ కాళ్ళకు పసుపు రాసి, కుంకుమ, గంథం అలంకరించాలి. తరువాత పళ్ళెంలో ఉన్న కొబ్బరిబొండాలు, జాకట్టుముక్క, పసుపు, కుంకుమలు, గాజులు తాంబూలంతో పాటు ఒక్కో ముత్తయిదువకు అందిస్తూ ఇస్తినమ్మవాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం అంటూ ఐదుగురికీ అందించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ సమయంలో ప్రతీ ముత్తయిదువకు ఇచ్చేటప్పుడూ ఈ పాటను కూడా ముందుగా పాడాలి.  

అక్షయబొండాల నోము నోచిన సతికి అక్షయము సౌభాగ్య మక్షయముసంతు, 

అక్షయము సుఖములు అక్షయానందములు, అక్షయము సంపదలు అక్షయాసిరులు, 

అక్షయభోగములు అవని నిత్యమ్మగును, అక్షయ లోకములు నిశ్చయముగాను. 

నోము అయిన తరువాత ఏం చేయాలి?

ముత్తయిదువలందరికీ వాయినాలు ఇచ్చిన తరువాత ఒక ఇత్తడి పళ్ళెంలోకానీ, రాగి పళ్ళెంలో కాని అక్షతలు, నీళ్ళు వదిలిపెట్టాలి. ఇప్పుడు ‘పద్దతిలో లోపం కలిగినా ఫలితంలో లోపం రాకూడదు’ అని భగవంతుని ప్రార్ధించాలి. నోము ఉద్యాపన అయిన తరువాత భర్త ఆశీర్వాదం తీసుకోవాలి. దానితో అక్షయబొండాల నోము పరిపూర్ణమవుతుంది. 

అక్షయబోండాల నోము ఎందుకు చేస్తారు? ధాని ఫలితమేమిటి?

అక్షయబొండాలు నోము నోచిన పడతికి సిరులు, సౌభాగ్యములు అక్షయమవుతాయి. 

నోములు వ్రతాలు అనేవి భగవంతుని చేరుకోవడానికి ఉన్న మార్గాల్లో ముఖ్యమైనవి. మనం మన సంప్రదాయాలను కొనసాగించడంలో భాగంగా ఈ నోములు వ్రతాలను మన తరువాతి తరాలకు కూడా అందించడం మన బాద్యతగా అందరూ భావించాలి. అలా చేసినపుడే మన సంప్రదాయం ముడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతుంది. ఈ నోములు వ్రతాల వెనుక ఒక శాస్త్రీయత కూడా దాగి ఉంది. భవితరాలు శ్రేయస్సు కోరే ఈ వ్రత విధానాలను పెద్దలు రూపొందించారు. మన పూర్వీకులు మనకు అందించిన ఈ విధానాలను  కొనసాగించడానికి మనమంతా కృషిచేయాలి.