శ్రీకృష్ణుడు రుద్రరూపంలోనా?- త్రిచంబరం శ్రీకృష్ణ ఆలయం


శ్రీకృష్ణుడు శాంతమూర్తి, ఆనందమూర్తి, చిన్నికృష్ణుని చిలిపిచేష్టల్ని మనం ఇష్టపడతాం. కానీ శ్రీకృష్ణుడు రౌద్ర రూపంలో కూడా ఉంటాడంటే నమ్మశక్యంకాదుగదా. కేరళ అంటేనే గజరాజుల ఆవాసాలు. హిందూ దేవాలయాల్లో ఎక్కడ ఏ ఉత్సవం జరిగినా కేరళ రాష్ట్రంలో గజరాజులు రాజసాన్ని ప్రదర్శిస్తూ ఊరేగుతాయి. కానీ ఆ ఆలయంలో అందుకు భిన్నంగా ఉత్సవంలో ఏనుగులను వినియోగించడం నిషిద్ధం. ప్రతీ దేవాలయంలోను షోడశోపచార పూజల అనంతరం ధూపదీపనైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీ. కానీ ఆ ఆలయంలో మాత్రం పూజకన్నా ముందే భగవంతునికి ప్రసాదాన్ని నివేదిస్తారు. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఆలయం ఎక్కడుందో అని కదా మీ సందేహం. ఆ ఆలయంపేరే ‘త్రిచంబరం శ్రీకృష్ణ ఆలయం’ కేరళ రాష్ట్రం కన్నూరు జిల్లా తెలిపరంబ పట్టణానికి సమీపంలోనే ఈ ఆలయం మనకు దర్శనమిస్తుంది. ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి. 

త్రిచంబరం ఆలయ పరిచయం

త్రిచంబరం శ్రీకృష్ణ ఆలయం కేరళ రాష్ట్రంలోని కన్నూరు జిల్లా తెలిపరంబ పట్టణానికి సమీపంలో ఉన్న ప్రసిద్ధ వైష్ణవక్షేత్రం. ఇది కన్నూరు నుండి సుమారు 20 కి.మీ దూరంలో ఉంది.

ఈ ఆలయంలో ప్రధాన దైవం శ్రీకృష్ణుడు. అయితే ఈ దేవుడు సాధారణంగా కనిపించే బాలకృష్ణ రూపంలో కాకుండా, కంసుని వధించిన తర్వాత ఉన్న "రౌద్ర రూపం"లో దర్శనమిస్తాడు.

త్రిచంబరం ఆలయ చరిత్ర

ఈ ఆలయం 10వ శతాబ్దానికి చెందినది అని భావిస్తారు. 11వ శతాబ్దపు సంస్కృత గ్రంథం మూషికవంశంలో ఈ ఆలయం ప్రస్తావించబడింది. ఆలయంలోని గర్భగుడిలో 15–16వ శతాబ్దాలకు చెందిన శిల్పాలు, గోడల మీద చిత్రాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం ఈ ఆలయ విగ్రహాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడు అనే నమ్మకం ఉంది.


రౌద్ర కృష్ణ స్వరూపం

కంసవధ అనంతరం క్రోధభరితమైన రూపంలో ఉన్న కృష్ణుడిని ఇక్కడ ఆరాధిస్తారు. అందువల్ల ఉదయం వెంటనే పూజ చేయకుండా, స్వామిని శాంతింపజేయడానికి చేయడం కోసం ముందుగా నైవేద్యం సమర్పిస్తారు. ఈ ఆలయాన్ని ఉత్తర గురువాయూర్ (North Guruvayoor) అని కూడా పిలుస్తారు.

ఇతర దేవతలు

ఆలయ పరిసరాలలో శివుడు, గణపతి, అయ్యప్ప (శాస్తా), విశ్వక్సేన, నాగదేవతలు

ఉన్నారు.

దుర్గాదేవి ఆలయం

ఆలయ ప్రాంగణంలో ఉన్న సరస్సు మధ్యలో దుర్గాదేవి ఆలయం ఉంది. ఇది కేరళలోని 108 దుర్గాలయాలలో ఒకటి.

