వైభవంగా శ్రీ కోదండరాముని రథోత్సవం

తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు మంగళవారం ఉదయం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

ఉదయం 8.30 గంటలకు శ్రీ సీతా–లక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారు రథాన్ని అధిష్టించి నాలుగు మాడ వీధుల్లో విహరించారు. భక్తుల రామనామ స్మరణతో తిరుపతి తిరువీధులు మార్మోగాయి.

డప్పు వాయిద్యాలు, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా భక్తులు భక్తి భావంతో రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. రథం నాలుగు మాడ వీధుల్లో ఊరేగి యథాస్థానానికి చేరిన అనంతరం ప్రబంధం, వేద శాత్తుమొర నిర్వహించి హారతి ఇచ్చారు.

రథోత్సవానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక తాత్పర్యం ఉంది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులుగా భావిస్తారు. ఈ విధంగా శరీరాన్ని రథంతో పోల్చడం ద్వారా శరీరం వేరని, ఆత్మ భిన్నమని తెలియజేసే ఆత్మ–అనాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవం ద్వారా భక్తులకు ఈ తత్త్వజ్ఞానం తెలియజేయబడుతుంది.

మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అర్చకులు తిరుమంజనం, ఆస్థానం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటల నుండి 8.30 గంటల వరకు అశ్వవాహన సేవ వేడుకగా జరగనుంది.

శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 9 గంటల నుండి 10.30 గంటల వరకు కపిలతీర్థంలో చక్రస్నానం వైభవంగా నిర్వహించారు.