ఉత్సవాలు

ప్రతి సంవత్సరం మార్చి నెలలో జరగుతుంది. కేరళ సంప్రదాయం ప్రకారం ప్రతీ కుంభ మాసంలో 22న ఈ ఉత్సవం జరుగుతుంది అంటే తెలుగు నెలల ప్రకారం మార్చి 6 నుండి 20 వరకూ 14 రోజుల పాటు జరుగుతుంది.

ఉత్సవంలో ముఖ్య కార్యక్రమాలు:

కొడియేట్టం అనే కార్యక్రమంతో పండుగ ప్రారంభం జరుగుతుంది

ఉత్సవాల్లో భాగంగా తితంబు నృత్యం అని – 11 రోజులు జరిగే ప్రత్యేక నృత్యం ఇక్కడ చాలా ప్రాముఖ్యత పొందింది. 

ఈ ఉత్సవంలో భాగంగా శ్రీకృష్ణుడు, బలరాముడి విగ్రహాలను నెత్తిన పెట్టుకుని అర్చకులు చేసే నృత్యం నృత్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

చివరగా కూడిపిరియల్ అనే పెరుతో ముగింపు వేడుక జరుగుతుంది

నియమం

ఈ ఉత్సవం జరిగే సమయంలో ఆలయ ప్రాంగణంలోకి ఏనుగులను అనుమతించరు. కంసుడు కృష్ణుడిని చంపడానికి 'కువలయాపీడనం' అనే ఏనుగును పంపినందున, కృష్ణుడు ఏనుగులను చూస్తే ఆగ్రహిస్తాడని ఇక్కడి నమ్మకం.

నిర్మాణ శైలి

కేరళ సంప్రదాయ ఆలయ నిర్మాణ శైలిలో నిర్మించబడింది

ద్వితల గర్భగుడి రెండు అంతస్తులతో ఉంటుంది. ఆలయం చుట్టూ మూడు కొలను (పుష్కరిణులు) ఉన్నాయి

ఈ ఆలయం TTK Devaswom బోర్డు ఆధ్వర్యంలో నిర్వహింపబడుతోంది. కనూర్ జిల్లాలో సుమారు 15 చారిత్రక ఆలయాలు ఈ బోర్డు ఆధ్వర్యంలో పరిరక్షింపబడుతున్నాయి. టిటికె అంటే తలిపరంబ,త్రిచాంబరం, కంజిరన్ గడ్ దేవాశ్వం బోర్డు. దేవాశ్వం అంటే ప్రాపర్టీ ఆఫ్ గాడ్ అని అర్ధం.

యాత్రకు ఉత్తమ సమయం

అక్టోబర్ నుండి– మార్చి మాసాలు ఈ ఆలయ సందర్శనకు అనువైన సమయాలు మార్చిలో ఇక్కడ పండుగలు, ఉత్సవాలు నిర్వహిస్తారు

ఉదయం 5.00 గంటలనుండి మధ్యహాన్నం 12.00 వరకూ, సాయంత్రం 5.00 గంటలనుండి రాత్రి 8.00 వరకూ ఆలయం భక్తుల దర్వనానికి తెరచి ఉంటుంది.

ఎలా చేరుకోవాలి?

  • బస్సు: తాలిపరంబా బస్ స్టాండ్ నుండి ~1.5 కి.మీ
  • రైలు: కన్నూరు రైల్వే స్టేషన్ (~22 కి.మీ)
  • విమానం: కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం (~136 కి.మీ)

ఆలయం సమీపంలో కేరళ సాంప్రదాయ భోజనం దొరుకుతుంది

ముఖ్యంగా కేరళ సప్రదాయ ఆహారం సద్య (Sadya), దోస, పుట్టు, అప్పం వంటి పదార్ధాలతోఅన్న ప్రసాదం ఆలయంలో భక్తులకు లభిస్తుంది.

ఆలయంలోకి ప్రవేశించాలంటే భక్తులు విధిగా సంప్రదాయ దుస్తులు ధరించాలి. పురుషులు: ముండు (ధోతి), మహిళలు: చీర ఇతర సాంప్రదాయ దుస్తులు ధరించాలి.